PM Modi: కార్గిల్ వేదికగా పాక్‌కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
Kargil Vijay Diwas 2024: కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా లఢక్ ద్రాస్ సెక్టార్‌లో ఏర్పాటు చేసిన కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
Kargil Vijay Diwas: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (జూలై 26) కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లోని ద్రాస్ చేరుకున్నారు. ఇక్కడ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆయన అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. కార్గిల్ నుంచి పాకిస్థాన్ చేస్తున్న నీచమైన కుట్రలు ఎప్పటికీ ఫలించవని ప్రధాని మోదీ హెచ్చరించారు. 1999 యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా నేడు దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నారు. ప్రధాని మోదీ సైనిక వందనాన్ని స్వీకరించారు. అనంతరం- కార్గిల్ యుద్ధానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. భారత్ ఎలా విజయం సాధించిందో వివరిస్తూ ఆర్మీ అధికారులు చిత్రీకరించిన డాక్యుమెంటరీని తిలకించారు. నాటి విజయోత్సవాలను ఓ సారి గుర్తు చేసుకున్నారు.
వారి పేర్లు చెరిగిపోనివి : మోదీ
కార్గిల్‌లో అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. “దేశం కోసం చేసిన త్యాగాలు అజరామరం. కార్గిల్ యుద్ధానికి లడఖ్ సాక్షిగా నిలుస్తుంది. అమరుల త్యాగాలకు గుర్తుగా విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. మన బలానికి, సహనానికి, వాస్తవాలకు ఈ విజయగాథ నిదర్శనం. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారు. రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు కూడా గడిచిపోతున్నాయి. కార్గిల్ యుద్ధ సమయంలో సామాన్యుడిగా సైనికుల మధ్య ఉండే అదృష్టం నాకు దక్కింది. దేశం కోసం వారు చేసిన పోరాటం నా మదిలో నిలిచిపోయింది. మరికొద్ది రోజుల్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి ఐదేళ్లు నిండుతాయి. ఇప్పుడు జమ్మూకశ్మీర్ ప్రజలు సరికొత్త భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు. లఢక్, జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటక రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని, దశాబ్ధాల కాలం తర్వాత కాశ్మీర్‌లో సినిమా హాల్ ప్రారంభం కావడమే దీనికి నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం కశ్మీర్ శాంతి, సౌభ్రాతృత్వం వైపు వేగంగా పరిగెడుతోంది’’ అని మోదీ తెలిపారు.
పాక్ కు హెచ్చరిక
కార్గిల్ యుద్ధంలో ఘోర పరాజయాన్ని చవి చూసిన తర్వాత కూడా పాకిస్తాన్ ఇప్పటికీ గుణపాఠాలను నేర్చుకోలేదని మోదీ అన్నారు. భారత్‌పై పరోక్షంగా యుద్ధం ఇప్పటికీ కొనసాగిస్తోందన్నారు. భారత్‌లో అలజడి సృష్టించడానికి గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైందని గుర్తు చేశారు. అయినప్పటికీ దాని బుద్ధి మారట్లేదని ఎద్దేవా చేశారు. పాక్ నియంత్రణ రేఖ వద్ద నుంచి తాను ఆ దేశానికి హెచ్చరిస్తోన్నానని, భారత్‌లో అశాంతియుత వాతావరణాన్ని సృష్టించడానికి వాళ్లు దుర్మార్గపు ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించబోవని మోదీ అన్నారు. అలాంటి ప్రయత్నాలకు పాల్పడితే మన సైనికులు అణిచివేస్తారని, శత్రువులకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టన్నెల్
లడఖ్‌లోని షింకున్ లా టన్నెల్ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించారు. షింకున్ లా టన్నెల్ ప్రాజెక్టు పనులను మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. లేహ్‌కు వెళ్లే రూట్లో ఈ టన్నెల్‌ను నిర్మిస్తున్నారు. ఈ టన్నెల్ సుమారు 4.1 కి.మీ పొడవు ఉంటుంది. ట్విన్ ట్యూబ్ టన్నెల్‌ను సుమారు 15,800 ఫీట్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. నిమి-పదుం-దర్చా రోడ్డు మార్గంలో ఈ టన్నెల్‌ను నిర్మిస్తున్నారు. అయితే ఎటువంటి వాతావరణం ఉన్నా.. ఈ టన్నెల్ ద్వారా లేహ్‌కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ టన్నెల్ నిర్మాణం పూర్తి అయితే ప్రపంచంలోనే ఈ టన్నెల్ అత్యంత ఎత్తులో ఉన్న టన్నెల్‌గా రికార్డు క్రియేట్ చేస్తుంది. షింకున్ లా టన్నెల్ ద్వారా చాలా వేగంగా, సమర్థవంతంగా సైనిక దళాలు తమ ఆయుధాలను, సామాగ్రిని తరలించే అవకాశాలు ఉంటాయి. ఈ టన్నెల్ వల్ల లడాఖ్‌లో ఆర్థిక, సామాజిక ప్రగతి జరుగుతుందని భావిస్తున్నారు.