Delhi Blast Case Viral Video: ఢిల్లీలో పేలుడుకు ముందు ఉమర్ సంచలన వీడియో విడుదల, ఆత్మాహుతి దాడిపై కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో కారు పేలుడు కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఆత్మహుతి దాడికి ముందు సూసైడ్ బాంబింగ్ పై మాట్లాడుతూ ఓ వీడియో రికార్డ్ చేశాడు. దర్యాప్తు సంస్థలకు ఆ వీడియో దొరికింది.

Delhi Car Blast Case | ఢిల్లీలో పేలుడు కేసులో దర్యాప్తు సంస్థలకు మరో కీలకమైన ఆధారం లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఉగ్రవాది డాక్టర్ ఉమర్ ఆత్మాహుతి దాడికి ముందు తీసుకున్న కొత్త వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో మొత్తం కేసును మరింత తీవ్రతను పెంచింది. ఆ వీడియోలో నిందితుడు ఉమర్ ఆత్మాహుతి బాంబింగ్ (సూసైడ్ బాంబింగ్) గురించి మాట్లాడాడు.
ఈ వీడియోను నిందితుడు ఉమర్ ఢిల్లీలో కారు పేలుడుకు ముందు రికార్డ్ చేశాడు. నిందితుడు ఉమర్ ఆలోచనలు, ప్రణాళికలు, తీవ్రవాద భావజాలాన్ని తెలియజేస్తున్నాయని ఎన్ఐఏ దర్యాప్తు బృందం భావిస్తోంది. నిందితుడు ఉమర్ చాలా కాలం నుంచి ఇలాంటి దాడులకు సిద్ధమవుతున్నాడని కూడా వీడియో సూచిస్తుంది.
వీడియోలో ఉమర్ ఏమన్నాడు?
తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో నిందితుడు డాక్టర్ ఉమర్ మాట్లాడుతూ.. "అతి పెద్ద తప్పు ఏమిటంటే, ఆత్మాహుతి బాంబింగ్ వంటి ఆలోచన అంటే ఏంటో ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది ఏ విధంగానూ ప్రజాస్వామ్యం కాదు. దీనిని ఏ నాగరిక సమాజం ఆమోదించదు. దీనికి వ్యతిరేకంగా చాలా వైరుధ్యాలు, చాలా వాదనలు ఉన్నాయి" అని పేర్కొన్నాడు.
ఆత్మాహుతి దాడులలో అతిపెద్ద సమస్య ఏమిటంటే.. ఒక వ్యక్తి ఓ నిర్దిష్ట సమయంలో, ప్రదేశంలో ఖచ్చితంగా చనిపోతున్నానని భావించినప్పుడు భయంకరమైన మనస్తత్వానికి లోనవుతాడు. మరణమే తన ఏకైక గమ్యంగా ఆ వ్యక్తి భావిస్తారు. వాస్తవం ఏమిటంటే, ఏ ప్రజాస్వామ్య, మానవతా వ్యవస్థలోనూ అలాంటి ఆలోచన లేదా పరిస్థితిని ఎవరూ అంగీకరించరు. ఎందుకంటే ఇది జీవితం. కానీ కోరుకున్నది సాధించాలంటే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని" ఉమర్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ఉమర్ తల్లి దర్యాప్తు టీంకు ఏం తెలిపారు..
తన కుమారుడు చాలా కాలం నుంచి తీవ్రవాద ఆలోచనలవైపు మొగ్గు చూపుతున్నాడని అనుమానించినట్లు విచారణలో ఉమర్ తల్లి వెల్లడించింది. డాక్టర్ ఉమర్ చాలా రోజుల పాటు కుటుంబంతో ఏం సంబంధం లేకుండా ఉండేవాడు. ఈ పేలుడు ఘటనకు కొంతకాలం ముందు తనకు ఫోన్ చేయవద్దని వారి కుటుంసభ్యులకు స్పష్టంగా చెప్పాడు. అయినా అతడి కుటుంబం ఉమర్ ప్రవర్తన గురించి పోలీసులకు ఎప్పుడూ సమాచారం ఇవ్వలేదు.
జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన ఉమర్
ఢిల్లీ పేలుడులో మరణించిన ఉమర్ జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాకు చెందినవాడని దర్యాప్తులో తేలింది. వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ, అతను రహస్యంగా జైషే మహ్మద్ యొక్క ఒక మాడ్యూల్‌తో చురుకుగా సంబంధం కలిగి ఉన్నాడు. ఢిల్లీలో పేలుడుకు ముందు పోలీసులు అతని ముఠాలోని చాలా మంది సభ్యులను అరెస్టు చేశారు. వారి నుండి దాదాపు 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఢిల్లీ సహా దేశంలోని పలు నగరాలలో పెద్ద దాడులకు సిద్ధమవుతోందని స్పష్టంగా తెలుస్తుంది.






















