G20 Summit: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఉదయం 4 గంటల నుంచే మెట్రో రైళ్లు
G20 Summit: జీ 20 సమ్మిట్ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 10 వరకు ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచే మెట్రో రైళ్లు నడపనుంది.
G20 Summit: జీ 20 సమ్మిట్‌కు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. సెప్టెంబర్ 9, 10 తేదీలలో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సమ్మిట్ జరగనుంది. ఢిల్లీ, నోయిడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 10 వరకు ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచే మెట్రో రైళ్లు నడపనుంది. ఈ మేరకు బుధవారం DMRC ఒక ప్రకటన విడుదల చేసింది. రాబోయే G-20 సమ్మిట్ నేపథ్యంలో 8 తేదీ నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీ మెట్రో రైలు సేవలు 04:00 AM నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.
మూడు రోజుల పాటు ఉదయం 4 గంటల నుంచి ఉదయం 6 వరకు 30 నిమిషాల వ్యవధిలో అన్ని లైన్లలో మెట్రో రైళ్లు నడుస్తాయని పేర్కొంది. దాని తరువాత రోజువారి సాధారణ టైం టేబుల్ ప్రకారం మెట్రో రైళ్లు నడుస్తాయని తెలిపింది. అలాగే సెప్టెంబరు 9, 10 తేదీల్లో సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ మూసివేయబడుతుందని DMRC తెలిపింది. సుప్రీం కోర్ట్ మెట్రో స్టేషన్ మినహా సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు అన్ని మెట్రో స్టేషన్లు సాధారణ ప్రజల కోసం తెరిచి ఉంటాయని వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా సెప్టెంబర్ 09, 10 తేదీల్లో సుప్రీంకోర్టు స్టేషన్ మూసివేస్తున్నామని, ప్రయాణికులను ఎక్కడానికి / దిగడానికి అనుమతి లేదన్నారు.
VVIP ప్రతినిధి బృందాల కోసం కొన్ని స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలను కొంత సమయం పాటు నియంత్రించేలా భద్రతా ఏజెన్సీలను ఆదేశించవచ్చని DMRC పేర్కొంది. అలాగే సుప్రీం కోర్ట్, పటేల్ చౌక్, రామ కృష్ణ ఆశ్రమ మార్గ్ మెట్రో స్టేషన్లలో మినహా, అన్ని స్టేషన్లలో పార్కింగ్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. మెట్రో సర్వీసులు సజావుగా సాగేందుకు ప్రయాణికులు సహకరించాలని, స్టేషన్ సిబ్బంది సూచనలను పాటించాలని డీఎంఆర్‌సీ కోరింది.
దేశ విదేశాల నుంచి నేతలు జీ 20 సమావేశాలకు హాజరుకానున్నారు. దాదాపు 25 దేశాలకు చెందిన లీడర్లతో సహా వివిధ ప్రపంచస్థాయి సంస్థల నాయకులు ఢిల్లీకి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఢిల్లీ మెట్రోలోని కొన్ని స్టేషన్‌లను ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూసివేయనున్నారు.
మెట్రోను వినియోగించుకోండి
గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా, ఢిల్లీ మధ్య ప్రయాణించేటప్పుడు ప్రజలు ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని నోయిడా ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వ్యక్తిగత వాహనాలకు బదులు మెట్రో సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. నోయిడా ట్రాఫిక్ పోలీస్ 99710 09001, ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ 1095/011-25844444 నంబర్లతో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు తక్షణ సాయం అందించడానికి వాట్సప్ హెల్ప్‌లైన్ నంబర్ 87508 71493ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ పోలీసులు జారీ చేసిన సూచనల్లో ఏవైనా మార్పులు ఉంటే వెంటనే ప్రజలకు తెలియజేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఢిల్లీ ప్రధాన మార్గాలు, కూడళ్లలో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాన మార్గాలు, కూడళ్లలో ట్రాఫిక్ ఆంక్షల గురించి పలు సూచనలు ఇచ్చారు. పలు రూళ్లలో వాహనాల రాకపోకలను నిషేధించారు. కొన్నింటిని దారి మళ్లించారు. నోయిడా సరిహద్దు నుంచి ఢిల్లీకి భారీ, మధ్యస్థ, తేలికపాటి వాహనాల ప్రవేశంపై ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 7 సాయంత్రం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11:59 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. అయితే నిత్యావసరాలు అయిన పాలు, కూరగాయలు, పండ్లు, వైద్య సామగ్రి రవాణా చేసే వాహనాలకు మినహాయింపు ఉంటుంది.