Delhi Air Crisis: పూర్తి బాధ్యత వహిస్తాం, కేవలం మా వైపే వేలెత్తి చూపడం సరికాదు - కాలుష్యంపై కేజ్రీవాల్
Delhi Air Crisis: ఢిల్లీలో కాలుష్యానికి పూర్తి బాధ్యత వహిస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.
Delhi Air Crisis:
ఇంకొంత సమయం ఇవ్వండి: కేజ్రీవాల్
పంజాబ్‌లో రైతులు పెద్ద ఎత్తున గడ్డిని కాల్చుతుండటం వల్ల ఢిల్లీలో కాలుష్య స్థాయికి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అటు హరియాణాలోనూ ఇదే దుస్థితి. అయితే...పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించలేకపోతోందని భాజపా ఫైర్ అవుతోంది. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయిందని వెల్లడించారు. పంజాబ్‌లో గడ్డి కాల్చుతుండటాన్ని ప్రస్తావించారు. "పంజాబ్‌లో జరుగుతున్న దానికి పూర్తి స్థాయి బాధ్యత వహిస్తాం. మేము అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలు అవుతోంది.
ఇప్పటి వరకూ ఎన్నో కట్టడి చర్యలు తీసుకున్నాం. వచ్చే ఏడాది నాటికి రైతులు అలా గడ్డికాల్చకుండా జాగ్రత్తపడతాం" అని హామీ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే పంజాబ్‌లో శాంతి భద్రతలు అదుపులోకి వస్తున్నాయని, మిగతా సమస్యలు పరిష్కరించడానికి ఇంకాస్త సమయం ఇవ్వాలని చెప్పారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. "కేంద్ర ప్రభుత్వం మాకు సహకరిస్తే కలిసి కట్టుగా ఈ కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు వీలవుతుంది" అని స్పష్టం చేశారు. కేవలం తమ వైపే వేలెత్తి చూపించటం సరికాదని వెల్లడించారు. "ఢిల్లీలో కాలుష్య స్థాయి ప్రమాదకరంగా మారటానికి మా ప్రభుత్వం మాత్రమే కారణం కాదు" అని వెల్లడించారు.
కేంద్రం బాధ్యత కూడా ఉంది: పంజాబ్
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా దీనిపై స్పందించారు. రైతులు పూర్తి స్థాయిలో వరిపైనే ఆధారపడకుండా విభిన్న పంటలు సాగు చేసేలా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. కనీస మద్దతు ధర లభించేలా చొరవ చూపుతామని, కూరగాయలు పండించేలా వారికి అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. ఢిల్లీ వ్యాప్తంగా రేపట్నుంచి ప్రైమరీ స్కూల్స్ అన్నింటినీ మూసి వేస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక వాహనాల విషయంలో సరిబేసి విధానం అమలు చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు. అవసరమైతే కచ్చితంగా ఇది అమలు చేస్తామని చెప్పారు. Indian Agricultural Research Institute లెక్కల ప్రకారం...పంజాబ్‌లో ఈ ఏడాది గడ్డి కాల్చుతున్న ఘటనలు 20% మేర పెరగ్గా...యూపీ, హరియాణాల్లో 30% వరకూ తగ్గాయి. అయితే..ఈ విషయంలో కేంద్రం బాధ్యత కూడా ఉందని పంజాబ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
కేంద్రంపై ఫైర్..
అంతకు ముందు కూడా కేజ్రీవావ్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఉత్తర భారత్ అంతా ఈ సమస్య ఉందని వివరించారు. యూపీ, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోనూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఒకే విధంగా ఉంటోందని వెల్లడించారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు దేశమంతా కాలుష్యాన్ని వ్యాప్తి చేస్తున్నాయా..అని ప్రశ్నించారు కేజ్రీవాల్. ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై తమతో మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయటం లేదని అడిగారు. పంజాబ్ రైతులకు సరైన విధంగా కేంద్రం సహకారం అందించటం లేదు కాబట్టే వాళ్లు ఉద్యమం చేశారని గుర్తు చేశారు. గడ్డి తగలబెట్టే విషయమై తాము ఓ ప్రపోజల్ పంపించినా...కేంద్రం దాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్య స్థాయి అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలుగా ఢిల్లీ, ఎన్‌సీఆర్ ఉన్నాయి. AQI 300కి పైగానే నమోదవుతోంది.
Also Read: Imran Khan Attack: పాకిస్థాన్‌లో సివిల్ వార్ తప్పదా? ఇమ్రాన్‌పై దాడి అందుకు సంకేతమా?