Venkaiah Naidu: విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలు ఇవే - కీలక విషయాలు వెల్లడించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
విద్యార్థులు సమాజంతో సంబంధం లేకుండా నాలుగు గోడల మధ్య చదువు నేర్చుకోవడంతో పాటు సెల్ ఫోన్ కు బానిసలు కావడం, సమాజంతో కలవకపోవడమే వారి ఆత్మహత్యలకు కారణమని వెంకయ్య నాయుడు అన్నారు.
బుల్లెట్ కంటే బ్యాలెట్ పవర్ ఫుల్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయ నాయకుల పట్ల ప్రజలలో గౌరవం, విశ్వాసం తగ్గుతోందన్న ఆయన.. ప్రజా సమస్యల పట్ల చర్చ జరగాల్సిన చట్టసభలు యుద్ధ భూములుగా మారుతున్నాయని ఆరోపించారు. విద్యార్థులు సమాజంతో సంబంధం లేకుండా నాలుగు గోడల మధ్య చదువు నేర్చుకోవడంతో పాటు సెల్ ఫోన్ కు బానిసలు కావడం, సమాజంతో కలవకపోవడమే వారి ఆత్మహత్యలకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంగ్లీషు బాష నేర్చుకోవడం తప్పు కాదన్నారు. కానీ ఆంగ్ల సాంస్కృతులు మాత్రం నేర్చుకోవద్దని హితవు పలికారు. పర భాష వ్యామోహంలో మాతృ భాష, సాంస్కృతిని మర్చిపోవద్దని వెంకయ్య నాయుడు సూచించారు. మాతృభాషలో ప్రాథమిక విద్య, పరిపాలన ఉండాలని ఆకాంక్షించారు.
కలెక్టర్లు తెలుగులోనే మాట్లాడండి.. మాజీ ఉపరాష్ట్రపతి సూచన
జిల్లా కలెక్టర్లు ఎవరైనా సరే తెలుగులోనే మాట్లాడాలని వెంకయ్య కోరారు. కులమతాల పేరుతో కొన్ని రాజకీయ శక్తులు మనుషుల మధ్య ద్వేషాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయన్న వెంకయ్య.. విద్య వ్యాపారం కాకూడదని సూచించారు. పేదలకు కూడా అందుబాటులో ఉండే విధంగా విద్యాసంస్థలు సహకరించాలన్నారు. సమాజంతో సంబంధం లేకుండా కేవలం నాలుగు గోడల మధ్యే విద్యను నేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన చెప్పారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం.. సమాజంతో జర్నీ చేయక పోవడమేనని, సెల్ ఫోన్ కు బానిసలై సమయాన్ని వృథా చేస్తున్నారని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
విద్య వ్యాపారం కాకూడదు. విద్య ఉచితంగా ఇవ్వడం సాధ్యం కాదు, కానీ శాస్త్రీయంగా, న్యాయ బద్ధంగా ఉండాలి. పేదలు అందరికీ విద్య అందేలా చేయాలని విద్యా వేత్తలు, విద్యా సంస్థలను కోరారు. డిగ్రీ తీసుకుని వెళుతున్నారు. మీ తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. కనుక సమయాన్ని వేస్ట్ చేయకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ కాళ్లపై మీరు నిలబడాలి. మీ కుటుంబానికి ఆర్థికంగా చేయూతగా ఉండాలని సూచించారు. కొందరు విదేశాలకు వెళ్తున్నారు. అయితే వెళ్లండి నేర్చుకోండి, తిరిగిరండి అని యువతకు సూచించారు. కొందరు అమెరికాలో ఉంటున్నారు. కొత్త కారు కొన్నాను, ఇల్లు కొన్నాను అని అమ్మమ్మ, నానమ్మలకు, తల్లిదండ్రులకు ఫొటోలు పంపిస్తుంటారు. కానీ అదే విషయాన్ని మనం ఇక్కడికి వచ్చి మనవాళ్లతో పంచుకుంటే బాగుంటుందన్నారు.
చదువు ఎన్నటికీ క్లాస్ రూముకు పరిమితం కాకూడదు. కొంత సమయం క్లాస్ రూములో, కొంత టైమ్ గ్రౌండ్ లో, కొంత సమయం సమాజంలో ప్రజల మధ్య గడపాలని యువతకు, విద్యార్థులకు వెంకయ్య సూచించారు. ప్రతి ఒక్కరూ బాడీ బిల్డర్స్ కాకపోవదచ్చు, దేశాన్ని మెరుగ్గా బిల్డ్ చేయడంలో మీ వంతు పాత్ర పోషించాలన్నారు. తనకు 73 ఏళ్లు పూర్తైనా ఢిల్లీలో ఉంటే గంటసేపు ఈ వయసులో కూడా బ్యాడ్మింటన్ ఆడతానని తెలిపారు. శరీరం అదుపులో ఉంటే, మనసు అదుపులో ఉంటుందన్నారు. అక్కడ అమ్మాయి ఆత్మహత్య, ఇక్కడ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నారే వార్తలు కనిపిస్తుంటే బాధ కలుగుతుందన్నారు.
గురుకులాల్లో ఉంటే విద్యార్థులను అధ్యాపకులు నిత్యం పరిశీలిస్తూ ఉండేవారు. యోగా చేస్తే ఏం లాభం అని ఒకరు అడిగితే యోగ్యుడు అవుతావని సమాధానం చెప్పినట్లు గుర్తుచేశారు. శారీరకంగా, మానసికంగా ఉండాలంటే యోగా చేయాలని, కుటుంబసభ్యులతో సమయం గడపాలని సూచించారు. సూర్యోదయంతో నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలని, వీలైనంత త్వరగా భోజనం చేసుకోవాలని, ఈ మధ్య స్మార్ట్ ఫోన్లకు బానిస అవుతున్నారని వెంకయ్య పేర్కొన్నారు. అవసరానికి మాత్రమే సెల్ ఫోన్ వాడాలని విద్యార్థులకు కీలక సూచనలు చేశారు.