లిక్కర్ స్కామ్‌లోని డబ్బంతా ఎక్కడుందో ఆయనే చెబుతారు - కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు
Delhi Liquor Policy Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోని డబ్బంతా ఎక్కడుందో అరవింద్ కేజ్రీవాల్ కోర్టులోనే చెబుతారని ఆయన భార్య వెల్లడించారు.
Delhi Liquor Scam: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మరోసారి అరెస్ట్‌పై స్పందించారు. ఈ లిక్కర్ స్కామ్ గురించి త్వరలోనే ఆయన కొన్ని సంచలన నిజాలు బయట పెడతారని వెల్లడించారు. కొన్ని కీలక ఆధారాలనూ వెల్లడిస్తారని స్పష్టం చేశారు. ఈ స్కామ్‌లోని డబ్బంతా ఎటు పోయిందో కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ వెల్లడిస్తారని తేల్చి చెప్పారు. ఏప్రిల్ 9వ తేదీన వరకూ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. అయితే...ఆయన ఈ లిక్కర్ స్కామ్‌లోని డబ్బంతా ఎక్కడ దాచిపెట్టారో కోర్టులోనే వెల్లడిస్తారంటూ సునీత కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. బీజేపీపైనా ఆమె తీవ్రంగా మండి పడ్డారు. జైల్లో నుంచి ఆదేశాలివ్వడాన్నీ బీజేపీ తప్పుపడుతోందని అసహనం వ్యక్తం చేశారు.
"గత రెండేళ్లుగా దర్యాప్తు సంస్థలు 250 సార్లు సోదాలు చేశారని అరవింద్ కేజ్రీవాల్ నాతో చెప్పారు. లిక్కర్ పాలసీ కేసుతో ఇలా సోదాలు చేశారని వెల్లడించారు. ఈ స్కామ్‌లోని డబ్బు ఎక్కడ దాచిపెట్టారో వెతుకుతున్నారు. కానీ ఇప్పటి వరకూ వాళ్లు ఒక్క రూపాయి కూడా కనిపెట్టలేకపోయారు. ముందు మనీశ్ సిసోడియా ఇంట్లో సోదాలు చేశారు. ఆ తరవాత రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ ఇంట్లోనూ సోదాలు చేపట్టారు. కానీ వాళ్లకు ఏ ఆధారాలూ దొరకలేదు"
- సునీత కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ భార్య
#WATCH | Delhi: Delhi CM Arvind Kejriwal's wife, Sunita Kejriwal says, "...Two days ago, Arvind Kejriwal sent a letter to Water Minister Atishi regarding the water and sewer problems in Delhi... The central government filed a case against him. Do they want to destroy Delhi? Do… pic.twitter.com/jTdOdHfGqX
— ANI (@ANI) March 27, 2024
తమ ఇంట్లోనూ సోదాలు చేసిన ఈడీ కేవలం రూ.73 వేలు మాత్రమే కనిపెట్టారని, మరి మిగతా డబ్బంతా ఎక్కడికి వెళ్లినట్టు అని ప్రశ్నించారు సునీత కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ ఈ వివరాల్ని కోర్టులో వెల్లడిస్తారని చెప్పారు. త్వరలోనే నిజానిజాలేంటో ప్రజలు తెలుసుకుంటారని స్పష్టం చేశారు. తన వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయని కేజ్రీవాల్ చెప్పినట్టు వివరించారు.
"నిజానిజాలేంటో త్వరలోనే ప్రజలు తెలుసుకుంటారు. తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని కేజ్రీవాల్ నాతో చెప్పారు. ఆయన నిజాయతీ ఉన్న దేశభక్తుడు. చాలా ధైర్యవంతుడు. ఆయన జైల్‌లో ఉన్నా ప్రజల గురించే ఆలోచిస్తున్నారు"
- సునీత కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ భార్య
ఇప్పటికే తన అరెస్ట్‌ని సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది ధర్మాసనం. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ని ఈడీ వ్యతిరేకించింది. పూర్తి స్థాయిలో దీనిపై వివరణ ఇచ్చేందుకు మూడు వారాల సమయం కావాలని కోర్టుని కోరింది. అటు కేజ్రీవాల్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాత్రం కావాలనే ఈడీ విచారణ జాప్యం చేస్తోందని, ఎలాంటి విచారణ లేకుండా అరెస్ట్ చేసిందని ఆరోపిస్తున్నారు.