Delhi Elections 2025: నామినేషన్ వేసిన ఢిల్లీ సీఎం అతిషి - రేసులో రమేష్ బిధూరి! ఈసారి కళ్కాజీలో హోరాహోరీ తప్పదా?
Delhi CM Atishi Files Nomination From Kalkaji | ఢిల్లీ సీఎం అతీషి కళ్కాజి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు మంగళవారం నాడు ఆమె నామినేషన్ దాఖలు చేశారు.
Delhi Assembly Elections 2025 | ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం నామినేషన్ వేశారు. కళ్కాజీ నియోజకవర్గం నుంచి స్థానం నుండి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం వేయాల్సిన నామినేషన్ ను నేటికి వాయిదా వేసుకున్న అతీషి ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌తో కలిసి ఎన్నికల కమిషన్ అధికారులతో నిన్న సమావేశమయ్యారు.
ఆప్ సీనియర్ నేత, మాజీ మంత్రి మనీష్ సిసోడియాతో పాటు గిరి నగర్‌లోని కళ్కాజీ ఆలయంలో పూజలు చేసిన అతీషి, అనంతరం గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. పార్టీ శ్రేణులతో రోడ్‌షో నిర్వహించిన అనంతరం జిల్లా ఎన్నికల అధికారి ఆఫీసుకు వెళ్లి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. రోడ్‌షో ఆలస్యం అయిన కారణంగా, ఆమె నామినేషన్ దాఖలు చేయకుండానే ఎన్నికల కమిషన్ ఆఫీసుకు వెళ్లారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే వీలుంటుంది.. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ సీఎం అతీషి కళ్కాజీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
కళ్కాజీ నుంచి హోరాహోరీ..
కళ్యాజీ నియోజకవర్గంలో భారీ పోటీ నెలకొంది. కళ్కాజీ నుంచి ఆప్ అభ్యర్థిగా సీఎం అతిషి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ రమేష్ బిధురి బరిలో నిలవగా, కాంగ్రెస్ నుంచి అల్కా లాంబాపై పోటీ చేస్తున్నారు. ‘గత ఐదేళ్లుగా నా నియోజకవర్గంలో విశ్రాంతి లేకుండా పనిచేశాను. కళ్యాజీ ప్రజలు నా కుటుంబం లాంటివారు. ఇక్కడి ప్రజలు నన్ను వారి బిడ్డగా, సోదరిగా చూస్తారు. నేను కేవలం వారికి ప్రతినిధిని మాత్రమే కాదు, వారి జీవితాల్లో భాగమే’ అని సీఎం అతీషి అన్నారు. పేదల విరోధి బీజేపీని ఓడించేందుకు తన నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అతిషి పేర్కొన్నారు. ఆప్ పేదల కోసం ఎంతో చేసింది, సామాన్యుడి పార్టీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ మురికివాడల నుంచి వెళ్లగొట్టిన వారికి పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వడంతో పాటు వారిపై కేసులు ఉపసంహరించుకుంటే తాను ఎన్నికల్లో పోటీ చేయనని కేంద్ర మంత్రి అమిత్ షాకు మాజీ సీఎం కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
ఢిల్లీలో ఎన్నికలు ఎప్పుడు..
ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈసారి కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండనుంది. అయితే తాము సైతం రేసులో ఉన్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వరుస ఎన్నికల్లో ఢిల్లీలో సంచలన ఫలితాలు నమోదు చేసిన ఆప్‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎలక్షన్ కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం ఓటర్లలో 83.49 లక్షల మంది పురుషులు, 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1,261 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని ఈసీ తెలిపింది. ఈ ఎన్నికల్లో 2.08 లక్షల మంది తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఢిల్లీలో 85 ఏళ్లు పైబడిన వారు 1.09 లక్షల మంది ఓటర్లు ఉండగా, వందేళ్లు నిండిన వారు 830 మంది ఓటర్లు ఉన్నారు. కొత్త ఓటర్లకు ఎన్నికల అధికారులు అవగాహనా కల్పిస్తున్నారు. ఈ మేరకు అధికారులను ఈసీ ఆదేశించింది.