రిషి సునాక్‌కి టై కట్టిన అక్షతా మూర్తి, సోషల్ మీడియాలో ఫొటో వైరల్
G20 Summit 2023: ఫ్లైట్‌లో అక్షతా మూర్తి రిషి సునాక్‌కి టై కడుతున్న ఫొటో వైరల్ అవుతోంది.
G20 Summit 2023:
పోస్ట్ చేసిన సునాక్..
యూకే ప్రధాని రిషి సునాక్ G20 సదస్సు కోసం సతీమణి అక్షతా మూర్తితో కలిసి ఇండియాకి వచ్చారు. ప్రధాని హోదాలో తొలిసారి ఇండియాకి వచ్చిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే...పాలం ఎయిర్‌పోర్ట్‌లో దిగే ముందు విమానంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఫ్లైట్ దిగే ముందు రిషి సునాక్ తన టై సరి చేసుకోవాలనుకున్నారు. ఆయనకు సరిగ్గా తెలియదు అనుకుందో ఏమో...అక్షతా మూర్తి వెంటనే ఆయన వద్దకు వెళ్లి తానే టై కట్టింది. ఆయన సిబ్బంది ఆ టైమ్‌లోనే ఫొట్ క్లిక్‌మనిపించారు. అదే ఫొటోని రిషి సునాక్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. అలా షేర్ చేశారో లేదో..వెంటనే వైరల్ అయిపోయింది ఈ క్యాండిడ్ పిక్. అంత పెద్ద హోదాలో ఉన్నా....ఈ జంట సింపుల్‌గా కనిపిస్తోందని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Why I’m at the #G20👇 pic.twitter.com/BzjKo160hX
— Rishi Sunak (@RishiSunak) September 8, 2023
G20 సదస్సుకి హాజరయ్యేందుకు శుక్రవారం (సెప్టెంబర్ 8) ఢిల్లీ చేరుకున్నారు యూకే ప్రధాని రిషి సునాక్. సతీమణి అక్షతా మూర్తితో కలిసి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. ఇండియాకి రావడం చాలా సంతోషంగా ఉందని, భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు రిషి సునాక్. తనని ఇండియా అల్లుడిగా పిలవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ పర్యటన తనకెంతో ప్రత్యేకం అని వెల్లడించారు. మూడు రోజుల పాటు భారత్‌లోనే ఉండనున్నారు సునాక్. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు రిషి సునాక్.
"ఇండియా పర్యటన నాకెంతో స్పెషల్. నన్ను ఇండియా అల్లుడిగా పిలవడం చాలా సంతోషం. ఎంతో ఆత్మీయమైన పిలుపు అది. భారత్ అంటే నాకు చాలా ఇష్టం"
- రిషి సునాక్, యూకే ప్రధాని
G20 సమ్మిట్‌లో ఏమేం చర్చించాలో ముందుగానే నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు రిషి సునాక్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంపై అందరూ దృష్టి సారించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించీ ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించారు. ఈ సమస్య పరిష్కారంలో భారత్ పాత్ర అత్యంత కీలకమనీ తేల్చి చెప్పింది. బ్రిటన్‌లోని ఖలిస్తాన్‌కు సంబంధించిన ఓ ప్రశ్నపై ప్రశ్నపై మాట్లాడుతూ.. హింసను, మతోన్మాదాన్ని తాను సహించబోనని అన్నారు. ‘‘ఇది చాలా ముఖ్యమైన సమస్య. బ్రిటన్‌లో మతోన్మాదం లేదా హింస ఏ రూపంలో ఉన్నా సహించబోమని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మేం ఈ సమస్యపై భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. ముఖ్యంగా PKE (ప్రో ఖలిస్తాన్ తీవ్రవాదం) సమస్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం’’ అని అన్నారు
"G20 సదస్సులో ఏమేం మాట్లాడాలో ముందుగానే నిర్ణయించుకున్నాను. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థని స్థిరీకరించాలి. అంతర్జాతీయ సంబంధాలనూ మెరుగు పరచాలి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించాలన్నదీ మా ప్రధాన అజెండా. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడంలో భారత్ పాత్ర అత్యంత కీలకం"
- రిషి సునాక్, యూకే ప్రధాని
Also Read: G20 Summit 2023: ఢిల్లీ డిక్లరేషన్ని ఆమోదించిన G20 నేతలు, ప్రధాని మోదీ కీలక ప్రకటన