Air India: ముగ్గురు ఎయిరిండియా ఎగ్జిక్యూటివ్స్ ను తొలగించాలని DGCA ఆదేశాలు
DGCA order on Air India | ఎయిరిండియా ప్రమాదానికి సంబంధించి డీజీసీఏ క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఒక డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ సహా ముగ్గురు అధికారులను తొలగించాలని డీజీసీఏ ఆదేశించింది.

న్యూఢిల్లీ: విమానయాన భద్రతా పర్యవేక్షణకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలు చేపట్టింది. ముగ్గురు అధికారులను విధుల నుంచి తొలగించాలని ఎయిర్ ఇండియాను డీజీసీఏ ఆదేశించింది. వీరిలో ఒక డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ సహా, సిబ్బందిని అన్ని విధుల నుండి తొలగించాలని ఆదేశించింది. జూన్ 20న జారీ చేసిన ఈ ఆదేశాలపై టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా తక్షణమే స్పందించాలని సూచించింది.
పీటీఐ వర్గాల వివరాల ప్రకారం.. ఈ అధికారులను తక్షణమే వారి ప్రస్తుత పదవుల నుండి తొలగించాలి. ఎలాంటి జాప్యం లేకుండా అంతర్గత క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియాను డీజీసీఏ ఆదేశించింది. ఈ ముగ్గురు అధికారుల పేర్లను వెల్లడించనప్పటికీ, డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారని DGCA తమ ఉత్తర్వులో పేర్కొంది.
ఎయిర్ ఇండియాకు కష్టాలు
జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం AI171 ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, మెడికల్ కాలేజీకి సంబంధించి మరో 25 నుంచి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ ఎయిర్ పోర్టుకు టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయింది. ఇది ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలపై విమర్శలకు, ప్రయాణికుల భద్రతపై అనుమానాలకు దారి తీసింది. మన దేశంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఆ ఎయిరిండియా ప్రమాదం ఒకటిగా నిలిచింది.
ఈ వారం ప్రారంభంలో DGCA, ఎయిర్ ఇండియా దాని అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉన్నత అధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. నియంత్రణ సంస్థ ఎయిర్లైన్స్ పనితీరును రివ్యూ చేశారు. ముఖ్యంగా ఎయిరిండియా బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాల భద్రతా తనిఖీల గురించి చర్చించారు.
ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలపై నిర్వహించిన సమీక్షలో ఎటువంటి తీవ్రమైన భద్రతా సమస్యలు గుర్తించలేదని DGCA పేర్కొంది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానాలపై ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు గుర్తించలేదని నియంత్రణ సంస్థ డీజీసీఏ తెలిపింది.
అయితే, ఎయిర్లైన్స్ డ్రీమ్లైనర్ విమానంలో నిరంతరం సమస్యలు తలెత్తుతున్నాయని డీజీసీఏ పేర్కొంది. జూన్ 12-17 మధ్య, ఎయిర్ ఇండియా 66 బోయింగ్ 787 విమానాలను రద్దు చేయడం ప్రయాణికులలో భయాన్ని పెంచుతోంది. జూన్ 17న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సిన విమానం సైతం చివరి నిమిషంలో ఎయిరిండియా రద్దు చేయడంతో విమర్శలకు దారితీసింది.






















