Bangalore Floods : బెంగళూరులో భీకర వరదలు, కేటీఆర్ ట్వీట్లపై నెటిజన్ల ఆగ్రహం
Bangalore Floods : బెంగళూరును వరుణుడు ముంచెత్తాడు. వరదలతో మహానగరంలోని వీధులన్నీ నీట మునిగాయి. ఈ విషయంలో ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Bangalore Floods : బెంగళూరును వరదలు ముంచెత్తుతున్నాయి. మహానగరంలో కురిసిన భారీ వర్షాలకు వీధులన్నీ మునిగిపోయాయి. ముఖ్యంగా బెల్లందూరు, సర్జాపుర, వైట్ ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్డు, బీఈఎంఎల్ లే అవుట్ ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మారథహళ్లిలోని స్పైక్ గార్డెన్‌లో వాహనాలు వరదల ధాటికి కొట్టుకెళ్లాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న ఈ వర్షాలతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చేస్తోంది. బెంగళూరు శివారు ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
మంత్రి కేటీఆర్ ట్వీట్
బెంగళూరులో నెలకొన్న పరిస్థితులపై స్థానికులు మండిపడుతున్నారు. ఎక్కడిక్కడ ప్రజా ప్రతినిధులను తప్పుపడుతూ ఆందోళనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో బెంగళూరు పరిస్థితులపై వస్తున్న పోస్టులను గమనించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ముందుండి నడిపించే మహానగరాల్లో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవటంపై కేటీఆర్ మనసులోని ఆలోచనలను పంచుకున్నారు. వాతావరణంలో వస్తున్న అకస్మాత్తు మార్పులతో ప్రకృత్తి విపత్తులు సంభవిస్తున్నాయన్న కేటీఆర్ ..ప్రగతి పథంలో పయనించటంలో భాగంగా మహానగరాల్లో వేగంగా జరుగుతున్న నిర్మాణాలు, అభివృద్ధి పనులతో చాలా సమస్యలు వస్తున్నాయన్నారు. ప్రత్యేకించి ఇబ్బందులు ఎదరువుతున్న వ్యవస్థలను మెరుగుపర్చటంలో అనుకున్న ఫలితాలను సాధించలేకపోతున్నామన్నారు.
To all those who are mocking the water-logged Bengaluru:
— KTR (@KTRTRS) September 5, 2022
Our cities are our primary economic engines driving the States’/Country’s growth
With rapid urbanisation & sub-urbanisation, infrastructure is bound to crumble as we haven’t infused enough capital into upgrading the same
మూసధోరణి ఆలోచనలకు స్వస్తి చెప్పాలి
ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేసుకోవటంలో కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందడుగు వేయాలన్న కేటీఆర్....హైదరాబాద్ ఏ భారతీయ మహానగరం ప్రకృత్తి విపత్తులను, ఆకస్మిక పరిణామాలను తట్టుకోగలిగే పరిస్థితుల్లో లేదని గుర్తుచేశారు. మూసధోరణి ఆలోచనలకు స్వస్తి చెప్పి నగరప్రణాళికలు, అభివృద్ధిలో విప్లవాత్మమైన మార్పులు తీసుకురావాలన్న కేటీఆర్...శుభ్రమైన నీరు, శుభ్రమైన గాలి, పరిశుభ్రమైన రోడ్లు, వర్షం నీటిని తరలించే ఏర్పాట్లను చేసుకోవటం అంత కష్టమైన పనేం కాదన్నారు. ఇదే అంశంపై కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురిని ట్యాగ్ చేసిన కేటీఆర్...ఓ రాష్ట్రంగా కేంద్రానికి ఈ విషయంలో మద్దతించేందుకు మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉంటామన్నారు. తను మాట్లాడిన కొన్ని అంశాలు హైదరాబాద్ లోని బెంగళూరు వాసులకు నచ్చకపోవచ్చన్న కేటీఆర్...గతంలో హైదరాబాద్ వరదల సమయంలో కొంత మంది బెంగళూరు నేతలు హైదరాబాద్ ను విమర్శించారని గుర్తు చేశారు. ఓ దేశంగా ప్రగతి పథంలో పయనించాలంటే అందరి అభిప్రాయాలు తీసుకుంటూ కలిసి నడవాల్సిన అవసరం ఉందన్నారు.
కేటీఆర్ పై నెటిజన్లు ఆగ్రహం
అయితే కేటీఆర్ ట్వీట్లకు కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. చిన్నపాటి వర్షానికే మునిగిపోయే హైదరాబాద్ రోడ్లను ఎందుకు బాగు చేయటం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని పక్కరాష్ట్రాలకు బోధిస్తున్న మంత్రి కేటీఆర్ తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ లో రోడ్ల దుస్థితి గురించి ఎవరిని కలిసి ఎవరితో మాట్లాడారంటూ రీట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.