Harish Rao: తెలంగాణలో త్వరలో 60 వేల ఉద్యోగాల భర్తీ.. మంత్రి హరీశ్ వెల్లడి..
ప్రైవేటీకరణ పేరుతో రైల్వే, విమానాశ్రయాలు, రహదారులు, విశాఖ స్టీల్, బీఎస్ఎన్ఎల్ లాంటి వాటిని కేంద్రం అమ్మేస్తోందని.. చివరకు సహజవనరులైన గాలీ, నీళ్లు కూడా అమ్మేస్తుందేమో అని మంత్రి హరీశ్ అన్నారు.
త్వరలోనే తెలంగాణలో 55 వేల నుంచి 60 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. వీటిలో ఎంఈవో పోస్టులు సహా విద్యా శాఖలోని ఇతర పోస్టులు ఉంటాయని చెప్పారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు పూర్తయిన వెంటనే నియమకాల ప్రక్రియ చేపడతామని తెలిపారు. హుజురాబాద్‌లో పీఆర్టీయూ టీఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కృతజ్ఞత సభలో హరీశ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపే సభకు తనను ఆహ్వానించినందుకు టీచర్లకు ధన్యవాదాలు తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీకి అనుబంధ ఉపాధ్యాయ సంఘం లేదని అన్నారు. తమది ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని హరీశ్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 30 శాతం పీఆర్సీ ప్రకటించి చరిత్ర తిరగ రాశామని చెప్పారు. కరోనా వల్లే పీఆర్సీ ప్రకటన కొంత ఆలస్యమైందని తెలిపారు. కేంద్రం పదేళ్లకోసారి పే రివిజన్ చేస్తే.. మన రాష్ట్రంలో ఐదేళ్లకోసారి జరుగుతుందని వెల్లడించారు. పదేళ్లకోసారి ఇచ్చే పీఆర్సీ 15 శాతమైతే... ఐదేళ్లకోసారి ఇచ్చే మన పీఆర్సీ 30 శాతం ఉందని చెప్పారు.
ఈటల రాజీనామా ఎందుకు చేసినట్లు?
ఈటల రాజేందర్ రాజీనామా గురించి హరీశ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజీనామా ఎందుకు చేసినట్లని ప్రశ్నించారు. హుజురాబాద్ అభివృద్ధి కోసమే ఆయన రాజీనామా చేశారా అని అడిగారు. ఆయన గెలిస్తే వ్యక్తిగతంగా ఈటలకు, పార్టీగా బీజేపీకి మేలు జరగవచ్చని... కానీ హుజురాబాద్ ప్రజలకు ఏం లాభమని అన్నారు. ఈ ప్రాంతం బాగుపడాలంటే ఎవరివల్ల సాధ్యమవుతుందో చర్చ పెట్టాలని కోరారు. బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితికి, మన పరిస్థితి అంచనా వేసుకోవాలని సూచించారు.
గాలిని కూడా అమ్మేస్తారేమో?
ప్రైవేటీకరణ పేరుతో రైల్వే, విమానాశ్రయాలు, రహదారులు, విశాఖ స్టీల్, బీఎస్ఎన్ఎల్ లాంటి వాటిని కేంద్రం అమ్మేస్తోందని.. చివరకు సహజవనరులైన గాలీ, నీళ్లు కూడా అమ్మేస్తుందేమో అని హరీశ్ వ్యంగాస్త్రాలు విసిరారు. ప్రైవేటీకరణ వల్ల రిజర్వేషన్లు పోతాయని వ్యాఖ్యానించారు.
అత్యధిక వేతనాలు తెలంగాణలోనే..
దేశంలో కెల్లా అత్యధిక వేతనాలు పొందుతున్న ఉద్యోగులు కేవలం తెలంగాణలోనే ఉన్నారని హరీశ్ అన్నారు. అతి తక్కువ వేతనాలు తీసుకునే ఉపాధ్యాయులు గుజరాత్ లో ఉంటే.. అత్యధిక జీతం తీసుకునే టీచర్లు తెలంగాణలో ఉన్నారని తెలిపారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందిందనడానికి వృద్ధి రేటు (జీడీపీ, జీఎస్డీపీ), తలసరి ఆదాయం సూచికలని తెలిపారు. ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం 93.5 శాతం వృద్ధి సాధిస్తే.. ఇండియా మాత్రం 58.4 శాతమే సాధించిందని పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో 10వ స్థానంలో ఉండే తెలంగాణ.. ఇప్పుడు మూడో స్థానానికి ఎదిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఎన్జీవో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దేవి ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.