Asifabad collector: ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోండి, అధికారులకు ఆసిఫాబాద్ కలెక్టర్ సూచనలు
ఎన్నికల నేపథ్యంలో కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు.
![Asifabad collector: ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోండి, అధికారులకు ఆసిఫాబాద్ కలెక్టర్ సూచనలు Collector Borkade Hemant Sahadeva Rao will take strict steps to ensure that elections are held in a peaceful environment Asifabad collector: ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోండి, అధికారులకు ఆసిఫాబాద్ కలెక్టర్ సూచనలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/21/7057f7d5ae2436adfe718a0e3bacbae81697893599220801_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పటిష్ట చర్యలు చేపడతామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు వెల్లడించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు.
శనివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవిఎం గోదాములో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు లతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవిఎం, వి.వి ప్యాట్ల రాండమైజేషన్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంతంగా జరిపేందుకు జిల్లాలో అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలోని 005-ఆసిఫాబాద్, 001-సిర్పూర్ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణను అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
నవంబర్ ౩వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, 10వ తేదీ నామినేషన్ సమర్పించేందుకు ఆఖరు తేది అని, 13న నామినేషన్ల పరిశీలన, 15న అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరణ, 30వ తేదీన పోలింగ్, డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ జరుగుతాయని, ఎన్నికల నిబంధనలు డిసెంబర్ 5వ తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కొరకు జిల్లా వ్యాప్తంగా 597 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ క్రమంలో జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలకు కేటాయించిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వి.వి ప్యాట్ల పంపిణీ ప్రక్రియను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి 380 బ్యాలెట్ యూనిట్లు, 380 కంట్రోల్ యూనిట్లు, 425 వి వి ప్యాట్లు, సిర్పూర్ నియోజకవర్గానికి 366 బ్యాలెట్ యూనిట్లు, 366 కంట్రోల్ యూనిట్లు, 410 వి వి ప్యాట్లు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వి వి ప్యాట్లను స్కానింగ్ చేసి పటిష్ట బందోబస్తు మధ్య తరలించడం జరుగుతుందని, స్ట్రాంగ్ రూముల వద్ద 24 గంటలు పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారని, ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరిస్తున్నమని చెప్పారు. ప్రతి అంశం సిసి కెమెరా పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలే ప్రామాణికమన్నారు. నిబంధనల మేరకు ఎన్నికల ప్రక్రియ జరగడంలో లోపాలు, ఉల్లంఘనలు ఉంటే వాటిని వెంటనే పై స్థాయి అధికారులకు తెలపాలన్నారు. ఎన్నికలకు ముందు రోజే పోలింగ్ కేంద్రానికి చేరుకుని అక్కడి పరిస్థితులు, సౌకర్యాలను పరిశీలించాలని సూచించారు. రాత్రికి అక్కడే బస చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు.
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలు, పీవోలకు, ఏపీవోలకు ఇచ్చిన శిక్షణలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రిని సిద్ధం చేస్తున్న విధానం పట్ల జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు ఎన్నికల పరిశీలకులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ సురేష్, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)