Lok Sabha Polls: బీజేపీ అభ్యర్థుల 8వ జాబితా విడుదల - సన్నీ డియోల్‌కు షాక్, మజీ సీఎం భార్యకు ఛాన్స్
BJP MP Candidates: భారతీయ జనతా పార్టీ (BJP) లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల 8వ జాబితా విడుదల చేసింది. తాజా జాబితాలో 11 మందికి అవకాశం కల్పించారు.
BJP Names 11 More Candidates In 8th List: న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఇదివరకే 7 జాబితాలలో అభ్యర్థులను ప్రకటించింది. 11 మంది అభ్యర్థులతో కూడిన ఎనిమిదో జాబితాను బీజేపీ అధిష్టానం శనివారం (మార్చి 30న) విడుదల చేసింది. ఈ జాబితాలో పంజాబ్ నుంచి ఆరుగురు, ఒడిశా నుంచి ముగ్గురు అభ్యర్థులను, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు నేతలకు బీజేపీ అవకాశం కల్పించింది.
నటుడు సన్నీ డియోల్‌కు షాక్!
గత ఎన్నికల్లో బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌ను గురుదాస్ పూర్ నుంచి బరిలోకి నిలిపిన బీజేపీ, ఈసారి అవకాశం ఇవ్వలేదు. సన్నీ డియోల్‌ను తప్పించి, గురుదాస్‌పూర్ నుంచి దినేష్ సింగ్ బబ్బును బరిలోకి దించుతున్నారు. అమృత్‌సర్ నుంచి మాజీ దౌత్యవేత్త తరంజిత్ సింగ్ సంధూ, జలంధర్ నుంచి సుశీల్ కుమార్ రింకూ, ఫరీద్‌కోట్ నుంచి హన్స్ రాజ్ హన్స్, సస్పెన్షట్ వేటు పడిన కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సతీమణి ప్రణీత్ కౌర్ పాటియాలా నుంచి పోటీ చేయనున్నారు.
भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने आगामी लोकसभा चुनाव-2024 के लिए 8वीं सूची में निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की। pic.twitter.com/TrHp1SEdnK
— BJP (@BJP4India) March 30, 2024
హన్స్ రాజ్ హన్స్ ప్రస్తుతం ఢిల్లీలోని వాయువ్య (నార్త్ వెస్ట్) నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే బీజేపీ అధిష్టానం ఆయనను పంజాబ్ రాజకీయాల్లోకి పంపింది. నాలుగుసార్లు ఎంపీగా, కేంద్ర మాజీ మంత్రిగా సేవలు అందించిన ప్రిణీత్ కౌర్ ఈ మార్చి నెల ప్రారంభంలో బీజేపీలో చేరడం తెలిసిందే.
ఒడిశా అభ్యర్థులు వీరే
ఇటీవల బిజూ జనతాదళ్ (BJD)కి రాజీనామా చేసి బీజేపీలో చేరిన భర్తృహరి మహతాబ్ కటక్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆరుసార్లు ఎంపీగా సేవలు అందించారు. ఒడిశాలో మరో ఇద్దరు.. రవీంద్ర నారాయణ్ బెహ్రా జాజ్‌పూర్ నుంచి, సుకాంత కుమార్ పాణిగ్రాహి కంధమాల్ నుంచి టికెట్ దక్కించుకున్నారు.
బెంగాల్ అభ్యర్థులు..
పశ్చిమ బెంగాల్ నుంచి తాజా జాబితాలో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. ఝర్‌గ్రామ్ నుంచి ప్రణత్ తుడు, బీర్భూమ్ నుంచి దేవాశిష్ ధార్ బరిలోకి దిగుతున్నారు. దేవాశిష్ ఇటీవల ఇండియన్ పోలీస్ సర్వీసెస్ (IPS)కు రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
418కి చేరిన బీజేపీ అభ్యర్థులు..
ఈ మంగళవారం, బుధవారం బీజేపీ రెండు జాబితాలను విడుదల చేసింది. బుధవారం ప్రకటించిన ఏడో జాబితాలో మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఒకప్పటి నటి టాలీవుడ్ నటి నవనీత్ రాణా, కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి గోవింద్ కజ్రోల్‌ల పేర్లు ప్రకటించింది. ఆరవ జాబితాలో మణిపూర్, రాజస్థాన్‌లలో గత ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ ఎంపీలను బీజేపీ మరో ఛాన్స్ ఇవ్వలేదు. 2019లో కాంగ్రెస్, NCP మద్దతుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి నవనీత్ రాణా గెలుపొందారు. బీజేపీ తాజాగా విడుదల చేసిన 8వ జాబితాతో కలిపి.. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కాషాయ పార్టీ మొత్తం 418 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది.