Uddhav Thackeray: 'బిల్కిస్ బానో, మణిపూర్ మహిళలు, మహిళా రెజ్లర్లకు బీజేపీ రాఖీ కట్టాలి'
Uddhav Thackeray: రక్షా బంధన్ రోజున బిల్కిస్ బానో, మణిపూర్ మహిళలు, రెజ్లర్లకు బీజేపీ రాఖీ కట్టాలని ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు.
Uddhav Thackeray: మోదీని, బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏకమైన ప్రతిపక్ష కూటమి I.N.D.I.A రేపు ముంబయిలో మూడోసారి సమావేశం కానుంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లు శివసేన పార్టీ దగ్గరుండి చూసుకుంటోంది. రేపటి కూటమి సమావేశం, భేటీ అజెండా, చర్చల సరళి గురించి నేతలు ప్రత్యేకంగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ చెప్పుకొస్తున్నారు. తాజాగా ప్రెస్ మీట్ ను నిర్వహించిన శివసేన(UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే.. అధికార బీజేపీపై విమర్శలు గుప్పించారు. రక్షా బంధన్ వేళ బీజేపీని ఉద్దేశించి నిప్పులు చెరిగారు.
రక్షా బంధన్ రోజున.. బీజేపీ బిల్కిస్ బానో, మణిపూర్ మహిళలు, మహిళా రెజ్లర్లకు రాఖీలు కట్టాలని.. రాఖీలు కట్టి వారు దేశంలో సురక్షితంగా ఉన్నామన్న భావన కలిగించాలని వ్యాఖ్యానించారు. అందుకే మేము (ప్రతిపక్ష పార్టీలు) కలిసి కూటమిగా ఏర్పడినట్లు చెప్పుకొచ్చారు.
రెండ్రోజుల పాటు ప్రతిపక్ష కూటమి భేటీ
ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో I.N.D.I.A(ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) లోని 27 బీజేపీయేతర పార్టీలు జాతీయ స్థాయిలో సమావేశం కానున్నాయి. రెండ్రోజుల పాటు జరిగే సమావేశానికి కూటమి భాగస్వామి పార్టీలన్నీ హాజరు కానున్నాయి. ఈ సమావేశంలోనే కూటమి లోగోను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్రాల ఎన్నికల్లో సీట్ల పంపకంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఉమ్మడి కార్యక్రమాలను, దేశవ్యాప్తంగా చేయాల్సిన ఆందోళనలు, పోరాటాలపై ఉమ్మడి ప్రణాళికలను రూపొందించనున్నాయి.
ప్రతిపక్ష కూటమికి నేతృత్వం వహించేందుకు కోఆర్డినేటర్ లేదా ఛైర్ పర్సన్ ఉండాలనే అంశంపై కూడా సభ్యులు చర్చించనున్నారు. రాబోయే కాలంలో నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాల కార్యాచరణ, ప్రణాళికనే ప్రధాన అజెండాగా ఈ సమావేశం ఉంటుందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున అభ్యర్థులను నిర్ణయించడానికి కూడా చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. I.N.D.I.A కూటమికి కన్వీనర్ ను కూడా రేపు నిర్ణయిస్తామని తెలిపారు.
ఈ ప్రతిపక్ష కూటమి సమావేశం సజావుగ సాగేందుకు, సమావేశానికి సంబంధించిన వివిధ ఏర్పాట్లను నిర్వహించడానికి పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలలో మీడియా నిర్వహణ, సోషల్ మీడియా, వసతి, రవాణా ఏర్పాట్లు, భద్రత, ప్రముఖులను స్వాగతించడం వంటి పనులకు బాధ్యత వహిస్తాయి. ప్రతి కమిటీలో ప్రతి పార్టీ నుంచి ఇద్దరు నాయకులు ఉంటారు.
Also Read: Google Flights: డబ్బు ఆదా చేసుకునేలా గూగుల్ కొత్త ఫీచర్- తక్కువ ధరకే విమాన టికెట్ల బుకింగ్స్
మీడియా కవరేజీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం, ఇతర కమ్యూనికేషన్ ఛానళ్లను పర్యవేక్షించే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంది. సమావేశం కోసం రవాణా నిర్వహణ బాధ్యతను ఎన్సీపీ నిర్వహిస్తోంది. ప్రతిపక్ష పార్టీల మూడో సమావేశానికి హోస్ట్‌గా, వకోలాలోని గ్రాండ్ హయత్ హోటల్ లో సమావేశానికి సంబంధించిన బస, విందు, ఇతర ఏర్పాట్లను శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) చూసుకుంటోంది. సమావేశానికి హాజరయ్యే ప్రముఖులు, నేతలు బస చేసేందుకు రెండ్రోజులుగా దాదాపు 150 గదులను బుక్ చేశారు. ఈ సమావేశానికి ఐదుగురు ముఖ్యమంత్రులతో పాటు 26 వేర్వేరు పార్టీలకు చెందిన దాదాపు 80 మంది ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.