India News: పాకిస్థానీ ప్రేమికుడితో భారతీయ మహిళ అంజు పెళ్లి జరిగిందా? వాళ్లేం చెబుతున్నారు?
India News: రాజస్థాన్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన అంజు అనే మహిళ నస్రుల్లాను పెళ్లి చేసుకోలేదని చెబుతోంది. ఆమె కేవలం పాకిస్థాన్ చూసేందుకే అక్కడకు వెళ్లినట్లు వివరిస్తోంది. త్వరలోనే తాను ఇండియాకు వస్తుందట.
India News: రాజస్థాన్‌కు చెందిన అంజు అనే మహిళ తన ప్రేమికుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్ కు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. మంగళవారం రోజు వీరిద్దరూ పాకిస్థాన్ లోని గిరిజన ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని అప్పర్ దిర్ జిల్లా చుట్టూ తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి మాత్రమే కాదు అంజు ఇస్లాం మతంలోకి మారిందని, నస్రుల్లాను వివాహం చేసుకున్నట్లు కొన్ని పాకిస్థాన్ వార్తా సైట్‌లు తెలిపాయి. అయితే అంజు, నస్రుల్లా ఇద్దరూ ఈ వాదనలను "పుకార్లు"గా పేర్కొంటూ ఖండించారు. తాము ఇంకా పెళ్లి చేసుకోలేదని వెల్లడించారు. అంజు ఇస్తాం మతంలోకి మారి తన పేరును ఫాతిమాగా మార్చుకున్న వార్తలు కూడా తప్పని కొట్టి పారేశారు.
Video: Indian girl #Anju with her Pakistani friend Nasrullah Khan in his home district Dir pic.twitter.com/jJJaCmxq1U
— Naimat Khan (@NKMalazai) July 25, 2023
అంజు నా బెస్ట్ ఫ్రెండ్.. మాకింకా పెళ్లి కాలేదు!
అంజుతో తనకు ఇంకా పెళ్లి కాలేదని.. అసలీ తప్పుడు వార్తలన్నీ ఎలా వ్యాప్తి చెందుతున్నాయో తనకు అర్థం కావడం లేదని నస్రుల్లా వివరించారు. తమకు ఆపద ఉన్నందున కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. అంజు విదేశీయురాలు కావడంతో ప్రభుత్వం తమకు 50 మంది పోలీసు అధికారుల భద్రతను కూడా కల్పించిందన్నారు. అంజు పాకిస్థాన్‌లో విదేశీయురాలని.. అందుకే ఆమె ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిపారు. ఆమెపై ఎప్పుడైనా దాడి జరగవచ్చని.. ఇక్కడ రకరకాల మనుషులు ఉంటారని పేర్కొన్నారు. అందుకే ఆమెకు రక్షణ కల్పించాలని కోరుతూ.. కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. తమకు ఇంకా పెళ్లి కాలేదని.. వివాహ ధ్రువీకరణ పత్రంగా చూపిస్తున్న పేపర్ అంతా అబద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. అంజు తన ప్రాణ స్నేహితురాలు మాత్రమేనని, పాకిస్థాన్ చూడాలనే ఆశతో ఆమె టూరిస్ట్ వీసాపై ఇక్కడకు వచ్చారని అన్నారు.
భర్తతో విడాకుల తర్వాత ఆమె పెళ్లి ఆమె ఇష్టం
బురఖా ధరించడం ఇక్కడి సంప్రదాయం కావడంతో ఆమె బురఖా ధరించిందని వివరణ ఇచ్చారు. ఆమెను ఎవరూ గుర్తించ కూడదనే ఆమె బురఖా వేసుకుందని.. ఆమె మతం మారలేదని చెప్పారు. అంజుకు ఆమె భర్తతో విడాకులు తీసుకుంటోందని ఈ ప్రక్రియ జరుగుతోందనే విషయం కూడా తనకు తెలుసని... విడాకుల తర్వాత ఆమె ఎవర్ని పెళ్లి చేసుకుంటారనేది పూర్తిగా ఆమె నిర్ణయమే అని నస్రుల్లా చెప్పుకొచ్చారు. అంజు ప్రస్తుతం ఇండియాకు తిరిగి వెళ్లబోతోందని.. ఆగస్టు 4వ తేదీతో ఆమె వీసా గడువు ముగుస్తుందన్నారు.
నేను పాకిస్థాన్ చూసేందుకే వచ్చాను.. వార్తలన్నీ అవాస్తవం
నస్రుల్లా మాదిరిగానే అంజు కూడా తన పెళ్లి వాదనలను ఖండించింది. పాకిస్థాన్ లో తలపై ఏదైనా వేసుకొని బయటకు వెళ్లాలి కాబట్టి బురఖా ధరించానని స్పష్టం చేసింది. తాను పాకిస్థాన్ చూసేందుకు అక్కడకు వెళ్లగా.. ఓ ప్రసిద్ధ వ్లాగర్ తమ ఫొటోలు, వీడియోలు తీయగా వైరల్ గా మారినట్లు తెలిపారు. నస్రుల్లాను తాను పెళ్లి చేసుకోవడం పూర్తిగా అవాస్తవం అని.. తాను త్వరలోనే ఇండియాకు తిరిగి రాబోతున్నానని పేర్కొన్నారు. అలాగే తాము కొన్ని డాక్యుమెంట్ల కోసం కోర్టు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చిందని వెల్లడించారు.
అంజు తిరిగి దేశానికి వచ్చినా చచ్చినా మాకేం సంబంధం లేదు
తమ కూతురు పాక్ వెళ్లి నస్రుల్లాను పెళ్లి చేసుకుందని వస్తున్న వార్తలపై ఆమె తండ్రి స్పందించారు. తన కూతురితో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఏడాది కాలంగా ఆమెతో తాము మాట్లాడడం లేదని వివరించారు. ఆమె గురించి మాకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. భర్తతోపాటు పిల్లలను కూడా వదిలి పెట్టిన స్త్రీతో మాట్లాడడం కూడా వ్యర్థమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంజు తిరిగి ఇంటికి వచ్చినా అక్కడే చనిపోయినా తమకేం సంబంధం లేదని చెప్పారు. మధ్య ప్రదేశ్ లోని టేకాన్ పూర్‌లో నివాసం ఉంటున్న అంజు తండ్రి.. ఆమె "మానసికంగా కంగిపోయిందని" 'చెప్పారు. ఆమె పాకిస్థాన్ వెళ్లడం పట్ల తమకేమీ సంబంధం లేదన్నారు. ఎవరికీ చెప్పకుండా ఇలా పాక్ వెళ్లడం చాలా తప్పు అని అన్నారు.
ముఖ్యంగా అంజు ఇండియాలో ఉండగానే పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లో ఉన్న అంజు భర్త అరవింద్ తన భార్య త్వరలో దేశానికి తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీరికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు.