వైట్ పేపర్ వర్సెస్ బ్లాక్ పేపర్, పార్లమెంట్‌లో బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ
Congress Black Paper: మోదీ సర్కార్ వైట్ పేపర్‌కి కౌంటర్‌గా కాంగ్రెస్ బ్లాక్ పేపర్‌ని ప్రవేశపెట్టనుంది.
White Paper Vs Black Paper: రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం ఒక్కసారిగా రాజకీయాల్ని వేడెక్కించాయి. పూర్తిగా కాంగ్రెస్‌నే టార్గెట్ చేసుకుని సుదీర్ఘంగా మాట్లాడారు మోదీ. నెహ్రూ హయాం నుంచి యూపీఏ హయాం వరకూ కాంగ్రెస్ వైఫల్యాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీపైనా విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో తమ పదేళ్ల పాలనకు సంబంధించిన అభివృద్ధిని అందరి ముందుంచారు. ఆర్థిక వ్యవస్థను ఐదో స్థానానికి తీసుకొచ్చామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే మోదీ సర్కార్ పార్లమెంట్‌లో ఈ పదేళ్ల తమ రిపోర్ట్ కార్డ్‌ని White Paper రూపంలో ప్రవేశపెట్టనుంది. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ తమ ప్రభుత్వం ఏమేం చేసిందో అందులో ప్రస్తావించనుంది. మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం వెల్లడించారు. రెండు సభల్లోనూ ఈ వైట్‌పేపర్‌ని ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. గతంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే దీన్ని తీసుకొస్తున్నట్టు తెలిపారు. అయితే...ఈ వైట్‌పేపర్‌కి కౌంటర్‌గా కాంగ్రెస్ Black Paper తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సభలో ఈ బ్లాక్ పేపర్‌ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు ఖర్గే. యూపీఏ ప్రభుత్వాలపై ప్రధాని మోదీ తప్పుడు ఆరోపణలు చేశారని మండి పడ్డారు. దేశంలో నిరుద్యోగ రేటు పెరుగుతోందని, జీడీపీ రేట్ పడిపోతోందని విమర్శించారు. ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు.
"పదేళ్లుగా అధికారంలో ఉన్నారు. ఇన్నేళ్లలో ఏం చేశారన్నది మాట్లాడకుండా కేవలం కాంగ్రెస్‌ని తిట్టడమే ప్రధాని మోదీ పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికీ ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభాల గురించి మాట్లాడడం లేదు. మోదీ గ్యారెంటీ అంతా కేవలం అబద్ధాలు ప్రచారం చేయడానికే"
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో White Paperలో ప్రస్తావించనున్నట్టు కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చే నాటికి భారత్ జీడీపీ దారుణంగా ఉందని, మోదీ హయాంలోనే దేశం ఈ సమస్య తీరిందని స్పష్టం చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. మన దేశ సామర్థ్యం, భవిష్యత్ గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చాలా గొప్పగా మాట్లాడారని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి చురకలు అంటించారు. అనవసరంగా కొందరు రాష్ట్రపతి ప్రసంగంపై విమర్శలు గుప్పించారని మండి పడ్డారు. ఖర్గే చాలా స్వేచ్ఛగా మాట్లాడారని, ఆయన అంతకు స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చిందా అని తమకే ఆశ్చర్యం కలిగిందని సెటైర్లు వేశారు. తమకు 400 సీట్లు రావాలని ఖర్గే ఇలా ఆశీర్వదించారంటూ సెటైర్లు వేశారు ప్రధాని మోదీ. ఆలోచనల్లోనూ కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని విమర్శించారు.
Also Read: RBI MPC Meet: రెపో రేట్ యథాతథం, మార్కెట్ ఊహించిందే జరిగింది