Heatwave in India: నిప్పులు చెరుగుతున్న సూరీడు, 90% ప్రాంతాలు హైరిస్క్‌లో ఉన్నాయంటున్న రిపోర్ట్
Heatwave in India: దేశవ్యాప్తంగా వడగాలుల తీవ్రత పెరుగుతోంది.
Heatwave in India:
హెచ్చరికలు..
దేశవ్యాప్తంగా సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. వడ దెబ్బలతో ఎక్కడో ఓ చోట ప్రాణాలు కోల్పోతున్నారు. IMD ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరో ఐదు రోజుల పాటు వడగాలుల తీవ్రత పెరుగుతుందని తేల్చి చెప్పింది. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలెర్ట్ అయ్యాయి. ఇప్పుడున్న ఉష్ణోగ్రతలతోనే అల్లాడిపోతుంటే...కొత్తగా వచ్చిన ఓ రిపోర్ట్ బుర్రను ఇంకా హీట్ ఎక్కిస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా దేశ నలుమూలలా వడగాడ్పుల తీవ్రత పెరుగుతూ వస్తోందని వెల్లడించింది. ప్రస్తుతానికి దేశంలోని 90% ప్రాంతాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని తేల్చి చెప్పింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ప్రమాదకర పరిస్థితులున్నాయని తెలిపింది. University of Cambridge విడుదల చేసిన ఈ రిపోర్ట్‌లో వేడిగాలుల కారణంగా తీవ్రంగా నష్టపోయే ప్రాంతాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఈ వాతావరణ మార్పుల కారణంగా భారత్ సుస్థిరాభివృద్ధిలోని కొన్ని లక్ష్యాలను గడువులోగా సాధించలేకపోతోందని తెలిపింది.
వేలాది మంది మృతి
గత 50 ఏళ్లలో భారత్‌లో వడ గాలుల కారణంగా 17 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ మాజీ సెక్రటరీ ఎమ్ రాజీవన్ వెల్లడించారు. ఈ మరణాలపై 2021లో ఓ రిపోర్ట్ కూడా వచ్చింది. 1971 నుంచి 2019 మధ్య కాలంలో ఎక్కువగా మరణాలు నమోదయ్యాయి. ఇటీవల నవీ ముంబయిలో వడ దెబ్బ కారణంగా 13 మంది చనిపోయారు. నిర్లక్ష్యం చేస్తే అన్ని చోట్లా ఇలాంటి మరణాలు నమోదయ్యే ప్రమాదముందని చెబుతోంది IMD. దేశంలో 90% మేర ప్రాంతాలు "హై రిస్క్"లో ఉన్నాయి. ఈ సమస్యను ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రభావం అభివృద్ధిపై పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీలో హీట్ వేవ్స్ కారణంగా విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడుతోంది. తాగు నీటికీ తంటాలు పడుతున్నారు అక్కడి ప్రజలు.
IMD అలెర్ట్
కొద్ది రోజుల పాటు ఈ వేడిగాలుల ముప్పు తప్పదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది. దీన్నే టెక్నికల్ పరిభాషలో Blackouts అంటారు. సాధారణంగా వేసవిలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటుంది. అయితే...విపరీతమైన వేడి కారణంగా ట్రాన్స్‌మిష్ లైన్స్ సరైన విధంగా పవర్‌ను సప్లై చేయలేవు. ఈ కారణంగానే పదేపదే కరెంట్ పోవడం, సప్లైలో అంతరాయం ఏర్పడడం లాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే జరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షలాది మంది ప్రజలు ఈ వేడిగాలుల ప్రభావానికి గురయ్యే ప్రమాదముంది. వడ దెబ్బల కారణంగా ప్రాణాలూ కోల్పోయే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు చోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. లు రాష్ట్రాలకు హీట్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది భారత వాతావరణ విభాగం (IMD).హరియాణా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా ఈ జాబితాలో ఉన్నాయి.