Heeraben Modi Death: అమ్మను పోగొట్టుకోవడం కన్నా పెద్ద లోటు ఇంకేదీ ఉండదు - ప్రధాని మోడీకి పాక్ ప్రధాని సానుభూతి
Heeraben Modi Death: ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మృతి పట్ల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతాపం వ్యక్తం చేశారు.
Heeraben Modi Death:
షెహబాజ్ సంతాపం..
ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ మృతిపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతాపం తెలిపారు. అమ్మను కోల్పోవడం కన్నా అతి పెద్ద లోటు ఇంకేదీ ఉండదని అన్నారు. ట్విటర్ వేదికగా ప్రధాని మోడీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
There is no greater loss than losing one’s mother. My condolences to Prime Minister @narendramodi on the passing away of his mother.
— Shehbaz Sharif (@CMShehbaz) December 30, 2022
అహ్మదాబాద్‌లోని U N Mehta Heart Hospitalలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. "హీరాబెన్ మోడీ ఉదయం 3.30 నిముషాలకు తుదిశ్వాస విడిచారు" అని వైద్యులు వెల్లడించారు. ప్రధాని మోడీ సోదరుడు పంకజ్ మోడీ ఇంటికి మృతదేహాన్ని తరలించారు. ఈ వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన మోడీ బయల్దేరారు. తల్లి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అంత్యక్రియలు పూర్తి చేశారు. ట్విటర్‌లో ఎంతో భావోద్వేగంతో ట్వీట్‌లు చేశారు. "100 ఏళ్ల మహా ప్రస్థానం" అంటూ తన తల్లిని స్మరించుకున్నారు. "100 ఏళ్ల ప్రయాణం ముగిసింది. నా తల్లిలో నేను మూడు గొప్ప లక్షణాలు గమనించాను. తపస్విలా జీవించడం, తన గురించి తాను పట్టించుకోకుండా పని చేయడం, విలువలను వీడకపోవడం..ఇవే ఆమెలోని గొప్ప గుణాలు" అని ట్వీట్ చేశారు మోడీ. వందో పుట్టిన రోజు వేడుకలకు వెళ్లినప్పుడు తన తల్లి చెప్పిన మాటల్నీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. "ఆమె 100వ పుట్టిన రోజు కలిశాను. ఆమె నాకు అప్పుడు ఒకే విషయం చెప్పింది. తెలివితో పని చేయాలి. స్వచ్ఛతతో జీవించాలి" అని ట్వీట్ చేశారు.
ప్రముఖుల సంతాపం..
హీరాబెన్ మోదీ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రముఖులు.. ప్రధాని మోదీ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
" ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తల్లి హీరాబా వంద సంవత్సరాల పోరాట జీవితం భారతీయ ఆదర్శాలకు ప్రతీక. మోదీజీ తన జీవితంలో '#మాతృదేవోభవ' అనే స్ఫూర్తిని, హీరాబా విలువలను ఎంతగానో పాటించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి! "
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
" ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి శ్రీమతి హీరాబా మరణవార్త చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ సహా ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని, ప్రేమను తెలియజేస్తున్నాను. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
" గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తల్లి శ్రీమతి హీరా బెన్ మరణం విచారకరం. తల్లి మరణం భరించలేని, పూడ్చలేని లోటు. ప్రపంచంలో తల్లి స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. మరణించిన వారి ఆత్మకు
శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ దుఃఖ ఘడియలో బాధను భరించే శక్తిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. "
- నితీశ్ కుమార్, బిహార్ సీఎం