Siva Balakrishna Case: శివబాలకృష్ణ అక్రమాల కేసులో ఐఏఎస్ పేరు - సంచలనం సృష్టిస్తున్న కన్ఫెషన్ రిపోర్టు
Siva Balakrishna Case: శివబాలకృష్ణ చుట్టే కాదు వేర్వేరు అధికారులు కూడా ఆయన అక్రమాల కేసుల్లో ఇరుకుంటున్నారు.
Shiva Balakrishna Case: హెచ్ఎండీఏ(Hmda)) మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఆయన కన్ఫెషన్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో కీలకమైన ఓ ఐఏఎస్ అధికారి పేరు చెప్పినట్టు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. బాలకృష్ణ అరెస్టైనప్పటి నుంచి కూడా ఆయనతో కలిసి పని చేసిన అధికారులు, ఇతరులపై ఏసీబీ ఫోకస్ చేసింది. ఇప్పుడు ఆ కోణంలోనే తీగ లాగుతోంది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ( Acb) అధికారులు అరెస్ట్ చేయగా....కళ్లు చెదిరే రీతిలో ఆస్తులు భయపడ్డాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆయన ఆస్తుల విలువ రూ.13 కోట్లు కాగా...బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ సుమారు రూ.250 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఈడీ(ED) రంగంలోకి దిగింది. అతనిపై నమోదైన ఎఫ్‌ఐఆర్(FIR) తో పాటు, స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలు ఇవ్వాలని ఏసీబీని కోరారు. ఏసీబీ(Acb) 8 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించగా.. అతడి దందాలు మరిన్ని బహిర్గతమయ్యాయి.
శివబాలకృష్ణ అక్రమ సంపాదన మొత్తం భూములు కొనుగోళ్లు, ప్లాట్ల కొనుగోళ్లపైనే వెచ్చించినట్లు విచారణలో తేలింది. కుటుంబ సభ్యులు, బినామీలు మొత్తం కలిపి 200 ఎకరాల పైనే వెనకేశాడు. అన్ని జిల్లాల్లో కలిపి 29 ప్లాట్లు, 8 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లో ఎక్కువశాతం హైదరాబాద్(Hyderabad) చుట్టుపక్కలే ఉన్నట్లు తేలింది. శివబాలకృష్ణ ఇల్లు, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు... మూడురోజులపాటు హెచ్ ఎండీఏ ప్రధాన కార్యాలయంలోనూ తనిఖీలు చేశారు. అక్కడ స్వాధీనం చేసుకున్న దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పలు స్థిరాస్తి సంస్థలకు బాలకృష్ణ మంజూరు చేసిన అనుమతులపై ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే ఈడీ(Ed) రంగంలోకి దిగింది. ఈడీతోపాటు ఐటీ అధికారులు రంగంలోకి దిగనున్నారు.
పెద్దమొత్తంలో నగదు చేతులుమారడంతో మనీలాండరింగ్ కోణంలో శివబాలకృష్ణను విచారించే అవకాశం ఉంది. అటు బినామీ ఆస్తులపై ఐటీ అధికారులు విచారణ చేపట్టారు. శివబాలకృష్ణ(Siva Balakrishna) బంధువుల పేరిట 214 ఎకరరాల వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు. జనగామ జిల్లాలో 102, యాదాద్రి భువనగిరి జిల్లాలో 66, నాగర్‌కర్నూల్ జిల్లాలో 38, సిద్దిపేటలో 7 ఎకరాలు అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ తెలంగాణ(Telangana) తోపాటు ఏపీ(AP)లోనూ ఆస్తులు కొనుగోలు చేశారు. తెలంగాణలో 29, విశాఖ, విజయనగరంలో ఓపెన్ ప్లాట్లతో పాటు కోట్ల విలువైన విల్లాలు శివబాలకృష్ణ కొన్నారు. శివబాలకృష్ణతోపాటు ఆయనకు సహకరించిన ఇతర శాఖల్లోని అధికారుల పాత్రపైనా సమగ్ర దర్యాప్తు చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్(Hyd) చంచల్‌గూడ జైలులోఉన్న శివబాలకృష్ణను మరింత లోతుగా విచారించేందుకు ఏసీబీ( Acb) అధికారులు మరోసారి కష్టడీకి కోరే అవకాశం ఉంది. ఇంతలోనే ఈడీ రంగంలోకి దిగడంతో....శివబాలకృష్ణ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటున్నట్లు ఉంది.ఇప్పటి వరకు లభించిన పత్రాల ఆధారంగానే ఆయన ఆస్తులు బహిరంగ మార్కెట్ లో రూ.250 కోట్లు ఉండగా....మొత్తం అక్రమ సంపాదన వెయ్యికోట్లు దాటి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గత ప్రభుత్వంలో నేతల అండతో హెచ్‌ఎండీఏలోనే ఏళ్లతరబడి తిష్టవేసిన శివబాలకృష్ణ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములకు అనుమతులు విషయంలో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా వివాదాస్పద భూముల విషయంలో భారీగా ముడుపులు తీసుకునే వారని కార్యాలయంలో సిబ్బంది తెలిపారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు దాదాపు వందకు పైగా ఫైళ్లను ఆయన క్లియర్ చేశారని సమాచారం. ఎక్కడికక్కడ బినామీలను పెట్టుకుని ఆయన ఓ చిన్నపాటి దందానే నడిపారని తెలుస్తోంది.