Donald Trump: మరోసారి తప్పకుండా పోటీ చేస్తాను, ఆ అవసరం ఉందనిపిస్తోంది - అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్
Donald Trump: మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
Donald Trump:
రిపబ్లికన్ల తరపున ప్రచారం..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు అవే సంకేతాలిస్తున్నాయి. 2024లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేశారు ట్రంప్. ఓ మీటింగ్‌కు హాజరైన ఆయన..."తరవాతి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా" అన్న ప్రశ్నకు "తప్పకుండా చేస్తాను" అని సమాధానిచ్చినట్టు BBC రిపోర్ట్ చేసింది. మిడ్‌టర్మ్ ఎన్నికల్లో భాగంగా రిపబ్లికన్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న ఆయన ఓ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయితే..ఈలోగా మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎలక్షన్‌లో ప్రస్తుత ప్రభుత్వంపై అక్కడి ప్రజల అభిప్రాయమేంటే కచ్చితంగా తెలుస్తుంది. ఇందులోని ఫలితాలు...అధ్యక్ష ఎన్నికలనూ ప్రభావితం చేస్తాయి. పూర్తిగా అక్కడి రాజకీయాలు మారిపోయే అవకాశమూ ఉంది. 2020లో జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ట్రంప్ మరోసారి ఆరోపించారు. "నేను రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేశాను. మొదటి సారి కంటే రెండోసారి ఎక్కువ మొత్తంలో ఓట్లు సాధించాను. 2020లో జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఏ సిట్టింగ్ అధ్యక్షుడికీ రాని స్థాయిలో నాకు ఓట్లు వచ్చాయి" అని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశానికి భద్రత కల్పించేందుకు, పురోగతి సాధించేందుకు తాను మరోసారి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ వెల్లడించారు. గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు 72 మిలియన్ ఓట్లు రాగా...జో బైడెన్‌కు 81 మిలియన్ ఓట్లు వచ్చాయి.
హిందువుల మద్దతు కావాలి: ట్రంప్
అంతకు ముందు డొనాల్డ్ ట్రంప్.. ఫ్లోరిడాలో రిపబ్లికన్ హిందూ కూటమి (ఆర్‌హెచ్‌సీ) ఏర్పాటు చేసిన దీపావళి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
" మాకు హిందూ జనాభా నుంచి రెండు సార్లు (2016, 2020) ఎన్నికల్లో గొప్ప మద్దతు లభించింది. భారత ప్రజలు ఎప్పుడూ నాకు మద్దతు పలుకుతూనే ఉన్నారు. కీలకమైన రాష్ట్రాల్లో హిందూ ఓటర్లు అందించిన మద్దతుతోనే నేను 2016లో అధ్యక్ష పీఠం అధిరోహించాను. వాషింగ్టన్ డీసీలో హిందూ హోలోకాస్ట్ స్మారకాన్ని నిర్మించాలనే ఆలోచనను నేను పూర్తిగా ఆమోదించాను. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని పూర్తి చేస్తాం. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో నేను గెలిస్తే భారత్- అమెరికా సంబంధాలను మరో స్థాయికి తీసుకువెళ్తాను. నేను నెగ్గితే ఆర్‌హెచ్‌సీ వ్యవస్థాపకుడు శలభ్‌కుమార్‌ను భారత్‌లో అమెరికా రాయబారిగా నియమిస్తాను. అయితే పోటీ చేసే విషయంలో నేనింకా నిర్ణయం తీసుకోలేదు. "
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు
2020లో తాను పోటీ చేసిన అధ్యక్ష ఎన్నికల సమయంలో 'ది బిగ్ లై' పేరిట సీఎన్‌ఎన్ ప్రచారం నిర్వహించిందని ట్రంప్ అన్నారు. దీని వల్ల తనకు ఆ ఎన్నికల్లో నష్టం కలిగిందని ట్రంప్ అన్నారు.