Prajwal Revanna Case: ప్రజ్వల్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదు, దేవెగౌడ కీలక వ్యాఖ్యలు
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్న కేసుపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ తొలిసారి స్పందించారు.
Prajwal Revanna Case Updates: కర్ణాటక రాజకీయాల్ని కుదిపేస్తున్న ప్రజ్వల్ రేవణ్న కేసుపై తొలిసారి స్పందించారు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ. మనవడితో పాటు కొడుకు హెచ్‌డీ రేవణ్న కూడా నిందితులుగా ఉన్న ఈ కేసుపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయన నోరు విప్పారు. అందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. పేర్లు చెప్పేందుకు ఇష్టపడని దేవె గౌడ ఈ కేసులో ఎవరున్నా సరే విడిచిపెట్టొద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ప్రజ్వల్ రేవణ్న జర్మనీలో ఉన్నట్టు సమాచారం. ప్రజ్వల్ రేవణ్నపై తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించారు. తన మనవడు దోషిగా తేలితే ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు దేవెగౌడ. అయితే కొందరు కావాలనే తన కొడుకు, మనవడిపై ఇలాంటి తప్పుడు కేసు పెట్టించారని ఆరోపించారు. ప్రస్తుతానికి ఈ అంశంపై విచారణ జరుగుతున్నందున ఇంతకు మించి ఏమీ మాట్లాడలేనని వెల్లడించారు. 91వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మరికొంత మంది హస్తం కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
"కోర్టులో ప్రజ్వల్ రేవణ్నపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఈ విచారణపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. ప్రజ్వల్ విదేశాలకు వెళ్లిపోయాడు. దోషిగా తేలితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా నాకు ఏ అభ్యంతరమూ లేదు. ఇదే విషయాన్ని కుమారస్వామి కూడా చెప్పాడు. చట్ట ప్రకారం నడుచుకోవడం ప్రభుత్వం విధి. అందుకే ఎలాంటి చర్యలు తీసుకున్నా చేసేదేమీ లేదు"
- హెచ్‌డీ దేవెగౌడ, మాజీ ప్రధాని
ఈ కేసులో మరి కొంత మంది కూడా జోక్యం చేసుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన దేవెగౌడ వాళ్ల పేర్లు మాత్రం చెప్పనని స్పష్టం చేశారు. మహిళలకు కచ్చితంగా న్యాయం జరగాలని తేల్చి చెప్పారు. ప్రజ్వల్‌ని తాను సమర్థించడం లేదని కానీ కావాలనే ఇదంతా సృష్టించారన్న ఆరోపణలు వస్తున్న విషయాన్నీ గుర్తుంచుకోవాలని అన్నారు.
"ఈ కేసులో మరి కొంత మందికి హస్తం ఉందని తెలుస్తోంది. వాళ్ల పేర్లను ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. ఈ కేసులో నిందితులు ఎవరైనా సరే కచ్చితంగా శిక్ష పడాల్సిందే. కానీ కొంత మంది ప్రజ్వల్‌పై కక్షగట్టి ఈ కేసులో ఇరికించి ఉంటారని అనుకుంటున్నాను. ఓ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో మాత్రం విచారణ కొనసాగుతోంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి దీనిపై ఏమీ మాట్లాడలేను"
- హెచ్‌డీ దేవెగౌడ, మాజీ ప్రధాని
ప్రజ్వల్‌పై లైంగిక వేధింపులతో పాటు మరి కొన్ని కేసులూ నమోదయ్యాయి. ఇప్పటికే ఈ కేసు అక్కడి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రజ్వల్ రేవణ్న ఏప్రిల్ 27న జర్మనీకి పారిపోయాడని సమాచారం. ఆయనను వెనక్కి తీసుకొచ్చేందుకు ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. పనిమనిషిని కిడ్నాప్ చేసిన కేసులో హెచ్‌డీ రేవణ్న అరెస్ట్ అయ్యి ఆ తరవాత బెయిల్‌పై విడుదలయ్యారు.
Also Read: JP Nadda: అప్పుడంటే బలం లేక RSS పై ఆధారపడ్డాం, ఇప్పుడా అవసరమే లేదు - నడ్డా కీలక వ్యాఖ్యలు