Maharastra Land Deal: శివసేన ఎంపీ డ్రైవర్‌కు రూ.150 కోట్ల విలువైన భూమి రాసిచ్చిన నిజాం వారసులు - పెద్ద స్కామేనని ఆరోపణలు!
Maharastra : మహారాష్ట్రలో శివసేన ఎంపీ కారు డ్రైవర్ కు నిజాం వారసులు రూ.150 కోట్ల విలువైన మూడు ఎకరాలు గిఫ్టుగా ఇచ్చారు. ఇప్పుడీ వ్యవహారం రాజకీయ దుమారానికి కారణం అవుతోంది.

Hyderabad royals gift Rs 150 crore land to Shiv Sena MPs driver: పూర్వకాలంలో రాజులు తమకు మెచ్చేలా సేవలు చేసిన వారికి ఇచ్చితిమి పో అని చేతికి ఏది అందితే అది ఇచ్చేస్తారని సినిమాల్లో చూశాం. అలాగే.. హైదరాబాద్‌కు చెందిన రాజ కుటుంబం ఓ డ్రైవర్‌కు మూడు ఎకరాలు గిఫ్ట్ డీడ్‌గా రాసిచ్చేసింది. కానీ ఇక్కడ ట్విస్టులు ఉన్నాయి. ఆ డ్రైవర్ రాజకుటుంబం వద్ద పని చేయడం లేదు. మహారాష్ట్రలో శివసేన ఎంపీ వద్ద పని చేస్తున్నారు. ఆయన దగ్గర పనిచేస్తే.. హైదరాబాద్ రాజ కుటుంబం ఎందుకు భూమి గిఫ్ట్‌గా ఇచ్చిందన్నది ఇప్పుడు సస్పెన్స్ గామారింది. అది కూడా ఓ రాజకీయ నాయకుడి డ్రైవర్ కు. ఇప్పుడీ అంశంపై పోలీసులు ఆరా తీయడం ప్రారంభించారు.
మహారాష్ట్రలో ఒక షాకింగ్ గిఫ్ట్ డీడ్ వైరల్ గా మారింది. హైదరాబాద్‌కు చెందిన రాజ సాలార్ జంగ్ కుటుంబ సభ్యులు శివసేన ఎంపీ సందీపన్‌రావ్ భుమ్రే వద్ద పనిచేస్తున్న డ్రైవర్‌కు దాదాపు రూ.150 కోట్ల విలువైన మూడు ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చినట్లుగా ఓ గిఫ్ట్ డీడ్ వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ కుటుంబ వారసులు శివసేన ఎంపీ సందీపన్ భుమ్రే , ఆయన కుమారుడు, ఎమ్మెల్యే విలాస్ భుమ్రేల డ్రైవర్ అయిన జావేద్ రసూల్ షేక్‌కు రూ. 150 కోట్ల విలువైన మూడు ఎకరాల భూమిని ‘హిబానామా’ (గిఫ్ట్ డీడ్) ద్వారా బహుమతిగా ఇచ్చారు. ఈ అసాధారణ బదిలీపై ఆర్థిక నేరాల విభాగం (EOW) ప్రాథమిక విచారణను ప్రారంభించింది.ఈ లావాదేవీలో అనుమానాస్పద అంశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.
జావేద్ రసూల్ షేక్ కు38 సంవత్సరాలు మాత్రమే. ఆయనకు రాజకుటుంబంతో ఎలాంటి పరిచయాలు లేవు. శివసేన ఎంపీ సందీపన్ భుమ్రే మరియు ఆయన కుమారుడు, ఎమ్మెల్యే విలాస్ భుమ్రేలకు 13 సంవత్సరాలుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ కుటుంబ వారసులు గిఫ్ట్ గా ఇచ్చిన భూమి ఛత్రపతి సంభాజీనగర్‌లోని దావూద్‌పురాలో జల్నా రోడ్డులో ఉంది. మూడు ఎకరాల ప్రధాన భూమి, దసరా చౌక్ సమీపంలో ఉంది. ఈ భూమి విలువ సుమారు రూ. 150 కోట్లుగా అంచనా .
హైదరాబాద్ నిజాం దివాన్‌ల వారసులైన మీర్ మజర్ అలీ ఖాన్ , ఆయన ఆరుగురు బంధువులు. ఈ భూమి సాలార్ జంగ్ కుటుంబానికి చెందిన 12 ఎకరాలలో ఇది ఓ భాగం. ఇది జనవరి 30, 2023 వరకు న్యాయపరమైన వివాదంలో ఉంది. కోర్టు కేసు తేలిన వెంటనే.. ఈ భూమి ‘హిబానామా’ అనే చట్టపరమైన గిఫ్ట్ డీడ్ ద్వారా జావేద్ షేక్ పేరుపై బదిలీ చేశారు. ఛత్రపతి సంభాజీనగర్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ఈ లావాదేవీపై విచారణ చేపట్టింది. జావేద్ రసూల్ షేక్‌ను సమన్లు జారీ చేసి, అతని ఆదాయ వనరులు, ఆదాయపు పన్ను రిటర్న్‌లు, హిబానామా ఆధారాన్ని చూపించాలని ఆదేశించింది.
జావేద్ షేక్‌కు సాలార్ జంగ్ కుటుంబంతో ఎటువంటి రక్త సంబంధం లేకపోవడం వల్ల, ఇంత విలువైన భూమిని బహుమతిగా ఇవ్వడం అనుమానాస్పదంగా భావిస్తున్నారు. సాలార్ జంగ్ కుటుంబ సభ్యులు EOW సమన్లకు స్పందించలేదు. ఎమ్మెల్యే విలాస్ భుమ్రే ఈ లావాదేవీ జావేద్ వ్యక్తిగత విషయమని తమకు సంబంధం లేదని చెబుతున్నారు.
ఈ రూ. 150 కోట్ల భూమి బహుమతి ఘటన మహారాష్ట్రలో రాజకీయ మరియు ఆర్థిక వర్గాలలో సంచలనం సృష్టించింది. జావేద్ రసూల్ షేక్‌కు సాలార్ జంగ్ కుటుంబం ఇంత విలువైన ఆస్తిని ఎందుకు బహుమతిగా ఇచ్చిందనే దానిపై EOW విచారణ కొనసాగుతోంది. అందరూ శివసేన ఎంపీ, ఆయన కుమారుడి వైపు అనుమానాస్పదంగా చూస్తున్నారు. కానీ వారు మాత్రం తమకు సంబంధం లేదని అంటున్నారు.





















