Israel-Hamas War: గాజాను నిర్బందిస్తే.. బందీలను చంపుతామని బెదిరిస్తున్న హమాస్
Israel-Hamas War: గాజాకు నీటి సరఫరా, విద్యుత్ సరఫరాను ఆపేస్తామని, గాజాను పూర్తిగా నిర్బంధిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరికలు చేస్తోంది. అలా చేస్తే బందీలను చంపేస్తామని హమాస్ హెచ్చరించింది.
పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ సంస్థ చేస్తున్న దాడులను తిప్పి కొడుతూ ఇజ్రాయెల్ గాజాపై దాడులకు పాల్పడుతోంది. అంతేకాకుండా గాజాకు నీటి సరఫరా, విద్యుత్ సరఫరాను ఆపేస్తామని, గాజాను పూర్తిగా నిర్బంధిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరికలు చేస్తోంది. అయితే అలా చేస్తే ఇజ్రాయెల్ నుంచి బందీలుగా తెచ్చిన ప్రజలను చంపేస్తామని హమాస్ హెచ్చరించింది. ముందస్తు హెచ్చరికలు లేకుండా గాజాలోని పౌర ప్రాంతాలపై దాడులు చేస్తే తమ వద్ద బందీలుగా ఉన్న వారిని హతమార్చుతామని ఆడియో సందేశం విడుదల చేశారు. పౌర ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని హమాస్ ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల బందీలుగా ఉన్న నలుగురు ఆ దేశ పౌరులు చనిపోయారని చెప్తోంది.
ఇప్పటికి ఇజ్రాయెల్, హమాస్ పరస్పర దాడుల్లో రెండు వైపులా కలిపి 1600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. ఇజ్రాయెల్ వైపు 900 మంది మరణించగా, గాజా వైపు 680పైగా మృతి చెందారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్‌కు గట్టి హెచ్చరిక చేశారు. తమ ప్రభుత్వం ఇప్పటికి 3 లక్షల మంది సైనికులను సమీకరించిందని చెప్పారు. ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ప్రారంభించలేదు, కానీ ఇజ్రాయెల్ దీనిని పూర్తి చేస్తుందని అన్నారు. తాము ఈ యుద్ధాన్ని కోరుకోలేదు కానీ అత్యంత క్రూరమైన రీతిలో బలవంతంగా దీనిని ప్రారంభించారని చెప్పారు. తమపై దాడి చేయడం అతి పెద్ద చారిత్రాత్మక తప్పిదం అని హమాస్ త్వరలోనే అర్థం చేసుకుంటుందని అన్నారు. రాబోయే దశాబ్దాల పాటు ఇజ్రాయెల్ శత్రుదేశాలకు గుర్తుండిపోయేలా తాము హమాస్‌కు సమాధానం చెప్తామని నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆయన హమాస్‌ను ఐసిస్ తరహా సంస్థగా పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఐరాస ప్రజల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్ చట్టబద్ధమైన భద్రతా ఆందోళనలు తాము గుర్తించామని, అయితే సైనిక కార్యకలాపాలు అంతర్జాతీయ మానవతా చట్టాలకు అనుగుణంగా ఉండాలని ఇజ్రాయెల్‌కు గుర్తు చేస్తున్నట్లు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. శనివారం గాజా నుంచి ప్రారంభమైన ఈ దాడి రాను రాను తీవ్ర రూపం దాల్చుతోంది. హమాస్ ఆకస్మికంగా 30 నిమిషాల వ్యవధిలో వేలాది రాకెట్లు ఇజ్రాయెల్‌పై ప్రయోగించి యుద్ధం ప్రారంభించింది. ఇజ్రాయెల్ కూడా గాజాపై ప్రతి దాడి చేస్తోంది.
ఇజ్రాయెల్-హమాస్ దాడిలో 11 మంది అమెరికన్లు మరణించినట్లు యూఎస్ ధృవీకరించింది. మరికొంత మంది బందీలుగా ఉన్నట్లు ఆందోళన వ్యక్తంచేస్తోంది. అయితే యుద్ధంలో సైనికంగా పాల్గొనే ఉద్దేశం లేదని అమెరికా తెలిపింది. అయితే ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తోంది. ఇరాన్ ఇతర దేశాలు ఇందులో జోక్యం చేసుకోవద్దని అమెరికా హెచ్చరిస్తోంది.
ఇజ్రాయెల్ కూడా గాజాపై భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే తాము హమాస్‌కు సంబంధించిన చాలా ప్రాంతాలపై పట్టు సాధించినట్లు చెప్తోంది. గాజాలో తలదాచుకుంటున్న సుమారు 400 మంది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు, పదుల సంఖ్యలో వారిని బందీలుగా పట్టుకున్నట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ దళాలకు, హమాస్ ఉగ్రవాదులకు మధ్య కిఫర్ అజాలో భీకరపోరు కొనసాగుతోంది. ఈ ప్రాంతం గాజా సరిహద్దులో ఉంటుంది. దాంతో కనిపించిన ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టేందుకు ఐడీఎఫ్ ప్రయత్నిస్తోంది.