All Party Meeting: సోమవారం అఖిలపక్ష భేటీ- 40 పార్టీలకు కేంద్రం ఆహ్వానం
All Party Meeting: సోమవారం అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపునిచ్చింది.
All Party Meeting: కేంద్రం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది భారత్‌లో జీ20 సదస్సు జరగనుంది. కనుక సమ్మిట్‌కు సంబంధించిన సలహాలు, చర్చలు, వ్యూహాలను ఖరారు చేసేందుకు కేంద్రం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ డిసెంబర్ 1న జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది.
Centre to convene all-party meeting Monday to solicit suggestions, discuss and finalise strategies for G-20 summit which India will host in September next year
— Press Trust of India (@PTI_News) December 4, 2022
జీ20 ప్రెసిడెన్సీ సమయంలో భారత్.. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో 32 వేర్వేరు రంగాలలో 300 సమావేశాలను నిర్వహిస్తుంది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ప్రకారం, వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో దిల్లీలో జరగనున్న G-20 సమ్మిట్ భారతదేశం నిర్వహించే అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సమావేశాలలో ఒకటి.
40 పార్టీలకు
ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే ఈ సమావేశానికి దాదాపు 40 పార్టీల అధ్యక్షులను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దిల్లీలో జి-20 సదస్సు జరగనుంది. దీనికి సభ్యదేశాల దేశాధినేతలు లేదా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సదస్సు నిర్వహణపై దేశంలోని పలు ప్రాంతాల్లో కేంద్రం సమావేశాలు ఏర్పాటు చేయనుంది.
దీదీ హాజరు
బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం ఆమె దిల్లీ చేరుకోనున్నారు. అయితే తాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కాకుండా తృణమూల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ హోదాలో ఈ సమావేశంలో పాల్గొంటానని మమత చెప్పారు.
అధ్యక్ష పగ్గాలు
ఇండోనేసియా బాలీలో ఇటీవల జీ20 సదస్సు ముగిసింది. దీంతో 2023లో నిర్వహించనున్న జీ20 శిఖరాగ్ర సదస్సు అధ్యక్ష బాధ్యతలను భారత్‌కు ఇండోనేసియా అప్పగించింది. ఈ మేరకు ప్రస్తుత జీ20 సమావేశాల ముగింపు కార్యక్రమంలో ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో సదస్సు బాధ్యతలను భారత ప్రధాని నరేంద్ర మోదీకి అప్పగించారు.
" భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలు, మహమ్మారి దీర్ఘకాలిక దుష్ప్రభావాలతో ప్రపంచం పట్టుకోల్పోతున్న సమయంలో భారత్ జీ-20 బాధ్యతలు తీసుకుంటోంది. ఇటువంటి సమయంలో ప్రపంచం జీ-20 వైపు ఆశతో చూస్తోంది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదంతో వసుధైక కుటుంబం అనే భావనతో 2023లో జీ20 సదస్సును నిర్వహిస్తాం. జీ20 అధ్యక్ష పదవిని చేపట్టడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. "