మే నెలలో గగన్‌యాన్ ప్రయోగం - కేంద్ర ప్రభుత్వం ప్రకటన
గగన్‌యాన్ ప్రాజెక్టు సన్నాహాల్లో భాగంగా నాలుగు అబార్ట్ మిషన్లలో మొదటిదైన టెస్ట్ వెహికల్ మిషన్ ‘టీవీ-డీ1’ను మేలో చేపడతామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు.
గగన్‌యాన్ ప్రాజెక్టు సన్నాహాల్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) నిర్వహించే నాలుగు అబార్ట్ మిషన్లలో మొదటిదైన టెస్ట్ వెహికల్ మిషన్ ‘టీవీ-డీ1’ను ఈ ఏడాది మేలో చేపడతామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతం అయిన తర్వాత మాత్రమే సిబ్బంది లేకుండా నిర్వహించే ప్రయోగం జరుగుతుంది. టీవీ-డీ2, మానవ రహిత అంతరిక్ష యాత్రలను 2024 మొదటి త్రైమాసికంలో చేపడతామని మంత్రి తెలిపారు. కాగా.. ఈ ప్రయోగంలో పాల్గొనే వ్యోమగాములకు మొదటి విడత శిక్షణ ఇప్పటికే పూర్తయింది.
భారతదేశ మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్రను ‘‘ గగన్ యాన్’’ పేరుతో చేపట్టనుంది. ఇప్పటికే దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే.. 2024లో భారత మొదటి అంతరిక్ష యాత్ర ప్రారంభం కానుంది. 2021లో గగన్ యాన్ చేపడుతామని ఇస్రో ప్రకటించినప్పటికీ.. కొవిడ్ మహమ్మారి కారణంగా ఈ మిషన్ ఆలస్యం అవుతూ వచ్చింది. గగన్‌యాన్ నాలుగు అబార్ట్ మిషన్‌లలో మొదటి టెస్ట్ వెహికల్ మిషన్ (టీవీ-డీ1) ను ఈ ఏడాది మేలో చేపడతామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. 2024లో గగన్ యాన్ ప్రయోగం ఉంటుందని వెల్లడించారు.
గగన్ యాన్ ప్రయోగాన్ని ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ దేశాలు మాత్రమే మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టగా.. వాటి సరసన నిలిచేందుకు భారత్ తొలిసారి మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టబోతోంది. అంతరిక్ష నౌకను భూమి నుంచి 15 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయోగించి అక్కడ నుంచి పారాచూట్లను ఉపయోగించి క్యాప్సూల్ ద్వారా వ్యోమగాములను భూమికి తీసుకురావడానికి ప్రయోగం చేస్తున్నారు. గగన్ యాన్ ట్రాక్ చేయడానికి ఇస్రో రిలే ఉపగ్రహాలను వినియోగించనుంది.
గగన్‌యాన్ కోసం ఇస్రో టెస్ట్ ప్లైట్ చేపట్టనుంది. ఇందు కోసం స్పేస్ ఫేరింగ్ హ్యూమనాయిడ్ రోబోను ఉపయోగించనున్నారు. ఈ హ్యూమనాయిడ్ రోబోకు ‘వ్యోమ్ మిత్ర’ అని పేరు పెట్టారు. టెస్ట్ ప్లైట్ కోసం దీన్ని బాహ్య అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. గగన్ యాన్ కోసం.. ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన నలుగురు ఫైటర్ పైలెట్లను ఇస్రో గుర్తించింది. రష్యా వీరికి శిక్షణ ఇస్తోంది. జీరో గ్రావిటీ, స్పేస్ వాతావరణాన్ని తట్టుకునేలా ఈ నలుగురు వ్యోమగాములు శిక్షణ తీసుకుంటున్నారు.
శాటిలైట్‌ను సముద్రంలో కూల్చేసిన ఇస్రో, అరుదైన ఘనత
అంతరిక్ష పరిశోధనల్లో పురోగతి సాధించిన దేశాలన్నీ విజయవంతంగా ఉపగ్రహాలను కక్ష్యల్లో ప్రవేశ పెట్టగలుగుతున్నాయి. అంతరిక్షయానాలకు మార్గాలను సుగమం చేసుకున్నాయి. కానీ కాలపరిమితి తీరిపోయిన ఉపగ్రహాలను కూల్చేయడం మాత్రం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఆ మధ్య చైనా ఇలా ఉపగ్రహాలను కూల్చేయడానికి ఆపసోపాలు పడింది, చివరకు విఫలం అయింది. కానీ ఇస్రో టార్గెట్ మిస్ కాలేదు. కాలపరిమితి తీరిపోయిన ఉపగ్రహాన్ని పూర్తి స్థాయి నియంత్రిత విధానంలో సురక్షితంగా సముద్రంలో కూల్చివేసింది. మేఘ-ట్రోపికస్-1 అనే ఈ ఉపగ్రహాన్ని పసిఫిక్ మహాసముద్రంలో కూల్చేసినట్లు ఇస్రో ఇటీవల ప్రకటించింది. భూవాతావరణంలోకి ప్రవేశించేంత వరకు ఇస్రో దాని గమనాన్ని పరిశీలించింది. ఆ తర్వాత ఉపగ్రహం పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది.