Womens Day Special: భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌ను భయపెట్టిన ధైర్యశాలి
Womens Day 2025 | భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి అని అతికొద్ది మందికే తెలుసు. కాశ్మీర్ మహారాణి ఏకంగా గజినీ మహమ్మద్‌ను తన రాజ్యం వైపు చూడకుండా భయపడేలా చేశారు.

భారతదేశ చరిత్రలో ఎంతోమంది మహిళలు ఎన్నో గొప్ప పదవులు అలంకరించారు. వారిలో రాణులూ ఉన్నారు. రజియా సుల్తానా, రాణి రుద్రమదేవి లాంటి వారి గురంచి చరిత్ర చెబుతూనే ఉంది. కానీ వీరందరి కంటే ముందే పరిపాలించిన భారతదేశపు తొలి మహారాణి, గజినీ మహమ్మద్ ని సైతం తన రాజ్యం వైపు చూడాలంటే భయపడేలా చేసిన మహారాణి 'డిద్దా దేవి ' గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. కాశ్మీర్ రాజ్యం రాజ ప్రతినిధి గా, మహారాణి గా (958 CE నుండి 1003 CE ) వరకూ 45 ఏళ్ళు పరిపాలించిన డిద్ధా దేవి పాలన మొత్తం ఎత్తులకు పైయెత్తులు పోరాటాల తోటే నడిచింది.
రెండు రాజ్యాలను ఏకం చేసి పాలించిన డిద్దా దేవి
కాశ్మీర్లోని పీర్ పంజల్ పర్వతాల ప్రాంతంలో ఉండే లోహారా రాజు సింహారాజ కుమార్తె డిద్దా. ఆమె పుట్టింది 914 CE లో. 26 ఏళ్ల వయస్సులో ఆమె వివాహం కాశ్మిర్ రాజు క్షేమగుప్తుడి తో పెళ్లి అయ్యింది. డిద్దా దేవి శక్తి సామర్థ్యాలు గుర్తించిన క్షేమగుప్తుడు రాచ కార్యాల్లో కూడా ఆమెకు ప్రాధాన్యత కల్పించాడు. తనతో పాటు ఆమె పేరుతో కూడా నాణాలు ముద్రించే స్థాయిలో డిద్దా దేవి ప్రభావం క్షేమ గుప్తుడి పై ఉండేది. ఆమె వివాహంతో మొత్తం కాశ్మీర్ లోని చిన్న చిన్న రాజ్యాలన్నీ ఒకే పాలను కిందికి వచ్చేసాయి. 958 లో ఒక వేటకు వెళ్ళిన క్షేమగుప్తుడు జ్వరానికి లోనై మరణించాడు. చిన్నవాడైన తమ కుమారుడు అభిమన్యు తోడుగా రాజప్రతినిధిగా డిద్ద దేవి కాశ్మీర్ని పరిపాలించడం ప్రారంభించింది. సహజంగానే కొంతమంది మంత్రులు, సామంతులు ఆమెకు ఎదురు తిరిగి సింహాసనాన్ని హస్తగతం చేసుకోవాలని చూశారు. అయితే ప్రజల మద్దతు డిద్దా కు ఉండడంతో పాటు స్వతహాగా తెలివైన డిద్దా ఎత్తులకు పై ఎత్తు వేసి ఎదురు తిరిగిన వాళ్లను అణిచివేసింది. ఈ విషయంలో ఎలాంటి జాలి అమె చూపించలేదు. కుట్ర చేసిన వాళ్లతో పాటు వారి కుటుంబాలను సైతం నిర్ధాక్షణంగా అంతం చేసింది.
అంతా బాగుంది అనుకున్న సమయంలో 972లో అభిమన్యు సైతం చనిపోయాడు. అతని కుమారుడు నందిగుప్తుడు కూడా చిన్న పిల్లోడే కావడంతో అతని తరఫున కూడా డిద్దా దేవి రాజ్యపాలన చేసింది. కానీ అతను, అతని సోదరులు త్రిభువన గుప్త, భీమగుప్త కూడా పసివాళ్ళుగానే మరణించారు. దీని వెనక అంతఃపుర కుట్రలు ఉన్నాయని కల్హణుడు 'రాజతరంగిణి ' లో పేర్కొన్నాడు. ఇలా కొడుకు మనవళ్లు చనిపోవడంతో 975లో కాశ్మీర్ మహారాణిగా పట్టాభిషేకం చేసుకొని తానే పరిపాలించడం మొదలు పెట్టింది డిద్దా. తన సన్నిహితుడు. ప్రధాన మంత్రి 'తుంగ' తో కలిసి 1003 CE లో 79 ఏళ్ల వయస్సు లో ఆమె మరణించేంతవరకూ కాశ్మీర్ ని పరిపాలించింది. శత్రువుల విషయంలో చాలా క్రూరంగా ఉండేది. అందుకే తరువాతి కాలంలో చరిత్రకారులు ఆమెను రష్యాను పరిపాలించిన 'కేథరిన్ ది గ్రేట్' తో పోల్చారు. ఆమెలోని ఈలక్షణం కాశ్మీర్ కు మరో విధంగా మేలు చేసింది.
కాశ్మీర్ వైపు దండెత్తడానికి భయపడ్డ గజని
భారతదేశం పై దండెత్తిన గజినీ మహమ్మద్ ఎంత నష్టం చేశాడో చరిత్ర చెబుతుంది. కానీ అలాంటివాడు సైతం డిద్దా దేవి రాజ్యం పై దాడి చేయడానికి భయపడ్డాడు. కారణం అప్పటి చీనా సహా చుట్టుపక్కల రాజ్యాలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్న డిద్దా కాశ్మీర్ కి వెళ్లే మార్గాలు అన్నిటి లోనూ రక్షణ ఏర్పాట్లు బలంగా చేసింది. యుద్ధ తంత్రంలోనూ ఆమె ప్రతిభ గురించి విన్న గజినీ మహమ్మద్ ఆమె బతుకున్నంత కాలం కాశ్మీర్ వైపు కన్నెత్తి చూడలేదు. 1003 లో ఆమె చనిపోకముందు తన మేనల్లుడు సంగ్రామ రాజాను దత్తత తీసుకుంది. అతనే కాశ్మీర్ ని 1928 వరకూ పాతికేళ్లు పరిపాలించాడు.
డిద్దా దేవి చనిపోయిన పదేళ్లకు కాశ్మీర్ పై గజినీ మహమ్మద్ 1014,1021 లో రెండుసార్లు దండెత్తాడు. కానీ ఆ రెండు సార్లు విపరీతమైన సైనిక నష్టం జరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. దీనికి సంగ్రామ రాజా పోరాటంతో పాటు కాశ్మీర్లోని భీకర వాతావరణ పరిస్థితులు కూడా కారణం. ఆ తర్వాత గజనీ మహమ్మద్ మళ్లీ కాశ్మీర్ వైపు కన్నెత్తి చూడలేదు. ఆ తర్వాత కూడా డిద్దా స్థాపించిన "లోహారా " రాజవంశం మరో 300 ఏళ్ళు అంటే 1320 CE వరకూ కాశ్మీర్ ను పరిపాలించింది. ఇప్పటికీ కాశ్మీర్లో ఆడ పిల్లలకు మతాలకతీతంగా "డిద్దా " అనే పేరు పెడుతుంటారు. చేస్తే ఆడపిల్లలు ధైర్య సాహసాలతో పెరుగుతారని కాశ్మీర్ లో ఒక నమ్మకం





















