B'luru Traffic: 10 కి.మీ. ప్రయాణానికి 29 నిమిషాలు, లండన్ తర్వాత అత్యంత రద్దీ ఉండేది ఇక్కడే
Bengaluru News: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండో నగరంగా బెంగళూరు నిలిచింది. ఇక్కడ 10 కిలోమీటర్లు ప్రయాణించాలంటే 29 నిమిషాలు పడుతున్నట్లు టామ్ టామ్ ట్రాఫిక్ నివేదిక పేర్కొంది.
Bengaluru News: సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, గార్డెన్ సిటీ ఇలా బెంగళూరుకు చాలా పేర్లే ఉన్నాయి. ఆ జాబితాలో ట్రాఫిక్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా చేర్చాలేమో. ఎందుకంటే బెంగళూరు అనగానే చాలా మంది భయపడేది ట్రాఫిక్ కే. అక్కడి ప్రజలు గుబులు చెందేది ట్రాఫిక్ అంటేనే. ఇంట్లో నుండి రోడ్డెక్కామంటే గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందోనని భయపడుతుంటారు. కొన్ని ఏరియాల్లో చిన్న ట్రాఫిక్ జామ్ ఏర్పడితే అందులో గంటల తరబడి మగ్గిపోవాల్సిందే. మన గాచారం బాగోలేక ఎక్కడైనా చిన్న రోడ్డు ప్రమాదం జరిగిందంటే, గంటలకొద్దీ రోడ్లపై బారులు తీరాల్సిందే. అత్యంత ఎక్కువ రద్దీ ఉండే నగరాల్లో దేశంలోనే బెంగళూరు టాప్ లో ఉంటుంది. ప్రపంచంలో బెంగళూరు ప్లేస్ ఏంటో తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే.
10కి.మీ వెళ్లాలంటే 29 నిమిషాలు
బెంగళూరులో సగటు ప్రయాణం వేగం కేవలం 18 కిలోమీటర్లు మాత్రమే. అంటే 10 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే 29 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీ ఉన్న ప్రాంతాల్లో బెంగళూరుది రెండో స్థానం. డచ్ లోకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ సంస్థ అయిన టామ్ టామ్ ఈ వివరాలను వెల్లడించింది. ట్రాఫిక్ సూచిక ప్రకారం 2022లో సిటీ సెంటర్(బీబీఎంపీ ఏరియా) కేటగిరీలో బెంగళూరు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండో నగరంగా నిలిచింది.
లండన్ తర్వాత బెంగళూరే
లండన్ లో 10 కిలోమీటర్లు ప్రయాణించాలంటే 36 నిమిషాల 20 సెకన్ల సమయం పడుతుంది. ప్రపంచంలో ఏ నగరంలోనూ ఇంత ట్రాఫిక్ ఉండదు. ఇక్కడి రోడ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. రోడ్డుపైకి వెళ్లామంటే చాలు ముందుకు వెళ్లలేం, వెనక్కి రాలేం. సచ్చినట్టు ట్రాఫిక్ ఎదుర్కోవాల్సిందే. అందుకే లండన్ సిటీ అత్యంత రద్దీగా ఉండే సిటీ సెంటర్ అని నివేదిక పేర్కొంది. సిటీ సెంటర్ విభాగంలో ఐర్లాండ్ లోని డబ్లిన్ మూడో స్థానంలో ఉంది. జపాన్ లోని సపోరో 4వ స్థానంలో, ఇటలీలోని మిలన్ 5వ స్థానంలో నిలిచాయి. ఇక 6వ స్థానంలో కూడా భారత్ కు చెందిన సిటీనే ఉండటం గమనార్హం. పూణే నగరం అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో 6వ స్థానంలో నిలిచింది. ఇక ఈ జాబితాలో డిల్లీ 34వ స్థానంలో, ముంబయి 47వ స్థానంలో ఉన్నాయి. బెంగళూరులోని మెట్రోపాలిటన్ ఏరియాలో 10 కిలో మీటర్ల ప్రయాణానికి 23 నిమిషాల 40 సెకన్ల సమయం పడుతుంది. అంటే ఇక్కడ సగటు వేగం గంటకు 22 కిలోమీటర్లు మాత్రమే.
సిటీ సెంటర్ అత్యంత రద్దీ ఉండే ప్రాంతం
సిటీ సెంటర్ 5 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉంటుంది. బెంగళూరు నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలు సిటీ సెంటర్ కిందకే వస్తాయి. మెట్రో ప్రాంతం మొత్తం ట్రాఫిక్ ను కవర్ చేస్తుంది. ఇందులో సిటీ, గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి. బెంగళూరు 2021లో అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో 10వ స్థానంలో నిలిచింది. 2020లో 6వ స్థానంలో నిలిచింది. అయితే అప్పుడు సిటీ సెంటర్, మెట్రో ఏరియా అంటూ నగరాన్ని విభజించలేదు.
10 కి.మీ ప్రయాణానికి 33 నిమిషాలపైనే
గతేడాది అక్టోబర్ 15వ తేదీన బెంగళూరులో ట్రాఫిక్ నరకం చూపించిందని నివేదిక పేర్కొంది. ఆ రోజు 10 కిలోమీటర్ల ప్రయాణానికి 33 నిమిషాల 50 సెకన్ల సమయం పట్టిందని రిపోర్టు వెల్లడించింది. అంటే సగటు ప్రయాణం వేగం గంటకు 10 కిలోమీటర్లు. అలాగే శుక్రవారాల్లో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుందని నివేదిక పేర్కొంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు రద్దీ విపరీతంగా ఉంటుంది. 10 కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే 37 నిమిషాల 20 సెకన్ల సమయం పడుతుంది. ఈ విపరీతమైన వాహన రద్దీ వల్ల కాలుష్య సమస్య కూడా పెరిగిపోతోంది. ఏడాదికి 1009 కిలోల కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతోంది. శుక్రవారాల్లో వర్కింగ్ ఫ్రం హోం చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని నివేదిక పేర్కొంది. అధికారులు, ప్రైవేటు సంస్థలు కలిసికట్టుగా ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ పేర్కొంది.