Congress Digvijay Singh: ఆరెస్సెస్‌ను పొగిడిన దిగ్విజయ్ సింగ్ - పరోక్షంగా కాంగ్రెస్‌కు చురకలు - రాహుల్‌కు మరో షాక్ తప్పదా?
Digvijaya Singh: కాంగ్రెస్‌తో పరోక్షంగా పోల్చుతూ ఆరెస్సెస్‌ను పొగిడారు దిగ్విజయ్ సింగ్. బీజేపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది.

Digvijaya Singh Praises Sangh With PM Modi Throwback Photo: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల సంస్థాగత శక్తిని ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) కీలక సమావేశం జరుగుతున్న తరుణంలోనే ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1990వ దశకానికి చెందిన ఒక ఫోటోను షేర్ చేస్తూ.. ఆర్‌ఎస్‌ఎస్ (RSS) మరియు బీజేపీల సంస్థాగత బలాన్ని ఆయన కొనియాడారు. అయితే, ఆయన ప్రశంసలను బీజేపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
దిగ్విజయ్ సింగ్ షేర్ చేసిన ఫోటో 1996లో శంకర్ సింగ్ వాఘేలా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించినది. అందులో బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ కుర్చీలో కూర్చుని ఉండగా, అప్పటికీ సాధారణ కార్యకర్తగా ఉన్న నరేంద్ర మోదీ ఆయన పాదాల వద్ద కింద నేలపై కూర్చుని ఉన్నారు. ఈ ఫోటోను ఉద్దేశించి ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్ గా, సామాన్య కార్యకర్తగా నాయకుల వద్ద నేలపై కూర్చున్న వ్యక్తులు నేడు ప్రధాని, ముఖ్యమంత్రులు అయ్యారంటే అది ఆ సంస్థకు ఉన్న పవర్ అని దిగ్విజయ్ పేర్కొన్నారు.
దిగ్విజయ్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందిచంింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని దిగ్విజయ్ సింగ్ మాటలే నిరూపిస్తున్నాయి అని బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్ కేవలం ఒక కుటుంబం చుట్టూ తిరుగుతుందని, అందుకే అక్కడ ఒక సాధారణ కార్యకర్త మోదీలాగా అత్యున్నత స్థాయికి ఎదగలేరని బీజేపీ ఎద్దేవా చేసింది. ఇది బయట పార్టీలతో పోరాటం కాదు, కాంగ్రెస్‌లో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలేనని బీజేపీ అభివర్ణించింది.
కేవలం ఈ ట్వీట్ మాత్రమే కాకుండా, గత వారం కూడా దిగ్విజయ్ సింగ్ సొంత పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో నిర్ణయాధికారం కేంద్రీకృతమై ఉందని, క్షేత్రస్థాయిలో అధికారాన్ని వికేంద్రీకరించాలని ఆయన సూచించారు. రాహుల్ గాంధీని ఒప్పించడం అంత సులభం కాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత అసమ్మతిని బయటపెట్టాయి. మున్సిపల్ , ఇతర ఎన్నికల ముందు పార్టీని చక్కదిద్దాలని ఆయన పరోక్షంగా హెచ్చరించినట్లు కనిపిస్తోంది.
వివాదం ముదరడంతో దిగ్విజయ్ సింగ్ వివరణ ఇచ్చుకున్నారు. తాను కేవలం సంస్థ నిర్మాణాన్ని మాత్రమే పొగిడాను. మోదీని, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలను నేను ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటాను. మీడియా నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంది అని స్పష్టం చేశారు. అయినప్పటికీ, కాంగ్రెస్ అధిష్టానాన్ని ట్యాగ్ చేస్తూ ఆయన ఈ ట్వీట్ చేయడం వెనుక పార్టీ నాయకత్వంపై ఆయనకు ఉన్న అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.





















