COVID-19 in Japan: జపాన్‌లోనూ కరోనా ఉగ్రరూపం, మృతుల్లో చిన్నారులే ఎక్కువ
COVID-19 in Japan: జపాన్‌లోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.
COVID-19 in Japan:
8 నెలల్లో పెరిగిన కేసులు
చైనాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. చైనాతో పాటు మరి కొన్ని దేశాల్లోనూ కొవిడ్ ఉగ్రరూపం చూపిస్తోంది. జపాన్, అమెరికాలనూ పరిస్థితులు రోజురోజుకీ ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రస్తుతం జపాన్‌లో 8వ వేవ్ కొనసాగుతోంది. ఆందోళనకర విషయం ఏంటంటే...ఈ వేవ్ కారణంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. జపాన్ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం...గత 8 నెలల్లో కరోనా కారణంగా 41 మంది చిన్నారులు మృతి చెందారు. వీరిలో 15 మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఉన్నట్టుండి
ప్రాణాలు తోడేసింది వైరస్. ఈ మృతుల్లో నలుగురు చిన్నారులు ఏడాది లోపు వయసు వాళ్లే. ఒమిక్రాన్ వేరియంట్ చిన్నారుల్లోనే ఎక్కువగా సోకుతున్నట్టు జపాన్ వెల్లడించింది. ఆరోగ్యంగా ఉన్న చిన్నారులూ ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా కారణంగా చనిపోయిన పిల్లల్లో వేరే ఏ ఆరోగ్య సమస్యా లేదని వైద్యులు గుర్తించారు. గతేడాది జపాన్‌లో ఒమిక్రాన్ వ్యాప్తితో కేవలం ముగ్గురే మృతి చెందారు. ప్రభావం తక్కువగానే ఉందని సంతోషపడేలోగా...ఈ ఏడాది మొదటి నుంచే విరుచుకుపడింది కరోనా. 8 నెలల్లోనే మృతుల సంఖ్య 41 కి పెరిగింది. వీరిలో 14 మంది చిన్నారుల్లో మాత్రమే శ్వాసకోశ సంబంధిత వ్యాధులున్నాయని తేలింది. తీవ్ర జ్వరం కారణంగా చాలా మంది చిన్నారులు మూర్ఛపోతున్నారని వైద్యులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రికి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోతోంది. వారంరోజుల్లోనే దాదాపు 60% మంది బాధితులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
చైనాలోనూ దారుణ పరిస్థితులు..
20 ఏళ్లలోపు వారిలోనే కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని జపాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. డిసెంబర్ 20వ తేదీ నాటికి అక్కడ 2 లక్షల 57 వేల కేసులు నమోదయ్యాయి. వీరిలో 30% మంది చిన్నారులే. గత 7 నెలలతో పోల్చుకుంటే ఈ డిసెంబర్‌లోనే కరోనా బాధితుల సంఖ్య 35 రెట్లు పెరిగింది. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి కరోనా చాపకింద నీరులా ప్రవహిస్తోంది. రోజూ లక్షలాది మంది కొత్త రోగులు
వస్తుండటంతో ఆసుపత్రుల్లో మంచాలు కూడా దొరకడం లేదు. మందుల కొరత కూడా తీవ్రంగా ఉంది. వేసుకునేందుకు మందులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన భారత్.. చైనాకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. చైనాకు ఔషధాలను పంపాలని భారత్ నిర్ణయించింది. భారతదేశం ఔషధాల ఎగుమతి సంస్థ ఛైర్మన్ గురువారం (డిసెంబర్ 22) మాట్లాడుతూ.. ప్రపంచంలోని అతి పెద్ద ఔషధ తయారీదారుల్లో ఒకటైన భారత్.. చైనాకు సహాయం చేయాలని నిర్ణయించుకుందని తెలిపారు. చైనాకు జ్వరాల మందులను ఇచ్చేందుకు ఇండియా సిద్ధమైందని వివరించారు. చైనాలో విజృంభిస్తున్న కరోనా కారణంగా అక్కడ మందుల కొరత తీవ్రంగా ఉంది. డిమాండ్ కు తగ్గట్టుగా మందుల కంపెనీల్లో ఓవర్ టైం చేస్తున్నారు. జ్వరం, శరీర నొప్పులు, తలనొప్పికి ఉచితంగామందులు ఇస్తామని చైనా ప్రభుత్వం ప్రకటించింది. జ్వరానికి సంబంధించిన మందులను చైనాకు పంపేందుకు భారత్ కూడా అనుమతి ఇచ్చింది.