ED on AAP: కేజ్రీవాల్ పార్టీకి విదేశీ నిధులు- ఫారెక్స్ నిబంధనల ఉల్లంఘనపై ఈడీ సీరియస్
Enforcement Directorate: ఫారెక్స్ నిబంధనలను ఉల్లంఘించి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ విదేశాల నుంచి రూ.7.08 కోట్లు నిధులను పొందినట్లు ఈడీ అధికారులు హోం మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు.
AAP News: దేశ రాజధాని దిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారింది. ఈ క్రమంలో ఇటీవల ఆప్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇప్పటికీ బీజేపీ-ఆప్ మధ్య పోరు కొనసాగుతూనే ఉంది.
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో సమస్య
ఈ క్రమంలోనే తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి మరో కొత్త సమస్య ఎదురయింది. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ AAP ఫారెక్స్ నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంది నిధులను పొందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హోం మంత్రిత్వ శాఖకు సమాచారం అందించింది. ఈ క్రమంలో మెుత్తంగా ఆప్ రూ.7.08 కోట్లను పొందినట్లు ఈడీ గుర్తించింది. 2014 నుంచి 2022 మధ్య కాలంలో కేజీవాల్ పార్టీకి ఈ నిధులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అందాయని తాజాగా వెల్లడైంది.
దాతల నుంచి విరాళాలు
ఆమ్ ఆద్మీ పార్టీ 2022 వరకు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, న్యూజిలాండ్, యూఏఈ, కువైట్, ఒమన్ సహా మరిన్ని దేశాల నుంచి వివిధ దాతల నుంచి విరాళాల రూపంలో నిధులను పొందినట్లు ఈడీ పేర్కొంది. రాజకీయ పార్టీలకు విదేశీ విరాళాలపై ఉన్న ఆంక్షలను తప్పించుకునేందుకు AAP తమ ఖాతాల పుస్తకంలో విదేశీ దాతల వాస్తవ గుర్తింపును దాచిపెట్టిందని ఈడీ దర్యాప్తుల్లో గుర్తించింది. విదేశాల నుంచి సేకరించిన నిధులన్నీ ఆప్ ఐడిబిఐ బ్యాంక్ ఖాతాకు జమ అయ్యాయని గుర్తించింది. దిల్లీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌తో సహా ఆప్ నేతలు విదేశీ నిధులను స్వాహా చేసినట్లు గుర్తించినట్లు ఏజెన్సీ తెలిపింది.
ఆరోపణలు రుజువైనట్లు ఈడీ..
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) 2010, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని నిబంధనలను ఉల్లంఘిస్తూ.. విదేశీ దాతల ఐడెంటిటీలు, జాతీయతలను దాచిపెట్టడం, వివరాలు తప్పుగా ప్రకటించడం, తారుమారు చేయడం ద్వారా నిధులను సేకరించినట్లు కేంద్ర ఏజెన్సీ తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్లు, కార్యనిర్వాహకుల మధ్య ఈమెయిల్ సంభాషణ ద్వారా ఆరోపణలు రుజువైనట్లు ఈడీ పేర్కొంది. పార్టీ అమెరికా, కెనడాల్లో క్యాంపెయిన్ ద్వారా నిధులను సమీకరించి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ పాటించటంలో విఫలమైందని ఈడీ పేర్కొంది.
దర్యాప్తు సమయంలో ఈడీ పరిశీలించిన డేటా ప్రకారం.. కేజ్రీవాల్ పార్టీకి విరాళాలను అనేక మంది దాతలు ఒకే పాస్‌పోర్ట్ నంబర్లు, ఒకే ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, క్రెడిట్ కార్డ్‌లను విరాళం అందించేందుకు వినియోగించినట్లు గుర్తించింది. పాకిస్థాన్ నుంచి హెరాయిన్ స్మగ్లింగ్‌లో ప్రమేయం ఉన్న అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్‌పై పంజాబ్ ఫజిల్కా జిల్లాలో నమోదైన కేసులో దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆప్ విదేశీ నిధుల వ్యవహారం బయటపడింది. ఫజిల్కాలోని ప్రత్యేక కోర్టు పంజాబ్‌లోని భోలాత్‌కు చెందిన అప్పటి ఆప్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను నిందితుడిగా విచారణకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో నిర్వహించిన సోదాల్లో విదేశీ విరాళాల వివరాలతో కూడిన పత్రాలు అధికారులకు లభ్యమయ్యాయి. మరో పక్క ఆప్ ఈ అభియోగాలను తిరస్కరించింది. ఇది ఆప్ పరువు తీసేందుకు బీజేపీ పన్నిన కుట్ర అని దిల్లీ మంత్రి అతిషి పేర్కొన్నారు.