UAE Rains: యూఏఈలో మరోసారి భారీ వర్షాలు, నీట మునిగిన దుబాయ్ అబుదాబి - ఫ్లైట్‌లు రద్దు
UAE Rains: యూఏఈలో మరోసారి భారీ వర్షాలు కురవడం వల్ల పలు ఫ్లైట్ సర్వీస్‌లను రద్దు చేస్తున్నట్టు ఆయా సంస్థలు ప్రకటించాయి.
Heavy Rains in UAE: దుబాయ్‌లో మరోసారి భారీ వర్షాలు (Rains in UAE) కురుస్తున్నాయి. మెరుపులతో కూడిన వానలు మళ్లీ నగరాన్ని ముంచెత్తాయి. ఫలితంగా యూఏఈకి వెళ్లే పలు ఫ్లైట్స్ రద్దయ్యాయి. రెండు వారాల క్రితం ఇదే విధంగా దుబాయ్‌లో భారీ వానలు పడి విమానాలు రద్దయ్యాయి. ఇప్పుడిప్పుడే అంతా సాధారణ పరిస్థితికి వచ్చేస్తోందనగా ఒకేసారి కుండపోత కురిసింది. మే 1వ తేదీన నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కీలక ప్రకటన చేసింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేసింది. అయితే..గత నెలలో కురిసిన వానలతో పోల్చి చూస్తే ఈ సారి తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఏప్రిల్ 14-15వ తేదీల్లో 1949 తరవాత అత్యధిక వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పుడు మరోసారి వానలు కురుస్తుండడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే Emirates airline కొన్ని ఫ్లైట్ సర్వీస్‌లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
Abu Dhabi Right Now 🌧️🌧️🌧️🌧️🌧️ pic.twitter.com/RZRwZWLTE2
— Au Rangzab Younis (@SardarAurangzab) May 1, 2024
పలు ఫ్లైట్ సర్వీస్‌లు రద్దు..
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చే విమానాల రాకపోకల్నీ చాలా వరకూ తగ్గించినట్టు వెల్లడించింది. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లే, ఇక్కడికి వచ్చే ప్రయాణికులు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా దాదాపు అన్ని విద్యా సంస్థలు ఆన్‌లైన్ క్లాస్‌లు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు నడుచుకోవాలని వెల్లడించింది. దుబాయ్‌తో పాటు మరి కొన్ని నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రైవేట్ సెక్టార్‌లోని కంపెనీలన్నీ రిమోట్ వర్క్‌ని అమలు చేస్తున్నాయి. ముఖ్యమైన ఉద్యోగులు మాత్రమే ఆఫీస్‌లకు వెళ్తున్నారు. ప్రస్తుతం కురిసిన వానలకు దుబాయ్‌తో పాటు అబుదాబి కూడా నీట మునిగింది. దుబాయ్‌కి వచ్చే ఫ్లైట్స్‌ని దారి మళ్లిస్తున్నారు. తెల్లవారు జామున 3 గంటల నుంచే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
క్లౌడ్ సీడింగ్ వల్లే వానలా..?
క్లౌడ్ సీడింగ్ కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నాయని ఇటీవల కొందరు నిపుణులు వెల్లడించారు. ఎడారి దేశమైన యూఏఈ నీటి సంరక్షణ కోసం మేఘమథనం చేసి ఆ వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవాలని చూస్తోంది. చాలా కాలంగా ఈ ప్రక్రియను కొనసాగిస్తోంది. మేఘాల్లో పొటాషియం క్లోరైడ్ లాంటి నాచురల్ సాల్ట్‌ని వేయడం ద్వారా వాటిని కరిగించొచ్చు. ఈ కెమికల్ కారణంగా మేఘాల పరిమాణం పెరగడంతో పాటు ఒకేసారి కరిగి వాన పడుతుంది. ఈ కారణంగానే దుబాయ్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిసినట్టు చెబుతున్నారు.కాకపోతే ఈ స్థాయిలో కుండపోత కురుస్తుందని అధికారులు ఊహించలేదు. ఫలితంగా సిటీ అంతా వరదలు ముంచెత్తాయి. వాటి నుంచి త్వరగానే కోలుకున్నప్పటికీ మళ్లీ ఇప్పుడు వానలు కురుస్తుండడం వల్ల ఆందోళన మొదలైంది.