రాముడు కలలోకి వచ్చాడు, బిహార్ మంత్రి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు
బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు తన కలలోకి వచ్చాడని, మార్కెట్లో తనను విక్రయించకుండా చూడమని భగవంతుడు కోరినట్లు వెల్లడించారు.
బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు తన కలలోకి వచ్చాడని, మార్కెట్లో తనను విక్రయించకుండా చూడమని భగవంతుడు కోరినట్లు వెల్లడించారు. బిహార్‌లోని రాంపుర్ గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. రాముడు తన కలలోకి వచ్చాడని, తనను మార్కెట్లో విక్రయిస్తున్నారని చెప్పాడు.
పవిత్ర రామచరితమానస్ గ్రంథాన్ని విషపదార్థమైన ‘సైనైడ్’తో పోల్చారు చంద్రశేఖర్. ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు పొలిటికల్ దుమారం ప్రారంభమైంది. హిందీ దివాస్ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ‘మీకు 50 రకాల వంటకాలను వడ్డించి అందులో పొటాషియ సైనైడ్ కలిపితే మీరు తింటారా ? హిందూ మత గ్రంథాలది కూడా ఇదే పరిస్థితి అని అన్నారు. అది తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదని చెప్పిన ఆయన.. హిందీ రచయిత నాగార్జున, సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా వంటి ప్రముఖులు సైతం ఆ గ్రంథం గురించి ఇలాగే మాట్లాడరని అన్నారు. కుల వివక్షపై తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు దూషణలకు దిగారని, భౌతిక దాడులకు పాల్పడతామని బెదిరింపులు వచ్చాయని తెలిపారు. రామచరితమానస్ పట్ల తన అభ్యంతరం కూడా ధృడమైందని, ఇది నా జీవితాంతం కొనసాగుతుందని అన్నారు. అక్కడితో ఆగని ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా దీన్ని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. రామచరితమానస్ సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని, ప్రేమ, ఆప్యాయతతో దేశం గొప్పది అవుతుందన్నారు.
దేశంలోని కుల వ్యవస్థ, మత విశ్వాసాలు, చారిత్రక వ్యక్తుల గురించి మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు సైతం వివాదాస్పదంగా మారాయి. రాముడు సైతం శబరి ఎంగిలి చేసిన ఆహారాన్ని తిన్నాడని, నేటికీ శబరి కుమారుడికి ఆలయ ప్రవేశం నిషిద్ధమేనన్నారు. ఇది విచారకరమన్న చంద్రశేఖర్, రాష్ట్రపతి, ముఖ్యమంత్రిని కూడా దేవాలయాలను సందర్శించకుండా అడ్డుకున్నారని విమర్శించారు. ఆలయాలను గంగాజలంతో శుద్ధి చేశారని అన్నారు. దేవుడే శబరి ఇచ్చిన ఆహారం తిన్నాడని, కుల వ్యవస్థ పట్ల ఆయన కూడా అసంతృప్తి చెందాడని అన్నారు. కులాల ప్రస్తావన ఉన్నంత కాలం దేశంలో రిజర్వేషన్లు, కుల గణన జరగాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.