Bihar IPS Sunil Naik: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. విచారణకు హాజరైన బిహార్ ఐపీఎస్ సునీల్ నాయక్
RaghuRama Krishna Raju | ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో బిహార్ ఐపీఎస్ సునీల్ నాయక్ గుంటూరు సీసీఎస్ పీఎస్‌లో మార్చి 5న విచారణకు హాజరయ్యారు.

Raghurama Custodial Torture Case | గుంటూరు: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్న సమయంలో కస్టోడియల్ టార్చర్ కేసులో బిహార్ క్యాడర్ ఐపీఎస్ సునీల్ నాయక్ ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో ఉన్నప్పుడు హత్యాయత్నానికి పాల్పడ్డారనే ఆరోపణలపై నమోదైన కేసులో సునీల్ నాయక్ గురువారం గుంటూరులోని సీసీఎస్ పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుందని తెలుస్తోంది.
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న విజయనగరం ఎస్పీ దామోదర్ బిహార్ ఐపీఎస్ సునీల్ నాయక్‌ను విచారించనున్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు మార్చి 5వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ వరకు సునీల్ నాయక్ గుంటూరు సీసీఎస్ పీఎస్‌లో పోలీసుల విచారణకు హాజరుకావాల్సి ఉంది.
కేసు బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ..
2021 మే నెలలో నరసాపురం ఎంపీగా ఉన్న వైసీపీ తిరుగుబాటు నేత రఘురామకృష్ణరాజును రాజద్రోహం కేసులో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సీఐడీ పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. అదేరోజు రాత్రి ఆయనను సీఐడీ ఆఫీసులో ఉంచారు. అప్పట్లో సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ పలుమార్లు అక్కడికి వెళ్లినట్లు దర్యాప్తులో గుర్తించారు.
కుల వివక్షతోనే నన్ను టార్గెట్ చేశారు
రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ తనపై జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా ఇటీవల స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ, పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తాను ఎస్టీ (లంబాడి) సామాజిక వర్గంలో జన్మించడమే నేరమా అని సునీల్ నాయక్ ప్రశ్నించారు. ఉన్నత పదవుల్లో అణగారిన వర్గాల వారు ఉండటం ఇష్టం లేని కొందరు వ్యక్తులు తనపై కుట్రలు పన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో జరిగిన ఘటనపై 2024లో నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)లో మొదట తన పేరే లేదని, కానీ కావాలనే తనను ఈ కేసులోకి లాగారని ఆరోపించారు. ఐఐటీ చెన్నైలో చదువుకుని, కష్టపడి ఐపీఎస్ సాధించిన తనను కేవలం కుల వివక్షతోనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఫిర్యాదుదారుడి బెదిరింపులు - కాల్ డేటా బయటపెట్టాలి
ఈ కేసులో ఫిర్యాదుదారుడైన రఘురామ కృష్ణరాజు తనను నేరుగా బెదిరించారని సునీల్ నాయక్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌లకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని, లేదంటే తనను ఈ కేసులో నేరస్తుడిగా మారుస్తానని హెచ్చరించినట్లు సునీల్ నాయక్ ఆరోపించారు. ఈ కుట్రలో ఎంతమంది హస్తం ఉందో తెలియాలంటే సంబంధిత వ్యక్తుల కాల్ డేటాను బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కేసులో ఇతర నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్న అధికారులు ఏ7గా ఉన్న బిహార్ ఐపీఎస్ సునీల్ నాయక్‌కు సైతం పలుమార్లు నోటీసులు జారీ చేయగా ఆయన విచారణకు హాజరుకావడం లేదు. ఇటీవల పాట్నాకు వెళ్లిన ఏపీ పోలీసులు సునీల్ నాయక్‌ను అరెస్టు చేసినప్పటికీ, కోర్టు నుంచి ట్రాన్సిట్ వారెంట్ లభించకపోవడంతో పోలీసులు తిరిగివచ్చారు. సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ఆయనను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దాంతో చేసేదేమీ లేక ఐపీఎస్ సునీల్ నాయక్ ఈ కేసులో విచారణకు హాజరయ్యారు.
ట్రెండింగ్ వార్తలు





















