CoWIN App Registration: పిల్లలకు కొవిడ్ టీకా కోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్.. ఎలా చేయాలంటే..?
కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా.. చిన్నారులకు వ్యాక్సినేషన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. అయితే టీకా కోసం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి?
కరోనా వైరస్ వ్యాప్తితోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. విజృంభిస్తున్న కారణంగా 15 ఏళ్లు దాటిన వారికి.. టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని మోడీ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. వారికి టీకాలు ఇవ్వడమనే ప్రయత్నం ద్వారా పాఠశాలల్లో బోధన సాధారణ స్థితికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే పిల్లలకు టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
పిల్లలకు కరోనా టీకాకు సంబంధించి.. కేంద్రం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. వారికి టీకా కోసం.. జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. అది కూడా కొవిన్ యాప్ లో చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొవిన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు ఉండాలి. అయితే ఆధార్ కార్డులేని వారు.. విద్యార్థుల ఐడీ కార్డు ద్వారా.. కొవిన్ యాప్ లో నమోదు చేసుకోవచ్చని.. కొ-విన్ యాప్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ చెప్పారు.
పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు.. రెండు టీకాలకు డీసీజీఐ అత్యవసర అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్, జైడస్ క్యాడిలా రూపొందించిన జైకోవ్-డీ టీకాలకు పచ్చజెండా ఊపింది. అయితే జైకోవ్ టీకాకు అనుమతులు వచ్చినా.. ఆ వ్యాక్సిన్ను పెద్దలకు ఇవ్వడం ప్రారంభించని కారణంగా పిల్లలకు ఇవ్వరేమోనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒమిక్రాన్ నివారణకు టీకా, జాగ్రత్తలే మందు అని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోడి చెప్పారు. మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది అని పేర్కొన్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరిగిపోతున్నాయని.. ఒమిక్రాన్ వస్తోందని ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావొద్దని చెప్పారు. మాస్కులు ధరిస్తూ, శానిటైజ్ చేసుకుంటూ ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 18 లక్షల ఐసోలేషన్ పడకలు ఉన్నాయని.. 5 లక్షల ఆక్సిజన్ పడకలు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కోటి 40 లక్షల ఐసీయూ బెడ్లు ఉన్నాయని.. చిన్నారుల కోసం 90 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని ప్రధాని వెల్లడించారు.
Also Read: Telangana Omicron: తెలంగాణలో కొత్తగా 3 ఒమిక్రాన్ కేసులు... 109 కరోనా కేసులు, ఒకరు మృతి
Also Read: Omicron Effect: షిర్డీ వెళ్తున్నారా? ఆగండి.. ఆగండి.. దర్శన వేళల్లో మార్పులు చేశారు తెలుసా?