Bijapur Naxal Encounter: : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ భారీ ఎన్‌కౌంటర్- 8 మంది మావోయిస్టులు హతం
Chhattisgarh News : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన కాల్పల్లో 8 మంది నక్సల్స్ మృతి చెందారు.
Chhattisgarh News :ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. లోక్‌సభ ఎన్నికల టైంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఈ మధ్య తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులు, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇందులో భారీగా నక్సల్స్ మృతి చెందారు. ఇప్పుడు అదే కోవలో ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఎన్‌కౌంటర్ జరిగింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల నుంచి ఇన్సాస్, ఎల్ఎంజీ, ఏకే-47 వంటి అధునాత ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి బీజాపూర్ జిల్లాలో ఈ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఈ మధ్య కాలంలో జరిగిన అతి పెద్ద ఎన్‌కౌంటర్ ఇదే. ఇందులో 8 మంది చనిపోవడమే కాకుండా పలువురు గాయపడ్డారు.
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు మృతదేహాల బీజాపూర్ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. వీళ్లంతా మావోయిస్టు సంస్థకు చెందిన పీఎల్జీఏ సభ్యులుగా గుర్తించారు. వీళ్లంతా హై క్యాడర్‌కు చెందిన సభ్యులుగా చెబుతున్నారు. వీళ్లపై మావోయిస్టుల్లో కొందరికి లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు.
బస్తర్ ఐజీ నుంచి అందిన సమాచారం ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 19న తొలిదశలో పోలింగ్ జరగనుంది. అందుకే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలపై భద్రతా సిబ్బంది ఫోకస్ పెరిగింది. కూంబింగ్‌లు పెరిగాయి. అన్ని ప్రాంతాల్లో సైనికులు మోహరించారు. ఈ క్రమంలోనే నక్సల్స్ కాల్పులకు దిగుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
వారం రోజుల క్రితం కూడా బీజాపూర్ జిల్లాలో కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇవాళ కూడా తనిఖీలు చేస్తున్న సైనికులపై గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కొర్చోలి, లేండ్ర అడవుల్లో మావోయిస్టులు కాల్పులు జరిపారు. సైనికులు కూడా ప్రతిగానే కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతమైనట్టు పోలీసులు వెల్లడించారు.
కాల్పులు ఆగిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో పరిశీలిస్తే అత్యాధునికమైన ఆయుధాలు కనిపించాయి. వాటితోపాటు నిత్యావసరాలు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల టైంలో భారీ కుట్రకు మావోయిస్టులు ప్లాన్ చేస్తున్నారని అందుకే పదే పదే వారి స్థావరాలను మారుస్తూ రెక్కీలు నిర్వహిస్తున్నారని అన్నారు. పక్కా సమాచారంతోనే తాము ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టామంటున్నారు పోలీసులు.