Heart Attack: భయపెడుతున్న మరణాలు - గుండెపోటుతో ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి
Heart Attack: రోజురోజుకూ గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఎనిమిదో తరగతి విద్యార్థి హాస్టల్ ల్లోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
Heart Attack: ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి 30 ఏళ్ల వయసు వారు గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారు. డ్యాన్స్ చేస్తూనో, కాలేజీలో స్నేహితులతో కబుర్లు చెబుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఒకప్పుడు యాభై ఏళ్లు దాటిన వారిలో గుండెపోటు, ఇతర గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తేవి. కానీ ఇప్పుడు యువత కూడా గుండె జబ్బుల ప్రమాదంలో పడింది. ఎక్కడికక్కడ నడుస్తూ, పని చేసుకుంటూనే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ ఎనిమిదో తరగతి విద్యార్థి హాస్టల్ లోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
అసలేం జరిగిందంటే..?
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఎస్సీ హాస్టల్ లో ఉంటున్న ఓ 13 ఏళ్ల బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అప్పటివరకు బాగున్న బాలుడు భోజనం చేసిన తర్వాత నుంచి ఛాతీలో నొప్పిగా ఉందని, ఊపిరాడడం లేదని తన స్నేహితులతో చెప్పాడు. వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలపగా వెంటనే వారు ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదిస్తున్నారు. బాగా చదువుకొని తమకు చక్కగా చూసుకుంటాడని అనుకున్న కొడుకు చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం ఏంటా అని కన్నీరుమున్నీరవుతున్నారు.
గుండెపోటు ఎందుకు వస్తుంది?
గుండెపోటు రావడానికి ప్రధాన కారణం రక్తనాళాల్లో రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడడం, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం జరిగితే గుండె సరిగా రక్త సరఫరా చేయలేదు. దీనివల్ల గుండెపోటు వస్తుంది. ప్రపంచంలో గుండె జబ్బుల కారణంగా ప్రతి ఏటా 17 మిలియన్లకు పైగా వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో ఐదవ వంతు మమరణాలు సంభవిస్తున్నది మనదేశంలోనే. హృదయ సంబంధ వ్యాధులు అనేక రకాలుగా ఉంటాయి అధిక రక్తపోటు వల్ల కలిగేవి, అరిథ్మియా, హృదయ ధమణి వ్యాధి ఇలా రకరకాలుగా రక్తనాళాల్లో ఇబ్బందులను కలుగ చేసే జబ్బులు ఉన్నాయి. ఏదేమైనా చివరకు జరిగేది గుండెపోటు రావడమే. అయితే గుండెపోటు వచ్చే ముందు కొన్ని ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని చాలామంది తేలిగ్గా తీసుకుంటారు.
కనిపించే లక్షణాలు
1. ఛాతి నొప్పి వస్తూ పోతూ ఉంటుంది.
2. శ్వాస సరిగా ఆడదు.
3. చేయి లేదా భుజం నొప్పి వేధిస్తూ ఉంటుంది.
4. బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఈ లక్షణాలు గుండెపోటు రావడానికి కొన్ని వారాలు లేదా రోజులు ముందు జరగవచ్చు. కొందరి విషయంలో గంటల ముందు కూడా ఇవి కనిపించే అవకాశం ఉంది. మెడ గట్టిగా పట్టేయడం, భుజం నొప్పి, అజీర్ణం, అలసట, చల్లని చెమటలు పట్టడం కూడా గుండెపోటు రాకకు ముందస్తు సంకేతాలే. అలాగే మానసిక ఆందోళన, ఏదో వినాశనం జరగబోతుంది అంటూ వచ్చే ఆలోచనలు, గుండె దడ, శ్వాస సరిగా ఆడక పోవడం కూడా తీవ్రంగా పరిగణించాల్సిన లక్షణాలు. ఇక్కడ చెప్పినవన్నీ రోజుల్లో కాసేపు వచ్చి పోతుండటంతో ఎక్కువమంది వీటిని తేలిగ్గా తీసుకుంటారు. ఇవి కొన్ని నిమిషాల పాటు లేదా సెకండ్ల పాటు కనిపించినా కూడా గుండె వైద్యులను కలిసి పరిస్థితిని వివరించడం చాలా ముఖ్యం.