Doctors Precautions: ఓ వైపు శీతాకాలం, మరోవైపు కరోనా భయం - అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్న నిపుణులు, ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Telangana News: అసలే చలి, ఆపై కరోనా కేసులు పెరుగుతుండడం తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే, జాగ్రత్తలు పాటిస్తే ఏ ప్రమాదం ఉండదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Doctors Alert to People on Corona New Variant: తెలంగాణ (Telangana) సహా ఇతర ప్రాంతాల్లోనూ చలి విజృంభిస్తోంది. తూర్పు తీరం నుంచి బలమైన గాలుల కారణంగా గత 3, 4 రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. అటు, ఏపీలోనూ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. వాతావరణ మార్పులతో ఇప్పటికే చాలా మంది జలుబు, దగ్గుతో సతమతమవుతుండగా కరోనా హెచ్చరికలు ఇప్పుడూ ప్రజలను మరింత కలవరపెడుతున్నాయి. ఒక్క హైదరాబాద్ (Hyderabad) లోనే 13 కేసులు (Corona Cases) నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ఆస్పత్రులు జ్వర పీడితులతో నిండిపోయాయి. చలి పంజా విసురుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు వీలైనంత మేర సాయంత్రం, ఉదయం ఆరుబయట తిరగకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, చాలా ప్రాంతాల్లో ప్రజలు గాలులతో కూడిన చలి కారణంగా బయటకు రావాలంటేనే జంకుతున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి జలుబు, దగ్గు, జ్వర పీడితులు ఎక్కువయ్యారు. జాగ్రత్తలు పాటిస్తే ఏం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
'వీరు అప్రమత్తంగా ఉండాలి'
జ్వరం, జలుబు, గొంతు సమస్యలు పెరుగుతున్న తరుణంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 కారణంగా కేసులు పెరుగుతున్నాయని, మాస్కులు ధరించి అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచించింది. చలి జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు, గర్భిణులు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని స్పష్టం చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు కడుక్కోవాలని, తప్పనిసరైతే ప్రయాణాలు చేయాలని పేర్కొంటున్నారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాసలో ఇబ్బందులు ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. పిల్లలు, వృద్ధులు ఉన్ని దుస్తులు ధరించాలని, ఇంటి లోపల వేడిగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు.
8 నెలల తర్వాత
తెలంగాణలో దాదాపు 8 నెలల తర్వాత గత మంగళవారం రాత్రి వైద్యారోగ్య శాఖ మరోసారి కొవిడ్ బులెటిన్ విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం 402 పరీక్షలు నిర్వహించగా, కొత్త కొవిడ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 14 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనే ఎక్కువగా కేసులు నమోదు కావడంతో పలు గేటెడ్ కమ్యూనిటీల్లో మాస్కులు, శానిటైజేషన్లు మళ్లీ ప్రారంభించారు. అలాగే, పలు కార్పొరేట్ సంస్థలు సైతం తమ ఉద్యోగులను కొవిడ్ ప్రోటోకాల్ పాటించేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా అలర్ట్ చేస్తున్నాయి. అటు, నగరంలోని గాంధీ, నల్లకుంట ఫీవర్, చెస్ట్ ఆస్పత్రులతో పాటు మరో 2 ఆస్పత్రుల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అవసరమైన పీపీఈ కిట్లు, డిస్పోజబుల్ బెడ్ షీట్లు, మాస్కులు, శానిటైజర్లు అన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
అయ్యప్ప భక్తులకు అలర్ట్
ప్రతిరోజూ భాగ్య నగరం నుంచి పలు రాష్ట్రాలకు రాకపోకలు సాగించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు రాకపోకలు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ప్రయాణించే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏమాత్రం అనారోగ్య సూచనలున్నా ప్రయాణాలు మానుకోవాలని, వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేస్తున్నారు.
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
మరోవైపు, రాష్ట్రంలో గత 3, 4 రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 13.90 డిగ్రీలు, ములుగు 14.40, వరంగల్ 13.50, హన్మకొండ 15, జనగామ 15.10, మహబూబాబాద్ జిల్లాలో 16.40 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాధారణం కంటే అన్ని జిల్లాల్లోనూ సగటున ఒకట్రెండు డిగ్రీలు తక్కువగా నమోదైనట్లు చెప్పారు. సాయంత్రం నుంచి ఉదయం వరకూ చలి గాలుల కారణంగా చాలామందిలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. తేమ కారణంగా వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోయి చాలామందిలో శ్వాస సంబంధిత సమస్యలు, గొంతు సంబంధిత సమస్యలు ఎక్కువయ్యాయి. అటు, పాడి పంటలకు సైతం చలి వాతావరణంతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. పాడి పశువుల్లోనూ పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని రైతులు వాపోతున్నారు.
Also Read: Auxilo Finserve: దేశవ్యాప్తంగా 10 వేల విద్యాసంస్థలకు రుణాల జారీ లక్ష్యం: ఆక్సిలో ఫిన్‌సర్వ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

