JP Nadda: అప్పుడంటే బలం లేక RSS పై ఆధారపడ్డాం, ఇప్పుడా అవసరమే లేదు - నడ్డా కీలక వ్యాఖ్యలు
JP Nadda News: మొదట్లో పార్టీకి బలం లేక RSSపై ఆధారపడాల్సి వచ్చిందని, ప్రస్తుతానికి ఆ అవసరం లేకుండానే సొంతగా పార్టీని నడుపుకుంటున్నామని జేపీ నడ్డా వెల్లడించారు.
BJP RSS Ties: బీజేపీ ఇప్పటికీ RSS నీడలోనే ఉందని, ఆ సంస్థ ముందుండి బీజేపీని నడిపిస్తోందని చాలా మంది వాదిస్తుంటారు. పార్టీ సిద్ధాంతం అంతా RSS నుంచి పుట్టిందే అని చెబుతుంటారు. ఇదే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన రాగా ఆసక్తికర సమాధానమిచ్చారు. ఇప్పుడున్న బీజేపీకి అప్పటి పార్టీకి చాలా తేడా ఉందని స్పష్టం చేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంతో పోల్చుకుంటే ఇప్పుడు పార్టీ చాలా బలపడిందని, సొంతగా నడిపే సామర్థ్యాన్ని సంపాదించుకుందని వెల్లడించారు. వాజ్‌పేయీ హయాంలో పార్టీ RSSపై ఆధారపడాల్సి వచ్చిందని ఇప్పుడా పరిస్థితి మారిపోయిందని స్పష్టం చేశారు. మొదట్లో పార్టీకి పెద్దగా బలం లేదని, అందుకే RSS సాయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.
"మొదట్లో బీజేపీకి పెద్దగా బలం ఉండేది కాదు. అందుకే RSS సాయం తీసుకుంది. ఆ సంస్థే పార్టీని కొంత వరకూ ముందుకు నడిపించింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పార్టీ రూపు రేఖలు మారిపోయాయి. ఎవరూ ఊహించనంతగా ఎదిగింది. ఇప్పుడు మాకు మేముగా పార్టీని నడుపుకునే సామర్థ్యం వచ్చింది"
- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
ఇప్పటికీ బీజేపీకి RSS మద్దతు అవసరం అవుతుందని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకీ సమాధానమిచ్చారు జేపీ నడ్డా. ఆ అవసరం ఉండదని స్పష్టం చేశారు. పార్టీలోని నేతలకు తమకు తాముగా అన్ని విధులూ నిర్వర్తించగల సామర్థ్యం ఉందని వెల్లడించారు. RSS అనేది ఓ సంస్కృతి ఆధారంగా ఏర్పాటైన సంస్థ అని, బీజేపీ అనేది రాజకీయ పార్టీ అని వివరించారు. ఈ రెండింటికీ తేడాని గమనించాలని తెలిపారు. సొంతగా పనులు చేసుకోలేకపోతే పార్టీ మనుగడ సాధించలేదని అభిప్రాయపడ్డారు.