కర్ణాటక మహిళా ఉద్యోగి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
Karnataka Officer Pratima: బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వ అధికారి ప్రతిమ కేఎస్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Karnataka Officer Pratima: బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వ అధికారి ప్రతిమ కేఎస్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో గనులు, భూవిజ్ఞాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కేఎస్ ప్రతిమ(43)ను గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతిమ హత్య గురించి తెలిసిన సహోద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక పర్యావరణ శాఖ సీనియర్ అధికారి దినేష్ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిమ చాలా డైనమిక్ లేడీ అన్నారు. ఆమెకు డిపార్ట్‌మెంట్‌లో మంచి పేరు ఉందన్నారు. ప్రతిమ చాలా ధైర్యవంతురాలని, అక్రమాలు జరుగుతున్న పలు ప్రాంతాలపై ఆమె ఇటీవల దాడులు చేశారని అన్నారు. ఆమె ఎవరినీ శత్రువులను చేసుకోలేదని, కొత్త నిబంధనల ప్రకారం బాధ్యతలు నిర్వర్తించారని, గొప్ప పేరు సంపాదించుకున్నారని అధికారి చెప్పారు.
కర్ణాటకలో ఇటీవల ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. కర్ణాటక గనులు, భూవిజ్ఞాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కేఎస్ ప్రతిమ(43)ను గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా చంపేశారు. ఈ హత్య కర్ణాటక ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. బెంగళూరులోని సుబ్రహ్మణ్యపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న డొక్కలసంద్రలో గోకుల అపార్ట్‌మెంట్‌లో ప్రతిభ 8 ఏళ్లుగా నివసిస్తున్నారు. ప్రతిమకు పెళ్లయి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే.. ప్రతిమ హత్యకు గురైన సమయంలో ఆమె భర్త, కొడుకు తీర్థహళ్లిలో ఉన్నట్లు వెల్లడైంది. వివరాల ప్రకారం.. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా తుడ్కికి చెందిన ప్రతిమకు 18 ఏళ్ల క్రితం సత్యనారాయణ అనే వ్యక్తితో పెళ్లయింది. 2017లో ఆమెకు గనులు భూగర్భ శాఖలో జియాలజిస్టుగా ఉద్యోగం లభించింది. ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలలో పనిచేశారు. రామనగర జిల్లాలో విధుల్లో చేరిన ప్రతిమ తరువాత బెంగళూరుకు బదిలీ అయింది. రాంనగర్‌లో ఏడాది కాలంగా ఉద్యోగం చేస్తోంది. ప్రతిమ ఎప్పట్లాగే ఇటీవల తన విధులు నిర్వర్తించుకొని రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్లారు.
డ్రైవర్ ఆమెను ఇంటి వద్ద డ్రాప్ చేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి 8:30 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి, ఆమెను హత్య చేశారు. ప్రతిమ సోదరుడు ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె నుంచి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చింది. ఆదివారం ఉదయమే ప్రతిమ ఇంటికి చేరుకున్నాడు. రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి షాక్‌కి గురయ్యాడు. వెంటనే అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎంత వెతికినా.. ఎలాంటి ఆధారాలు కనిపించలేదు.
పక్కా ప్లానింగ్‌తో ప్రతిమను తెలిసిన వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసుపై మరింత సమాచారం కోసం విచారణ జరిపిస్తామని చెప్పారు. అటు.. హంతకులను పట్టుకోవడం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. డ్రైవర్ వదిలేసి వెళ్లిన కాసేపటికే ఆమెకు హత్యకు గురవ్వడంతో.. ఇది తెలిసిన వాళ్లే చేసిన పని అని బలంగా నమ్ముతున్నారు. మరోవైపు.. ప్రతిమ కొంతకాలం నుంచి తన భర్తకు దూరంగా ఉంటుందని, వీరి మధ్య విభేదాలు ఉన్నాయని తేలింది. ఈ నేపథ్యంలోనే.. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. హత్య చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. పోలీసు అధికారి రాహుల్ కుమార్ షహపూర్వాడ్ మాట్లాడుతూ.. ఫోరెన్సిక్, సాంకేతిక బృందాలు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నాయని, విచారణ కోసం మూడు బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దర్యాప్తు తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.