Chennai: వరదల నివారణకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ సంచలన నిర్ణయం- నగర వ్యాప్తంగా 57 స్పాంజ్ పార్కుల నిర్మాణం
వరద ముప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు నగర వ్యాప్తంగా 57 స్పాంజ్ పార్కులను నిర్మించనున్నారు. ఇందుకు రూ.7.67 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదించారు.
వర్షాకాలం వస్తే చాలు మెట్ర నగరాల్లో ఉండే ప్రజలకు వణకు మొదలవుతుంది. చిన్నపాటి వర్షాలకే రోడ్లు డ్రైనేజీలను తలపిస్తాయి. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ నీరు నిలిచి వాహనదారులకు చుక్కలు చూపిస్తాయి. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీల పరిస్థితి దారుణంగా తయారవుతుంది. తమిళనాడు రాజధాని చెన్నై పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారవుతుంది. సముద్రం పక్కన మరో సముద్రంలా మారిపోతుంది. వర్షం పడితే చెన్నై వాసుల కష్టాలు మాటల్లో వర్ణించలేం.
నగరంలోని చాలా ప్రాంతాలు ఏటా ముంపుబారిన పడుతూనే ఉంటాయి. 2015లో చెన్నైలో వచ్చిన వరదలు ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఇలా దశాబ్దాలుగా వేధిస్తున్న వరద, వర్షాల సమస్యలకు ముంపు పలికే దిశగా తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వరదల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. వరద నీటిని పీల్చి భూమిలోకి పంపే ప్రత్యేక స్పాంజ్‌పార్కుల నిర్మాణాలను చేపడుతోంది.
నీటిని పీల్చే స్పాంజ్ పార్కులు
వరద ముప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు నగర వ్యాప్తంగా 57 స్పాంజ్ పార్కులను నిర్మించనున్నారు. ఇందుకు రూ.7.67 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదించారు. వీటిలో నిర్మించే కుంటలు ఒక్కోటి 340 చ.మీ.నుంచి 7 వేల చ.మీ. వైశాల్యంలో ఉండేలా ప్రణాళిక రూపొందించారు. వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అక్కడి భూమిలో నీరు ఇంకే సామర్థ్యం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
ఇప్పటి వరకు 10 పార్కుల నిర్మాణం
పార్కు సామర్థ్యాన్ని బట్టి కుంటలను తవ్వుతున్నారు. వరద ఎక్కువైనప్పుడు ఈ నీరు పార్కులకు చేరేలా పైపులను అమర్చుతున్నారు. మధ్యలో ఎక్కువ లోతు ఉంచి చుట్టూ వాలుగా నిర్మిస్తున్నారు. ఓ మోస్తరు, భారీవర్షాల నీరు సైతం ఇందులోకి చేరేలా ఏర్పాట్లున్నాయి. తగినంత స్థలం ఉంటే ఒకటికి మించి కుంటలు తవ్వుతున్నారు. ఇలా ప్రస్తుతానికి 10 పార్కులను నిర్మించారు. వీటిలో స్థానికులకు ఆహ్లాదకరంగా ఉండేలా మొక్కలను పెంచుతున్నారు. వాకింగ్ చేయడానికి వీలుగా, పిల్లలు ఆడుకునేలా రూపుదిద్దుతున్నారు.
రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లతో భాగస్వామ్యం
స్పాంజ్ పార్కుల నిర్మాణాలపై జీసీసీ కమిషనర్ జె.రాధాకృష్ణన్ వివరిస్తూ.. ఏడాది పొడవునా పార్కులు పనికొచ్చేలా చేస్తున్నామన్నారు. ఈ పార్కుల ద్వారా వరదముప్పు తగ్గుతుందని, భూగర్భజలాలు పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. కుంటల్లో చేరిన నీటిలొ దోమల పెరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పార్కులను సంరక్షించేందుకు స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లనూ భాగస్వాములను చేస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
వరద కాలువల నిర్మాణం
చెన్నైలో వరద కాలువలు తక్కువగా ఉండడంతో వర్షాలు పడినప్పుడు నీరు వెళ్లే మార్గం లేక రోడ్లపై ప్రవహిస్తోంది. ఫలితంగా కాలనీలు కాలువలను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలని జీసీసీ నిర్ణయించింది. పెద్ద ఎత్తున నగరంలో వరదనీటి కాలువలను నిర్మిస్తోంది. రెండేళ్లలో 715.68 కి.మీ. మేర కాలువలు నిర్మించారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 106 రోడ్లలో 45 కి.మీ. వరద కాలువలను నిర్మించారు. మరో 108 రోడ్ల వెంట 23 కి.మీ. కాలువలను నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నారు. స్పాంజి పార్కుల్లో వరద ఎక్కువైనప్పుడు అక్కడికొచ్చే అదనపు నీటిని ఈ కాలువల్లోకి మళ్లించడం ద్వారా సమస్యను పరిస్కంచవచ్చని జీసీసీ భావిస్తోంది.