Elon Musk to Tesla Employees: ఆఫీస్‌కు రండి లేకపోతే ఉద్యోగం మానేయండి: మస్క్ వార్నింగ్
Elon Musk to Tesla Employees: ఆఫీస్‌కు రండి లేకపోతే ఉద్యోగం మానేయండి అంటూ టెస్లా ఉద్యోగులకు మస్క్ వార్నింగ్ ఇచ్చారు .వారానికి 40 గంటలు పని చేయాల్సిందేనని కండీషన్ పెట్టారు.
Elon Musk to Tesla Employees: కొవిడ్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ ఆప్షన్ ఇచ్చి పని చేయించాయి. దాదాపు రెండేళ్లుగా ఇదే విధానం అనుసరిస్తున్నాయి పలు సంస్థలు. ఇందులో టెస్లా కూడా ఉంది. అయితే టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆఫీస్‌కి వస్తే రండి, లేకపోతే కంపెనీ వదిలేయండి అంటూ ఉద్యోగులకు చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై మొదటి నుంచి విముఖంగానే ఉన్నారు ఎలన్ మస్క్. గతంలో ట్విటర్‌లో నెటిజన్ ఈ విషయమై మస్క్‌ని ప్రశ్నించగా, ఆఫీస్‌కి వచ్చి పని చేస్తేని మంచిదన్న ఉద్దేశం వచ్చేలా రిప్లై ఇచ్చారాయన. అప్పటి నుంచి టెస్లా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలకాల్సి వస్తుందేమోనని కలవర పడుతూ వచ్చారు. ఇప్పుడు స్వయంగా బాస్ నుంచి ఈ-మెయిల్ వచ్చే సరికి అంతా ఉలిక్కిపడినట్టు తెలుస్తోంది.
40గంటలు పని చేయాల్సిందే
వారంలో కచ్చితంగా 40గంటల పాటు ఆఫీస్‌లో పని చేయాల్సిందేనని లేకపోతే రిజైన్ చేసి వెళ్లాలని ఈ-మెయిల్‌లో ప్రస్తావించినట్టు సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో ఎరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటే వాళ్ల పరిస్థితులు గమనించి అవసరం అనుకుంటేనే అనుమతి ఇస్తానని చెప్పినట్టూ తెలుస్తోంది. నిజానికి టెస్లా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు క్రమంగా అలవాటు పడాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు మస్క్. కానీ ఉద్యోగులెవరూ ఆఫీస్‌కు వచ్చి పని చేసేందుకు ఆసక్తి చూపలేదు. అందుకే ఈ సారి కాస్త ఘాటుగా మెయిల్ చేశారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరో విషయంతో ఏంటంటే ఎగ్జిక్యూటివ్స్ ఎవరైనా సరే బ్రాంచ్ ఆఫీస్‌లలో కాకుండా హెడ్ ఆఫీస్‌లోనే పని చేయాలని నిబంధన విధించినట్టూ చెబుతున్నారు. రిమోట్ వర్క్‌ని ఇకపై సహించేది లేదని కచ్చితంగా చెప్పినట్టు ఓ ఈ-మెయిల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
అందుకే ఈ నిర్ణయం..!
ప్రొడక్టివిటీ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు ఎలన్ మస్క్. ఇదే విషయాన్ని ఆయన సన్నిహితులు చాలా సందర్భాల్లో చెప్పారు. ఒకప్పుడు చాలా బిజీగా ఉండే టెస్లా ఫ్యాక్టరీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వల్ల ఖాళీగా ఉన్నాయి. కొందరు ఆఫీస్‌కి వచ్చినప్పటికీ సరిగా పని చేయకుండా నిద్రపోతున్నట్టు మస్క్ దృష్టికి వెళ్లిందట. అందుకే ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీస్‌కి రావాలని మస్క్ మెయిల్ చేసినట్టు సమాచారం. అయితే ఈ ఈ-మెయిల్ కచ్చితంగా ఎలన్ మస్కే పంపారా, లేదా ఎవరైనా క్రియేట్ చేశారా అన్నది స్పష్టత లేదు.