Galla Jayadev: పార్ట్ టైంగా రాజకీయాలు చేయలేను - అందుకే పూర్తిగా తప్పుకుంటున్నా - గల్లా జయదేవ్
Galla Jayadev Comments: బిజినెస్ పార్ట్ టైంగా చేయొచ్చు కానీ.. రాజకీయాలు పార్ట్ టైంగా చేయలేమని గల్లా జయదేవ్ వివరించారు. అందుకే తాను రాజకీయాల నుంచి వైదొలుతుగుతున్నానని ప్రకటించారు.
Guntur MP Galla Jayadev: గుంటూరు ఎంపీ, టీడీపీ నేత గల్లా జయదేవ్ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తనను రెండుసార్లు గుంటూరు లోక్ సభ స్థానం నుంచి గెలిపించినందుకు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటామని కొద్దిరోజుల క్రితమే గల్లా జయదేవ్ కుటుంబం ప్రకటన చేసింది. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడైన గల్లా జయదేవ్.. రాజకీయాల్లోకి వచ్చి.. 2014, 2019లో రెండుసార్లు గుంటూరు ఎంపీగా గెలిచారు.
ఆయనకు అమరరాజా బ్యాటరీస్ కంపెనీ సహా ఇతర వ్యాపారాలు ఉండడంతో సంస్థను ఇతర దేశాల్లో విస్తరించడం వంటి కార్యకలాపాలు చేపట్టనున్నట్లు గల్లా జయదేవ్ ప్రకటించారు. తాను తన వ్యాపారాలు, రాజకీయాలు కలిపి చేయలేకపోతున్నట్లుగా చెప్పారు. బిజినెస్ పార్ట్ టైంగా చేయొచ్చు కానీ.. రాజకీయాలు పార్ట్ టైంగా చేయలేమని వివరించారు. అందుకే తాను రాజకీయాల నుంచి వైదొలుతుగుతున్నానని ప్రకటించారు. తన వ్యాపారాలను మరింత విస్తరించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా గల్లా మాట్లాడుతూ.. ‘‘24 శాతం మంది పార్లమెంట్ లో వ్యాపారవేత్తలు ఉన్నారు. ప్రభుత్వంపై పోరాడితే వ్యక్తిగతంగా వ్యాపారాలని దెబ్బతీసే అవకాశం ఉంది. అయినా భయపడకుండా చట్టబద్ధంగా పోరాటం చేస్తున్నాం. నిజాయతీగా ఉండే నాయకులు రాజకీయాల్లోకి వస్తే సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గెలిచి పార్లమెంట్ లో సైలెంట్ గా కూర్చోవడం నా వల్ల కాదు. 2024 ఎన్నికల్లో పోటీ చేయను. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సలహాలతో ఈ నిర్ణయం తీసుకుంటున్నా.
ప్రస్తుత పరిస్థితుల్లో ఫుల్ టైమ్ పొలిటీషియన్స్ గా ఉండలేను కాబట్టి వ్యాపారాలు చూసుకుంటూ కుటుంబ సభ్యులతో కాలం గడుపుతాను. అవసరం ఉన్నప్పుడు తప్పకుండా తిరిగి రాజకీయాల్లోకి వస్తాను. బిజినెస్ పార్ట్ టైమ్ గా చెయ్యొచ్చు కానీ.. రాజకీయాలు అలా కాదు. ఈసారి రాజకీయాల్లోకి వచ్చేది అయితే ఫుల్ టైమ్ పొలిటీషియన్ గానే వస్తాను. వ్యాపారం అయినా, రాజకీయాలు అయినా దేశం కోసం మాత్రమే చేస్తాను’’ అని గల్లా జయదేవ్ అన్నారు.