Fuel Price Hike: ఏకంగా 500% పెరిగిన చమురు ధరలు, సగం జీతం పెట్రోల్‌కే సరిపోతోందిగా!
Fuel Price Hike: క్యూబాలో చమురు ధరలు ఏకంగా 500% మేర పెరిగాయి.
Fuel Price Hike in Cuba:
క్యూబాలో పరిస్థితి ఇదీ..
ఇప్పటికే పెట్రోల్ ధరలు (Cuba Fuel Price) మండిపోతుంటే ఇది చాలదన్నట్టు మళ్లీ అమాంతం ధరలు పెంచేసింది ప్రభుత్వం. ఎంతో తెలుసా..? ఏకంగా 500%. క్యూబా ప్రభుత్వం ఇలా అందరికీ షాక్ ఇచ్చింది. అక్కడ చమురు దొరకడమే కష్టంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇప్పటికే ధరలు ఆకాశాన్నంటుతుంటే ఇప్పుడు మరింత పెంచింది ప్రభుత్వం. డబ్బు చెలామణీ విపరీతంగా పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ అస్యవ్యస్తమైంది. నష్టాల్ని పూడ్చుకునేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే చమురు ధరల్ని అనూహ్యంగా పెంచేశారు. లీటర్ గ్యాసోలిన్ ధర ఇప్పటి వరకూ 25 Pesosగా (Fuel Prices Hike) ఉండేది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి లీటర్ ధర 132 పెసోస్ వరకూ పెరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ప్రీమియం గ్యాసోలిన్ ధర అయితే ఏకంగా 156 పెసోస్‌కి పెంచేసింది. ఓ బైక్‌లో పెట్రోల్ కొట్టించాలంటే ఓ వ్యక్తి తన జీతంలో సగం వరకూ ఖర్చు చేయాల్సిందే. కోటి 10 లక్షల మంది జనాభా ఉన్న క్యూబాలో ఆర్థిక సంక్షోభం ముదిరింది. కరోనా వైరస్ కొట్టిన దెబ్బ నుంచి ఇంకా ఆ దేశం కోలుకోలేదు. దీనికి తోడు అమెరికా వాణిజ్య ఆంక్షలు పెరిగిపోయాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది.
పెరిగిన ద్రవ్యోల్బణం..
కొన్ని అధికారిక రిపోర్ట్‌ల ప్రకారం...గతేడాది క్యూబా ఆర్థిక వ్యవస్థ 2% మేర పడిపోయింది. అటు ద్రవ్యోల్బణం 30% మేర పెరిగింది. ఇవి కేవలం అంచనాలే అని...ఇది ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు కొందరు ఎక్స్‌పర్ట్‌లు. చమురు మాత్రమే కాదు. నిత్యావసర ధరలూ చుక్కలనంటాయి. కొద్ది రోజుల పాటు సబ్సిడీతో ప్రభుత్వం కొన్ని సరుకుల్ని విక్రయించింది. కానీ...ఇకపై ధరలు పెంచక తప్పదని తేల్చి చెప్పింది. విద్యుత్ ధరలూ పెరిగిపోయాయి. నేచురల్ గ్యాస్ ధరలూ పెరగడం వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పోనుపోను ఈ ద్రవ్యోల్బణం ఇంకా ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. విదేశీయులు ఎవరు వచ్చినా ఫారెన్ కరెన్సీతోనే చమురు కొనుగోలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. దాదాపు రెండేళ్లుగా క్యూబా కరెన్సీ విలువ పడిపోతూ వస్తోంది.