AAP MLA Amanatullah Khan: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ రైడ్స్-వక్ఫ్ బోర్డులో అవినీతిపై ఆరా
వక్ఫ్ బోర్డులో అవినీతి, మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఢిల్లీలోని ఆయన ఇంట్లో తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అక్రమ నియామకాల కేసులో ఆప్ నేత అమానతుల్లా ఖాన్‌పైనా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఢిల్లీలోని ఆయన ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడి చర్యలు ప్రారంభించింది. అమానతుల్లా ఖాన్ ఛైర్మన్‌గా ఉన్న ఢిల్లీ వక్ఫ్ బోర్డ్‌లో రిక్రూట్‌మెంట్లలో అక్రమాలు జరిగాయంటూ కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం ఈడీ ఈ సోదాలు జరుపుతోంది.
అమానతుల్లా ఖాన్... ఢిల్లీలోని ఓఖ్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వయస్సు 49ఏళ్లు. ఇదే కేసులో అమానతుల్లా ఖాన్ గతేడాది ఢిల్లీ ఏసీబీ అరెస్టు చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2022లో ఆయనకు బెయిల్ మంజూరయ్యింది. అమానతుల్లా ఖాన్ ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తూ 32 మందిని అక్రమంగా రిక్రూట్ చేసుకున్నారన్నది ఆరోపణ. దీని ప్రకారం కేసు నమోదైంది. అమానతుల్లా ఖాన్‌పై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఢిల్లీ జామియా నగర్‌లోని అమానతుల్లా ఖాన్ ఇంటితోపాటు పలు చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. గతేడాది కూడా అమానతుల్లాకు సంబంధించిన 5 చోట్ల అవినీతి నిరోధక శాఖ దాడులు చేసింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్ హోదాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అవినీతి చేశారని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది కాకుండా ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు చెందిన పలు ఆస్తులను అక్రమంగా అద్దెకు ఇచ్చారని కూడా సమాచారం. ఢిల్లీ ప్రభుత్వం నుంచి అందిన సహాయంతో సహా బోర్డు నిధులను దుర్వినియోగం చేసినట్టు కూడా ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌పై ఆరోపణలు ఉన్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అక్టోబర్ 4న అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే మరో ఆప్ నేత, ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ దాడులు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో సంజయ్ సింగ్ అరెస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ రెండో పెద్ద షాక్. ఆ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఢిల్లీ లిక్కర్ కేసులో ఇంకా జైల్‌లోనే ఉన్నారు. ఇప్పుడు... సంజయ్ సింగ్‌ను ఇదే కేసులో అరెస్ట్ చేశారు. అయితే సంజయ్ సింగ్ అరెస్ట్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ఇది మోడీ సర్కార్ నియంతృత్వ చర్యగా ఆమ్ ఆద్మీ పార్టీ అభివర్ణించింది.