Nation-Wide Tractor March : జనవరి 26న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్ - కీలక నిర్ణయం ప్రకటించిన రైతులు
Nation-Wide Tractor March : పంజాబ్-హర్యానా సరిహద్దు వద్ద ధర్నా చేస్తోన్న రైతులు జనవరి 26న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
Nation-Wide Tractor March : పంటలకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీతో సహా పలు డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ రైతులు పంజాబ్ - హర్యానా సరిహద్దుల మధ్య నిరసలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతు నాయకుడు, జగ్జీత్ సింగ్ దల్లేవాల్ నవంబర్ 26 నుంచి ఖనౌరీ సరిహద్దు పాయింట్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే తాజాగా ఈ నిరసనలో భాగంగా రైతులు కీలక ప్రకటన చేశారు. జనవరి 26న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్ చేస్తామని వెల్లడించారు. కేంద్రంపై మరింత ఒత్తిడిని తెచ్చేందుకు రైతులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
రైతులు తమ నిరసనను ప్రకటించిన ప్రారంభంలో.. సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా బ్యానర్‌లో ఉన్న రైతుల్ని ఢిల్లీ వస్తుండగా అడ్డుకోవడంతో.. వారంతా ఫిబ్రవరి 13, 2024 నుంచి పంజాబ్, హర్యానా మధ్యలో ఉన్న శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద నిరసన చేస్తున్నారు. అంతకుముందు 2021లోనూ ఇదే తరహాలో రైతులు నిరసన చేపట్టారు. వివాదాస్పద వ్యవసాయ సంస్కరణలకు వ్యతిరేకంగా జనవరి 26న న్యూఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటను ముట్టడించారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. క్షణాల్లోనే ఇది హింసాత్మకంగా మారింది. అయినప్పటికీ రైతులు ఎర్రకోట గోడలు ఎక్కి జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు అనుగుణంగా రైతులు తమ పాదయాత్రను ప్లాన్ చేశారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన
సెప్టెంబరు 2021లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు అనేక ప్రాంతాల్లో రహదారులను దిగ్బంధించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడానికి ఈ చట్టాలు అవసరమని నిపుణులు విశ్వసిస్తున్నప్పటికీ, ఈ సంస్కరణల వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందారు.
క్షీణిస్తోన్న దల్లేవాల్ ఆరోగ్యం
పంజాబ్ - హర్యానా సరిహద్దుల్లోని ఖనౌరీలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ నిరసన 42వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. దీంతో ఆయన సారథ్యంలోని సంయుక్త కిసాన్ మోర్చా ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఇటీవలే సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాల పిలుపు మేరకు పంజాబ్ లో బంద్ ప్రకటించారు. అధికారులు 200కు పైగా రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదాలు జరిగాయి.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు
మరో పక్క ఢిల్లీలో ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. పోలింగ్ ఫిబ్రవరి 5వ తేదీన జరగనుండగా, 8వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 70 స్థానాలకు జరిగే పోలింగ్ ఒకే విడతలో జరగనుంది. ఫిబ్రవరి 23తో ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం ముగియనుండడంతో ఈ రోజు అధికారులు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్ లు ఇప్పటికే కొన్ని స్థానాల్లో తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి.
Also Read : Delhi Election Schedule: ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం