CJI Justice NV Ramana: పార్లమెంట్ చర్చలపై సీజేఐ జస్టిస్ రమణ కీలక వ్యాఖ్యలు... విస్తృతస్థాయి చర్చలు జరగడంలేదని అసంతృప్తి
పార్లమెంట్ లో చట్టాల రూపకల్పనకు ఇటీవల సరైన చర్చలు జరగడంలేదని సీజేఐ జస్టిస్ ఎన్.వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట సభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితే వాటి విశ్లేషణ కోర్టులకు సులభమవుతుందని ఆయన అన్నారు.
పార్లమెంట్ ఓ ప్రజాస్వామ్య దేవాలయం. దేశాభ్యున్నతికి ఉపయోగపడే చట్టాలు రూపుదిద్దుకునే ప్రదేశం. మరి ఆ చట్టాల రూపకల్పనకు సరైన చర్చలు జరుగుతున్నాయా అంటే సందేహమే కలుగుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ చట్టాల రూపకల్పనపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో చట్టాల రూపకల్పనకు విస్తృత స్థాయి చర్చలు జరగడంలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్వం పార్లమెంట్ లో నిర్మాణాత్మక చర్చలు జరిగేవన్నారు. ఈ చర్చల ద్వారా చట్టాల విశ్లేషణకు కోర్టులకు వీలుగా ఉండేదన్నారు. చట్టాల లక్ష్యం, ఉద్దేశం, రూపకల్పన న్యాయస్థానాలకు సులువుగా అర్థమయ్యేదన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం సందర్భంగా పార్లమెంటులో జరిగిన చర్చను జస్టిస్ ఎన్.వి రమణ ఉదాహరించారు.
అప్పట్లో విస్తృత చర్చలు జరిగేవి
75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అండ్ బెంచ్ నిర్వహించిన త్రివర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక వివాదాల చట్టంపై పార్లమెంటులో జరిగిన చర్చ ఇంకా తనకు గుర్తుందని వ్యాఖ్యానించారు. తమిళనాడుకు చెందిన సీపీఎం నేత రామ్మూర్తి ఆ చట్టంపై విస్తృతంగా చర్చించిన విషయాన్ని తెలిపారన్నారు. ఈ చట్టం ఆవశ్యకత, శ్రామిక వర్గంపై దాని ప్రభావాన్ని చాలా చక్కగా వివరించారని గుర్తుచేశారు. ఇతర సందర్భాల్లోనూ చట్టాలపై పూర్తిస్థాయి చర్చలు జరిగేవని ఆయన అన్నారు. దీంతో ఆ చట్టాలు ఎవరిని ఉద్దేశించి తయారు చేశారో కోర్టులకు స్పష్టంగా తెలిసేదన్నారు.
సభల్లో విచారకర పరిస్థితులు
కానీ ప్రస్తుత తరుణంలో ఇలాంటి చర్చలు కనిపించడంలేదన్నారు. పార్లమెంట్ చర్చల విషయంలో విచారకర పరిస్థితులు నెలకొన్నాయని జస్టిస్ ఎన్.వి. రమణ పేర్కొన్నారు. పూర్తి స్థాయి చర్చ జరగకుండానే చట్టాలు ఆమోదం పొందుతున్నాయని ఆవేదక వ్యక్తం చేశారు. ఈ కారణాల వల్ల చట్టాల విశ్లేషణకు గందరగోళం నెలకొందని ఆయన అన్నారు. మేధావులు, న్యాయవాదులు సభలో లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. న్యాయనిపుణులు సామాజిక, ప్రజా జీవితంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు.
అసంపూర్తి చర్చలతో బిల్లులు ఆమోదం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పెగాసస్ పై ఆందోళనలతో ఉభయసభల్లో చట్టాలపై చర్చలు అసంపూర్తిగానే జరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వం బిల్లుల ఆమోదంలో పంతం సాధించుకుంది. ఈ విషయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చర్చలు జరగకుండా బిల్లులు ఆమోదించారని నిపుణులు ఆరోపించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం సాగినప్పటికీ దాదాపు 22 బిల్లులు ఆమోదం పొందాయని కేంద్రం ప్రకటించింది. ఈ బిల్లుల్లో కీలకమైన ఓబీసీ రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ఉంది. పన్ను చట్టాల సవరణ, సాధారణ బీమా విధాన(జాతీయీకరణ) సవరణ, జాతీయ ఆహార సాంకేతికత సంస్థ వ్యవస్థాపన, నిర్వహణ, బాలల న్యాయ సంరక్షణ సవరణ బిల్లులు కూడా ఈ సమావేశాల్లో ఆమోదం పొందాయి. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.