Aafghanistan Refugees: అఫ్గాన్ శరణార్థులకు ఆపన్నహస్తం... ఈ-వీసాలు ప్రకటించిన భారత్
అఫ్గానిస్థాన్ నెలకొన్న కల్లోల పరిస్థితుల నేపథ్యంతో భారత్ తో సహా పలు దేశాలు అఫ్గాన్ శరణార్థులకు ఈ-వీసాలు ప్రకటించాయి. మతపరమైన ప్రాధాన్యత లేకుండా వీసాలు జారీచేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకుని తమ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పరిస్థితులు రోజు రోజుకూ మారిపోతుండడంతో ఆ దేశం నుంచి బయటపడేందుకు పౌరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం తమ ప్రాణాల్ని సైతం పణంగా పెడుతున్నారు. ఎగిరే విమానంలో చోటు లేక రెక్కల్ని పట్టుకుని కాబూల్ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించి జారిపడి మృత్యువాత పడుతున్నారు. పరిస్థితుల గమనించిన భారత్, బ్రిటన్ సహా పలు దేశాలు ఆ దేశ పౌరుల్ని ఆదుకునేందుకు సిద్ధమయ్యాయి.
Also Read: Kabul Airport: కాబుల్ ఎయిర్ పోర్టులో కిక్కిరిసిన ప్రయాణికులు... ఎయిర్ పోర్టులో తొక్కిసలాట
రాయబార అధికారులు సురక్షితం
తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకోవడంతో భారత్ అప్రమత్తమైంది. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. అధికారులను స్వదేశానికి తరలించింది. 142 మంది భారత అధికారులున్న వాయుసేన యుద్ధ విమానం కాబూల్ విమానాశ్రయం నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్ చేరుకుందని అధికారులు ధ్రువీకరించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-17 విమానంలో అఫ్గానిస్థాన్ లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ స్వదేశానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఎంబసీ సిబ్బంది, ఐటీబీపీ జవాన్లు మొత్తం 142 మందితో సీ-17 విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్ లో లాండ్ అయ్యింది. కాబూల్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వీరిని ముందుగానే సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం వారందరిని సీ-17 విమానంలో భారత్‌కు తీసుకువచ్చారు.
Also Read: Imran Khan Endorses Taliban: పాక్ ప్రధాని రూటే సెపరేటు.. బానిస సంకెళ్లు తెంచేశారట!
మతపరమైన ప్రాధాన్యత లేదు!
అఫ్గానిస్థాన్‌లో కల్లోలం నెలకొన్న కారణంగా ఆ దేశ పౌరుల కోసం భారత్ కొత్త వీసా కేటగిరీని ఏర్పాటుచేసింది. అఫ్గాన్ శరణార్థుల దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఈ-ఎమర్జెన్సీ వీసాలను ప్రకటించింది. వీసా నిబంధనలపై కేంద్ర హోంశాఖ సమీక్ష చేపట్టి వీసా నిబంధనల్లో మార్పులు చేసిందని హోంశాఖ అధికార ప్రతినిధి ట్వీటర్ ద్వారా తెలిపారు. భారత్‌కు వచ్చేందుకు అఫ్గాన్లు చేసుకున్న వీసా దరఖాస్తులను తొందరంగా పరిశీలించేందుకు ఎలక్ట్రానిక్ వీసాలను ప్రవేశపెట్టిందని వెల్లడించారు. ఈ కేటగిరీతో ఎలాంటి మతపరమైన ప్రాధాన్యత లేకుండా అఫ్గాన్‌లోని ప్రతి ఒక్కరు వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. తొలుత ఆరు నెలల కాల పరిమితితో ఈ వీసాలు మంజూరు చేస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా దరఖాస్తుదారుల వ్యక్తిగత వివరాలను నిశితంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.