Paritala Sriram: ధర్మవరంలో ఏం చేసినా ప్రజామోదం ఉండాలి, కేతిరెడ్డికి ఇవి పట్టవా? పరిటాల శ్రీరామ్
Babu Surety Bhavishyathu Ki Guarantee: ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ బాబు ష్యూరిటీ - భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు.
Paritala Sriram babu surety bhavishyathu guarantee in telugu: ధర్మవరం: ధర్మవరంలో ఏ అభివృద్ధి జరిగినా ముందు స్వాగతించేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని.. అలా అని బాధితులకు న్యాయం చేయకుండా ముందుకెళ్తామంటే కచ్చితంగా ప్రశ్నిస్తామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం మండల పరిధిలోని గొల్లపల్లి, బడన్నపల్లి గ్రామాల్లో ఆయన ఆదివారం బాబు ష్యూరిటీ - భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాలకు వచ్చిన శ్రీరామ్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి టీడీపీ మ్యానిఫెస్టోకి సంబంధించిన కరపత్రాలను అందజేసి.. అందులోని పథకాల గురించి వివరించారు. ఏ ఇంట్లో ఎంత మంది ఉన్నారు, వారికి వచ్చే పథకాలు ఏంటి.. దాని ద్వారా కలిగే లబ్ధి గురించి తెలిపారు. గ్రామస్థులు మ్యానిఫెస్టోలోని పథకాలపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే గ్రామాల్లో నెలకొన్న సమస్యలను శ్రీరామ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ, కేతిరెడ్డికి ప్రజలన్నా.. ప్రజా సమస్యలన్నా లెక్క లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ ఏ పని చేసినా.. ముందుగా ప్రజామోదం ఉండాలన్నారు. ధర్మవరంలోని కదిరి గేట్ వద్ద రైల్వే ఉపరితల వంతెన నిర్మాణం చేపట్టారని.. ఇందులో ఎవరికీ రెండవ అభిప్రాయం లేదన్నారు. కానీ దశాబ్ధాలుగా నివాసం ఉంటున్న వారికి సరైన పరిహారం ఇవ్వకుండా ఇక్కడ కూల్చివేతలు చేపట్టడం మీద మాత్రమే తాను స్పందిస్తున్నానని.. రేపు కూడా ఇదే మాట మీద ఉంటానన్నారు. కొందరికి పరిహారం ఇచ్చి వారి ఆమోదంతో చేస్తున్నారని.. ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ కొందరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని.. కానీ స్టేను కూడా లెక్క చేయకుండా కూల్చివేతలు చేపడుతున్నారని ఫైర్ అయ్యారు.
తాము బాధితుల పక్షాన నిలబడితే అభివృద్ధికి అడ్డుపడుతున్నారని తమపై ఆరోపణలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎక్కడైనా పనులను అడ్డుకున్నామా అని ప్రశ్నించారు. బాధితులందరికీ న్యాయం చేసి బ్రిడ్జి నిర్మాణం చేపడితే.. తాము కూడా సహకరిస్తామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో చాలా చోట్ల బాధితులకు న్యాయం చేయకుండా కేతిరెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని.. అందుకే తాము బాధితుల పక్షాన ఉన్నామని స్పష్టం చేశారు.