Buddhadeb Bhattacharjee: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేబ్ భట్టాచార్య కన్నుమూత
Buddhadeb Bhattacharjee Dies: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేబ్ భట్టాచార్య కన్నుమూశారు. కలకత్తాలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు.
Buddhadeb Bhattacharjee Passes Away: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎమ్ నేత బుద్ధదేబ్ భట్టాఛర్జీ (Buddhadeb Bhattacharjee) కలకత్తాలో కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏళ్లు. చాలా రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బెంగాల్‌ని దాదాపు 34 ఏళ్ల పాటు వామపక్ష పార్టీలు ఏలాయి. ఆ సమయంలో CPM పార్టీకి చెందిన రెండో ముఖ్యమంత్రిగా ఉన్నారు బుద్ధదేబ్ భట్టాఛర్జీ. 2000 సంవత్సరం నుంచి 2011 వరకూ ఈ పదవిలో కొనసాగారు. కలకత్తాలోని అలిపోర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయన కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. న్యుమోనియాతో ఇబ్బంది పడుతుండడం వల్ల వెంటిలేషన్‌పై ఉంచాల్సి వచ్చింది. ఆ తరవాత వైద్యానికీ స్పందించలేదని, ఉదయం 8.20 నిముషాలకు ఇంట్లోనే కన్నుమూశారని ఆయన కొడుకు సుచేతన్ భట్టాచార్య Anandabazar పత్రికకు సమాచారం అందించారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాత్రి ఆయన శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డారు. అత్యవసర వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. హాస్పిటల్‌కి తీసుకెళ్లి చికిత్స అందించాలని అనుకున్నా అందుకు ఆయన ఒప్పుకోలేదు. ఆ రాత్రి ఎలాగోలా అంతా కుదుటపడింది. కానీ తెల్లవారుజాము నుంచి మళ్లీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసి టీ కూడా తాగారని, ఆ తరవాతే ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వైద్యులు పరిశీలించి చనిపోయినట్టు ధ్రువీకరించారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తోనూ ఆయన కొంతకాలంగా బాధ పడుతున్నారు.
#WATCH | Former West Bengal CM Buddhadeb Bhattacharjee passed away at the age of 80.
— ANI (@ANI) August 8, 2024
CPI(M) West Bengal State Secretary, Md Salim says, "It's very sad news for us and the state and all those people of the country who think about the labourers and common people... As a good… pic.twitter.com/wPa6iJ2PTU
అనారోగ్యం వల్లే కొన్నేళ్లుగా ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. చాలా సార్లు హాస్పిటల్‌లో చేర్చాల్సి వచ్చింది. 2020 డిసెంబర్‌లోనూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. అప్పుడు కూడా సీరియస్ అయితే కొద్ది రోజుల పాటు వెంటిలేషన్‌పై ఉంచారు. 2021లో ఆయన కొవిడ్ బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆరోగ్యం మరింత క్షీణించింది. 2022 జనవరి 25న భారత ప్రభుత్వం బుద్ధదేబ్ భట్టాచార్యకి పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. కానీ...ఈ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించారు. బుద్ధదేబ్ మృతి పట్ల బెంగాల్ బీజేపీ నేత సువేందు అదికారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వెస్ట్ బెంగాల్ CPM సెక్రటరీ మహమ్మ సలీమ్ కూడా స్పందించారు. ఎంతో గొప్ప నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో నిజాయతీ ఉన్న మనిషని కొనియాడారు.
Also Read: Repo Rate: రెపోరేటు యథాతథం, 6.5%గానే కొనసాగిస్తూ RBI కీలక నిర్ణయం - వరుసగా 9వ సారి