Richest Indian origin CEO Jayanshree Ullal: సంపదలో సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌లను వెనక్కి నెట్టిన జయశ్రీ ఉల్లాల్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటీ?
Arista Networks CEO Jayanshree Ullal | హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం జయశ్రీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన భారతీయ సంతతికి చెందిన సీఈవోగా నిలిచారు.

గ్లోబల్ టెక్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా భారతీయ మూలాలున్న అత్యంత ధనవంతులైన CEOల విషయానికి వస్తే.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్లు వినిపించేవి. ఇప్పుడు మరో వ్యక్తి అంతకుమించి అనేలా రాణిస్తున్నారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ఈ రేసులో ఒక కొత్త పేరును చేర్చింది. ఆమె మరెవరో కాదు అరిస్టా నెట్‌వర్క్స్ చైర్మన్, CEO జయశ్రీ ఉల్లాల్.
హురున్ తాజా నివేదిక ప్రకారం, జయశ్రీ ఉల్లాల్ మొత్తం ఆస్తి 50,170 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ మొత్తం ఆమెను సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌లను వెనక్కి నెట్టడంతో పాటు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన భారతీయ మూలాలున్న CEOగా నిలిపింది. సత్య నాదెళ్ల ఆస్తి సుమారు 9,770 కోట్లు కాగా, సుందర్ పిచాయ్ ఆస్తి సుమారు 5,810 కోట్ల రూపాయలుగా అంచనా వేసింది. మరోవైపు వీరిద్దరి ఆస్తి మొత్తం విలువ కలిపినా జయశ్రీ ఉల్లాల్ ఆస్తి విలువలో 30 శాతం కూడా లేకపోవడం సిలికాన్ వ్యాలీలో కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.
అరిస్టా నెట్‌వర్క్స్ అధినేత జయశ్రీ ఉల్లాల్..
జయశ్రీ ఉల్లాల్ 2008 నుండి అరిస్టా నెట్‌వర్క్స్‌ను లీడ్ చేస్తున్నారు. క్లౌడ్ నెట్‌వర్కింగ్, హై-పెర్ఫార్మెన్స్ డేటా సెంటర్ల రంగంలో ఈ కంపెనీ ఇప్పుడు గ్లోబల్ లీడర్‌గా మారింది. ఫోర్బ్స్ ప్రకారం 2024లో అరిస్టా నెట్‌వర్క్స్ వార్షిక ఆదాయం సుమారు 7 బిలియన్ డాలర్లు. గత సంవత్సరం కంటే దాదాపు 20 శాతం వృద్ధి. కంపెనీ ఈ విజయానికి ఉల్లాల్ వ్యూహాత్మక ఆలోచనలు, సాంకేతిక అవగాహన చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆమెకు అరిస్టా నెట్‌వర్క్స్‌లో సుమారు 3 శాతం షేర్లు ఉన్నాయి. వాటిలో కొంత భాగాన్ని ఆమె తన కుటుంబ భవిష్యత్తుకు కేటాయించారు. కంపెనీ షేర్లలో వచ్చిన అద్భుతమైన పెరుగుదల ఆమె నికర విలువను కొత్త శిఖరాలకు చేర్చింది.
లండన్ నుండి ఢిల్లీ.. ఆపై అమెరికా వరకు జర్నీ..
జయశ్రీ ఉల్లాల్ లండన్‌లో భారతీయ మూలాలున్న కుటుంబంలో మార్చి 27, 1961న జన్మించారు. చిన్న వయసులోనే ఆమె భారతదేశానికి వచ్చి న్యూఢిల్లీలో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆమె తండ్రి ఒక ప్రతిష్టాత్మక భౌతిక శాస్త్రవేత్త. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖతో అనుబంధం కలిగి ఉన్నారు. IITల స్థాపనకు సంబంధించిన విద్యాపరమైన నిర్మాణంలో తండ్రి సహకారం జయశ్రీ జీవితంపై ప్రభావం చూపింది. ఆమె ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీస్ కాన్వెంట్ స్కూల్ లో చదివారు. ఆ తర్వాత కుటుంబం అమెరికాకు వెళ్లింది. ఇక్కడి నుండే ఆమె కెరీర్ మలుపు తిరిగింది.
అమెరికాలో చదువు, టెక్ ఇండస్ట్రీలో ప్రవేశం
అమెరికాలో జయశ్రీ ఉల్లాల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని, తరువాత ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేశారు. తర్వాత ఆమె సెమీకండక్టర్, నెట్‌వర్కింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించారు. ఆమె వేగంగా నిర్ణయాలు తీసుకునే, దూరదృష్టి గల వ్యక్తిగా గుర్తింపు పొందారు.
సిస్కో నుండి అరిస్టా వరకు కెరీర్ టర్నింగ్ పాయింట్
తన కెరీర్ ప్రారంభ సంవత్సరాలలో జయశ్రీ ఉల్లాల్ AMD, ఫెయిర్‌చైల్డ్ సెమీకండక్టర్ వంటి దిగ్గజ కంపెనీలలో పనిచేశారు. తరువాత సిస్కోతో అనుబంధం ఆమె కెరీర్‌లో కీలక మలుపు. సిస్కోలో ఆమె స్విచింగ్ విభాగాన్ని కంపెనీ అత్యంత ముఖ్యమైన వ్యాపార విభాగాలలో ఒకటిగా మార్చారు. 2008లో ఆమె సిస్కోను వీడిన తరువాత అరిస్టా నెట్‌వర్క్స్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో కంపెనీ చాలా చిన్నదిగా, లిమిటెడ్ వనరులతో పనిచేస్తోంది. జయశ్రీ ఉల్లాల్ నాయకత్వంలో అరిస్టా గ్లోబల్ టెక్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసింది.






















